Indias Biggest Railway Station: అదిరేలా అమరావతి రైల్వేస్టేషన్
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:21 AM
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌ను నెక్కల్లు-పెదపరిమి వద్ద నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది

ఆధునిక హంగులతో మోడల్ స్టేషన్
దేశంలోనే అతిపెద్దదిగా నిర్మాణం
ప్రధాన నగరాలతో అనుసంధానం
నెక్కల్లు-పెదపరిమి సమీపంలో ఏర్పాటు
స్టేషన్ నిర్మాణానికి 1500 ఎకరాలు
నంబూరు-ఎర్రుపాలెం మధ్య..
2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వేలైన్
ఈ లైన్‌లో కవచ్ టెక్నాలజీ ఏర్పాటు
తొలిదశ పనులకు రెండు నెలల్లో టెండర్లు
(మంగళగిరి-ఆంధ్రజ్యోతి)
అద్భుత నిర్మాణాలు.. అత్యాధునిక సౌకర్యాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి.. ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా భాసిల్లాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష..! అందుకే ఈ కలల రాజధాని అన్ని రంగాల్లోనూ ప్రత్యేకతను చాటుకొనేలా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. అమరావతి నగరాన్ని రోడ్డు, వాయు, రైలు మార్గాల ద్వారా నేరుగా అనుసంధానించేలా, వాటిలో ఆధునికత ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రైల్వేస్టేషన్‌ను నిర్మించేలా పథకరచన చేశారు. నెక్కల్లు-పెదపరిమి సమీపంలో దేశంలోకెల్లా అతిపెద్ద రైల్వేస్టేషన్‌ను నిర్మించనున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖకు సుమారు 1500 ఎకరాలు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
రెండు మాసాల్లో టెండర్లు
అమరావతి రైల్వేలైన్‌ను రెండు దశలుగా చేపట్టాలని కేంద్ర రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది. మొత్తం 56.53 కి.మీ. రైల్వేలైన్‌లో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి 27 కి.మీ. లైన్‌ను మొదటి దశగా చేపట్టనుంది. దీనికోసం రెండు నెలల్లో టెండర్లను ఆహ్వనించనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. తొలిదశలోనే దాములూరు-వైకుంఠపురం మధ్య కృష్ణానదిపై 3.2 కి.మీ. మేర రైల్వేబ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపడతారు. వచ్చే రెండు నెలల్లోగా భూసేకరణ పూర్తి చేయగలమనే విశ్వాసంతో ఉన్నారు. తొలిదశ పనులకోసం సుమారు రూ.800 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. తాడికొండ మండలంలో రైల్వేలైను కోసం భూములిచ్చేందుకు కొందరు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో అక్కడ భూసేకరణ ఆలస్యమవుతోంది.
అమరావతికి దక్షిణ హద్దు వెంబడే!
అమరావతి రైల్వేస్టేషన్‌ను విమానాశ్రయాల తరహాలో నగర శివారులో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేశంలోకెల్లా ఓ మోడల్ రైల్వేస్టేషన్‌గా అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
మోడల్ స్టేషన్‌గా ఆవిర్భావం
దేశంలో ప్రయాగరాజ్, వారాణసీ, ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వేస్టేషన్లు అత్యంత సుందరంగా ఉన్నాయి. వాటికి దీటుగా అమరావతి రైల్వేస్టేషన్ ఉండబోతుంది. దీని చేరువలో.. ఓ పెద్ద గూడ్స్ యార్డును కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
పరిటాల వద్ద కార్గో టెర్మినల్
ఈ రైల్వేలైన్‌లో కొత్తగా ఏర్పాటవుతున్న ఎన్టీఆర్ జిల్లా పరిటాల స్టేషన్ వద్ద మల్టీమోడల్ కార్గో టెర్మినల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఈ టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని భావిస్తున్నారు. ఈ లైన్‌లో కవచ్ టెక్నాలజీని ఏర్పాటు చేయనున్నారు. రైళ్లు గరిష్టంగా 160 కి.మీ. వేగంతో వెళ్లేలా అమరావతి రైల్వేలైనును పటిష్ఠంగా నిర్మించనున్నారు.
ప్రధాన నగరాలతో అనుసంధానం
అమరావతి నగరానికి రైల్వేలైన్‌ను 2017-18లోనే కేంద్రం మంజూరు చేసినప్పటికీ.. ఈ ప్రాజెక్టు కార్యాచరణ మాత్రం 2024 జూన్ తర్వాతే మొదలైంది. ఖాజీపేట-విజయవాడ సెక్షన్‌లో ఉన్న ఎర్రుపాలెం నుంచి గుంటూరు-విజయవాడ సెక్షన్ మధ్య ఉన్న నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర కొత్త బ్రాడ్‌గేజ్ సింగిల్ రైల్వేలైనుగా నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీనికోసం రూ.2,245 కోట్ల వ్యయం కానుంది. ఈ రైల్వేలైన్ ఏర్పాటుతో అమరావతి నగరం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, చెన్నై నగరాలతో అనుసంధానమవుతుంది. ఎర్రుపాలెం-నంబూరు మధ్య పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేస్తారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, కొప్పురావూరు పెద్దస్టేషన్లుగా, అమరావతి స్టేషన్ అతిపెద్దదిగా ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా దాములూరు, గుంటూరు జిల్లా వైకుంఠపురం నడుమ కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల పొడవున రైల్వేబ్రిడ్జి నిర్మిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. కానీ, మూడేళ్లలోనే పూర్తయ్యేలా చూడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అవసరమైన భూసేకరణ పనులు కూడా చాలా వరకు పూర్తయ్యాయి. ఈ రైల్వేలైన్ కోసం ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు మొత్తం 521.22 ఎకరాలను రైల్వేశాఖ సేకరించింది. గుంటూరు జిల్లాలో 199.71 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 297.21 ఎకరాలు, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 24.01 ఎకరాలను 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్