Share News

AP High Court: వంశీ బెయిల్‌ పిటిషన్‌పై 2న నిర్ణయం

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:39 AM

గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి కేసులో వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం మే 2న నిర్ణయం వెల్లడించనుంది.

AP High Court: వంశీ బెయిల్‌ పిటిషన్‌పై 2న నిర్ణయం

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): గన్నవరం టీడీపీ కార్యాలయంపై మూకదాడి వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు మరికొందరు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో పిటిషన్లపై వచ్చే నెల 2న నిర్ణయం వెల్లడిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నీలోత్పల్‌ వాదనలు వినిపించారు. కేసుకి సంబంధించి మే 2న ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామన్నారు. ఛార్జ్‌షీట్‌ దాఖలుకు 90 రోజుల గడువు ఉందన్నారు. వంశీ, ఇతర నిందితులు ఫిర్యాదుదారుడిని కిడ్నాప్‌ చేసి, బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌, న్యాయవాది సత్యశ్రీ వాదనలు వినిపించారు. వంశీని అరెస్ట్‌ చేసి ఇప్పటికే 60 రోజులు గడిచాయని, పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదని చెప్పారు. బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.

Updated Date - Apr 29 , 2025 | 05:40 AM