Siddharth Kaushal: ఐపీఎస్‌కి రాజీనామా.. ఎందుకంటే..
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:29 PM
తన పదవికి రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలపై ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ వివరణ ఇచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వ వైఖరి కారణంగానే తాను రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.

అమరావతి, జులై 02: తాను ఐపీఎస్‌కి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు సిద్ధార్థ్ కౌశల్ బుధవారం అమరాతిలో వెల్లడించారు. తన రాజీనామా లేఖను డీజీపీకి పంపినట్లు ఆయన తెలిపారు. తాను ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) విద్యార్దినని.. ఈ నేపథ్యంలో తనకు మంచి ఆఫర్ రావడంతో ఈ ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సిద్ధార్థ్ కౌశల్ వివరణ ఇచ్చారు. తాను ఒత్తిళ్ల కారణంగా ఈ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.
తనపై వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాతే ఉద్యోగానికి రాజీనామా చేయాలని తాను నిర్ణయానికి వచ్చానని కౌశల్ వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్.. తన సొంత రాష్ట్రంగా పరిగణిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. తనకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీనియర్లకు, సహచరులకు ఈ సందర్భంగా సిద్ధార్థ్ కౌశల్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సైతం సమాజానికి సేవ చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
ప్రస్తుతం సిద్ధార్థ్ కౌశల్.. ఏపీ డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అందులోభాగంగా గత కొద్ది రోజులుగా ఆయన విధులకు సైతం హాజరుకావడం లేదని తెలుస్తోంది. గతంలో ఆయన కృష్ణా, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా పని చేశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్లే సిద్ధార్థ్ కౌశర్ రాజీనామా చేస్తున్నారంటూ వైసీపీ ఒక విధమైన ప్రచారానికి తెర తీసింది. అలాంటి వేళ.. సిద్ధార్థ్ కౌశల్.. ఐపీఎస్‌కు తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాననే అంశంపై క్లారిటీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
పార్లమెంటులో భద్రతా వైఫల్యం.. నిందితులకు బెయిల్
For More AP News And Telugu News..