K. Ram Mohan Naidu : కొత్తగా 120 ప్రాంతాలకువిమాన సౌకర్యం
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:42 AM
విమానాశ్రయాల నిర్మాణం, సీప్లేన్, హెలికాప్టర్లు.. ఇలా ఏదో ఒక రూపంలో కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. మంగళవారం గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ (2025-26)పై ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు.

నాలుగున్నరేళ్లలో కల్పిస్తాం
ఎయిర్ కార్గోతో దేశవిదేశాలకు పంట ఉత్పత్తుల ఎగుమతి
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడి ప్రకటన
కేంద్ర బడ్జెట్‌పై గుంటూరులో చర్చాగోష్ఠి
గుంటూరు, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): వచ్చే నాలుగున్నరేళ్లలో దేశంలో కొత్తగా 120 ప్రాంతాలకు విమాన సౌకర్యం కల్పించబోతున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు తెలిపారు. విమానాశ్రయాల నిర్మాణం, సీప్లేన్, హెలికాప్టర్లు.. ఇలా ఏదో ఒక రూపంలో కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. మంగళవారం గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ (2025-26)పై ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. అశోక్ గజపతిరాజు కేంద్ర పౌరవిమానయాన మంత్రిగా ఉన్న సమయంలోనే మోదీ ప్రభుత్వం ఉడాన్ స్కీమ్‌ను తీసుకొచ్చి మారుమూల ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలను నిర్మించి ఎయిర్ కనెక్టివిటీని పెంచిందన్నారు. ఈ స్కీమ్ గడువు ముగియనుండడంతో మరో పదేళ్లు పొడిగించాలని తాను ప్రతిపాదించగా.. కేంద్రం ఆమోదించి బడ్జెట్‌లో కూడా పొందుపరిచిందని తెలిపారు. పంట ఉత్పత్తులను దేశవిదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎయిర్ కార్గోను మరింతగా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన నష్టం గురించి ఖండాంతరాల్లోనూ చర్చించుకుంటున్నారని తెలిపారు. ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ పెట్టుబడిదారులు ఈ అంశాన్నే ప్రస్తావించారని.. అయితే వారిలో ఉన్న భయాన్ని సీఎం చంద్రబాబు పోగొట్టి పెట్టుబడులపై నమ్మకం కలిగించారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు, ప్రభుత్వ విధానాలను విమర్శించే వాళ్లు బయటకు అడుగు పెట్టడానికి లేదని.. ఎవరైనా మాట్లాడితే జైళ్లలో పెట్టారన్నారు. ఆ రోజున శాంతిభద్రతలు, స్వేచ్ఛ లేవని, ఈ రోజున స్వేచ్ఛ ఉందని.. ఇందుకు ఆ పార్టీ నాయకులు బయటకు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండడమే నిదర్శనమని చెప్పారు.
‘టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో ఎన్నో చేసింది. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన విధంగా పెన్షన్ రూ.వెయ్యి పెంచి బకాయి సహా తొలి నెల రూ.7 వేలు చెల్లించాం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం నుంచి రూ.10,400 కోట్లు విడుదల చేయించాం. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు, హడ్కో ద్వారా మరో రూ.17 వేల కోట్లు సాధించాం. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,130 కోట్లు తెచ్చాం. విశాఖలో రైల్వేజోన్ కార్యాలయం నిర్మాణానికి స్థలమిచ్చి గత నెలలోనే ప్రధాని చేతుల మీదగా శంకుస్థాపన చేయించాం. జలజీవన్ మిషన్ స్కీమ్‌ను మరో పదేళ్లు పొడిగించేలా చేసి రాష్ట్రానికి రూ.70 వేల కోట్ల మంజూరు కోసం చర్యలు చేపట్టాం. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఈ ఏడు నెలల పాలనలో నిధులు సాధించాం’ అని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, బూర్ల రామాంజనేయులు, ఎండీ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బీజేపీ నాయకులు జూపూడి రంగరాజు, చెరుకూరి తిరుపతిరావు, వల్లూరి జయప్రకా్‌షనారాయణ, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.