Share News

Revenue Department: అసైన్డ్‌ అక్రమాల్లో ఐఏఎస్‌లు

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:16 AM

అసైన్డ్‌ భూములకు శాశ్వత హక్కులు కల్పించేందుకు గత జగన్‌ ప్రభుత్వం 2023లో ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం-1977ను(పీవోటీ) సవరించింది.

Revenue Department: అసైన్డ్‌ అక్రమాల్లో ఐఏఎస్‌లు

చట్ట విరుద్ధంగా లక్షలాది ఎకరాల భూమి ఫ్రీహోల్డ్‌

జీవో 596కు భిన్నంగా నిషేధ జాబితా నుంచి తొలగింపు

వేగంగా ఫైళ్లు క్లియర్‌ చేయాలని తహశీల్దార్లపై ఒత్తిళ్లు

కీలక పోస్టుల్లో ఉండి అక్రమాలకు సహకరించినట్లు గుర్తింపు

సీఎం చంద్రబాబుకు నివేదికసమర్పించిన రెవెన్యూ శాఖ

వీరిపైనా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సిఫారసు

  • వైసీపీ నేతలకు ఏడుగురు అధికారుల వత్తాసు

జగన్‌ హయాంలో యథేచ్ఛగా సాగిన అసైన్డ్‌ భూముల అక్రమాలకు తెర వెనుక నుంచి సహకరించినవారెవరో తెలిసిపోయింది. జీవో 596కు విరుద్ధంగా 5.75 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూమి ఫ్రీహోల్డ్‌ ఎలా అయిందనే గుట్టు ఇప్పుడు రట్టు అయింది. వైసీపీ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు నాడు కొందరు ఐఏఎస్‌ అధికారులు కొమ్ము కాసిన విషయం బయటపడింది. ఏడు జిల్లాల పరిధిలో రెవెన్యూ శాఖ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. రెండు జిల్లాలకు చెందిన ప్రస్తుత కలెక్టర్లు, ఐదు జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల(జేసీ) పాత్రను వెలికితీసింది. వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ నివేదిక ఇచ్చింది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): అసైన్డ్‌ భూములకు శాశ్వత హక్కులు కల్పించేందుకు గత జగన్‌ ప్రభుత్వం 2023లో ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం-1977ను(పీవోటీ) సవరించింది. అసైన్‌మెంట్‌ కాలపరిమితిలో 20 ఏళ్లు దాటిన భూములను నిషేధ జాబితా నుంచి తొలగించి (ఫ్రీహోల్డ్‌) లబ్ధిదారుల పేరిట శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చేందుకు అదే ఏడాది డిసెంబరు 19న జీవో 596 జారీ చేశారు. ఆ ఉత్తర్వులోని మార్గదర్శకాల ప్రకారమే ఫ్రీహోల్డ్‌ చేయాలి. జిల్లా స్థాయిలో జేసీలు ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ జీవో రాకముందే, ఆ ఏడాది ఆగస్టు నుంచే వేలాది ఎకరాల భూములను అక్రమంగా నిషేధ జాబితా నుంచి బయటకు తెచ్చారు. 2023 డిసెంబరు 20 నుంచి 2024 జూలై వరకు 13.54 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను ఫ్రీహోల్డ్‌ చేశారు. అందులో జీవో 596కి విరుద్ధంగా నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములు 5.75 లక్షల ఎకరాలు. దీనిపై లోతైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖను సీఎం చంద్రబాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశించారు.


ఈ నేపథ్యంలో ఫ్రీహోల్డ్‌ అక్రమాలపై ఆ శాఖ ఉన్నత స్థాయి విచారణ జరిపింది. జీవో 596 ఉల్లంఘనతో పాటు, చట్టపరిధిలో లేని భూములు, రికార్డులు లేనివి, సర్వీస్‌ ఇనాం, షరతు గల పట్టా, చుక్కల భూములను కూడా భారీగా ఫ్రీహోల్డ్‌ చేశారని గుర్తించింది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్‌, మరికొన్ని చోట్ల జేసీ స్థాయి అధికారులే వైసీపీ నేతల అక్రమాలకు కొమ్ముకాసినట్లు స్పష్టమైంది. దీంతో కలెక్టర్‌, జేసీ ప్రభావంతో అక్రమంగా ఫ్రీహోల్డ్‌ అయిన భూములు, తహశీల్దార్‌ పరిధిలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై రెవెన్యూ అధికారులు సమగ్ర నివేదికను సిద్ధం చేశారు.


ఐఏఎ్‌సల అక్రమాల బాట

జీవో 596కు విరుద్ధంగా, అసైన్డ్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 5.75లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేశారు. అందులో అసైన్‌మెంట్‌ అయినట్లుగా రికార్డులే లేని భూమి 2.69 లక్షల ఎకరాలు, కాలపరిమితి దాటనివి 32వేల ఎకరాలు కాగా, కలెక్టర్‌ ఉత్తర్వుతో సంబంధం లేకుండా ఫ్రీహోల్డ్‌ అయినవి 60వేల ఎకరాలున్నాయు. దీనివెనుక కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, మరికొన్ని జిల్లాలో జేసీల పాత్ర, ఒత్తిళ్లు, సొంత ప్రయోజనాలు ఉన్నట్లు తేలింది. ఇందులో టాప్‌-5 జిల్లాలలో ప్రధానంగా ఏడుగురు అధికారుల పాత్రను గుర్తించారు.


  • జగన్‌ జమానాలో రాయలసీమలోని ఓ జిల్లాకు ఆ అధికారి జేసీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన్ను అదే జిల్లాకు కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. ఆయన జేసీగా ఉన్నప్పుడు భారీగా భూముల ఫ్రీహోల్డ్‌ జరిగింది. ఇందులో ఈ అధికారి తప్పిదాలు, ఒత్తిళ్లు, నిర్లక్ష్యం చాలా ఉందని గుర్తించారు.

  • కోస్తాకు చెందిన ఓ జిల్లా కలెక్టర్‌... జేసీ సంతకాలు లేకుండానే ఫైళ్లను క్లోజ్‌ చేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఈయన విద్యుత్‌రంగంలో పనిచేస్తున్నారు.

  • కోస్తాలో కరువు జిల్లాలో జేసీగాచేసి ఇప్పుడు ఓ సంపన్న జిల్లాకు కలెక్టర్‌గా ఉన్న అధికారి పాత్ర కూడా నిర్ధారణైంది.

  • గతంలో సీమలో కొద్దికాలం జేసీగా పనిచేసిన అధికారి సర్వీస్‌ ఇనాం, చుక్కల భూములను అడ్డగోలుగా ఫ్రీహోల్డ్‌ చే శారని తేల్చారు. ఇప్పుడు ఆయన సీమలో ఓ జిల్లాకు కలెక్టర్‌గా ఉన్నారు.

  • ఎన్నికలకు ముందు పుణ్యక్షేత్ర జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన ఓ అధికారి బదిలీకి ముందు 6వేల ఎకరాల అసైన్డ్‌ భూముల ఫైళ్లను క్లియర్‌ చేశారని గుర్తించారు. ప్రస్తుతం ఈయన కోస్తాలో ప్రముఖ జిల్లాకు కలెక్టర్‌గా ఉన్నారు.


అసైన్డ్‌ అక్రమాల్లో టాప్‌-1గా నిలిచిన రాయలసీమ జిల్లాకు ఓ ఐఏఎస్‌ జేసీగా పనిచేశారు. ఆ జిల్లా వైసీపీ కీలక నేతతో ఆయన అంటకాగారు. పెద్దల ఒత్తిళ్లతో రికార్డులు లేని అసైన్డ్‌ భూమిని కూడా ఫ్రీహోల్డ్‌ చేశారని వెలుగు చూసింది. కూటమి వచ్చాక ఆయన్ను అక్కడే 2 నెల లపాటు కొనసాగించింది. అప్పటికే అసైన్డ్‌ ఆరోపణలు రావడంతో ఆయన్ను మరో కరువు జిల్లాకు జేసీగా బదిలీ చేశారు.

అక్రమాలను తొక్కిపెట్టి నివేదికలు

ఉత్తరాంధ్రలోని ఓ జిల్లాకు ఆయన జేసీగా ఉన్నారు. జగన్‌ జమానాలో నాటి ప్రభుత్వ పెద్దలు, ఓ ముఖ్య అధికారి, ఆయన అల్లుడు, కుమారుడు, ఇతర కీలక వ్యక్తులు ఆ జిల్లా కేంద్రంలో భారీగా భూములు కొన్నారు. వందల ఎకరాల అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. జిల్లా కీలక అధికారిగా ఉన్న ఈయనే ఆ భూములకు సంబంధించిన సమాచారం వారికి అందించారన్న ఫిర్యాదులున్నాయి. ఇప్పటికీ ఆయన అదే పోస్టులో ఉండటంతో ఆ జిల్లాలో అసైన్డ్‌ భూముల అక్రమాలు జరగనేలేదని నివేదికలు వచ్చాయి. దీంతో సర్కారు కూడా విస్మయానికి గురైంది. ఆ అధికారిని కొనసాగించడం వల్లే అక్రమా లు బయటకు రావడం లేదని రెవెన్యూ శాఖ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.


మా కలెక్టర్‌ను మార్చేయండి

తమ కలెక్టర్‌ను మార్చాలని డిమాండ్‌ చేస్తూ రాయలసీమలోని ఓ జిల్లా ప్రజాప్రతినిధులు ఇటీవల సీఎంవోలో ఫిర్యాదు చేశారు. ఫ్రీహోల్డ్‌ అక్రమాల సమయంలో ఆయనే జేసీగా ఉన్నారని, ఆనాటి అక్రమాలపై ఇప్పుడు విచారణ జరుగుతుంటే ఆయనే కలెక్టర్‌గా ఉన్నారని, ఆయన ఉం టే అసలు దోషులు బయటకు రారని నివేదించారు. ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి, ఇన్‌ చార్జి మంత్రికి ఈ విషయం పెద్ద తలనొప్పిగా మారింది. తప్పులు చేశారని రెవెన్యూ శాఖ గుర్తించిన అధికారుల జాబితాలో ఈయన కూడా ఉన్నారు. ఫ్రీహోల్డ్‌ అక్రమాలపై రెవెన్యూ శాఖ సమర్పించిన నివేదికపై సీఎం ఏం చర్యలు తీసుకుంటారన్నది ఇటు ఉద్యోగ వర్గాలు, అటు ఐఏఎ్‌సల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jun 26 , 2025 | 06:46 AM