Coastal Andhra Rain: కురిసింది వాన
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:58 AM
ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది.

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం
కొన్ని చోట్ల కొనసాగిన ఎండ తీవ్రత
కోస్తా, సీమకు నేడు, రేపు భారీ వర్షాలు
ఖరీఫ్ పంటలకు ఊపిరి.. రైతుల సంతోషం
వరి సాగు ముమ్మరం
విశాఖపట్నం, అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దక్షిణ కోస్తా మీదుగా తూర్పు, పడమరకు, ఉత్తర బిహార్ నుంచి ఒడిశా వరకు వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులు, భూ ఉపరితలంపై నెలకొన్న ఎండ తీవ్రతతో అనిశ్చితి వాతావరణం నెలకొంది. ఈ ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచి కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం సాయంతం రెండు గంటలపాటు తెరిపిలేకుండా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ నీరు భారీగా నిలిచి ప్రధాన రోడ్లు కాలువలను తలపించాయి. చాలాచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మందసలో 81 మిల్లీమీటర్లు, టంగుటూరులో 74.75, రణస్థలంలో 70.75, డెంకాడలో 51, గోవిందపురంలో 47.75 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అయితే కోస్తాలో పలుచోట్ల తీవ్రమైన ఎండ, ఉక్కపోత నెలకొంది. నర్సాపురం, కావలిలో 38 డిగ్రీలు, బాపట్ల, ఒంగోలులో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఎక్కువచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, 23వ తేదీ వరకు కోస్తా, 22 వరకు రాయలసీమలో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో ఈ నెల 24వ తేదీ వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 24న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. కాగా, రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
అన్నదాతల సంతోషం..
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ పంటలు ఊపిరి పోసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు వచ్చాక.. జూన్‌లో తొలకరి వర్షాలకు చాలా మంది రైతులు విత్తనాలు నాటారు. ఇప్పటి వరకు 10లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. కానీ మొన్నటి దాకా రుతుపవనాలు మందగించడంతో మెట్ట పంటలకు నీటి తడులు అందక పైర్లు ఎండుముఖం పట్టి రైతులు సతమతమవుతున్నారు. ఈ తరుణంలో ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రుతుపవనాల్లో కదలిక వచ్చి.. గత నాలుగైదు రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు పడుతున్నాయి. దీంతో పైర్లన్నీ జీవం పోసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా పత్తి, వేరుశనగ, కంది, మినుము, పెసర, చిరుధాన్యాల పంటలకు ఈ వర్షాలు మేలు చేస్తాయని రైతులు చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత వర్షాలు పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో సాగు చేయాల్సిన మిగిలిన విస్తీర్ణంలో పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి, రాష్ట్రంలోని జలాశయాలకు నీరు చేరడంతో కృష్ణా, గోదావరి డెల్టాలోని ఆయకట్టుకు ఇరిగేషన్‌శాఖ కాలువల ద్వారా నీరు విడుదల చేసింది. దీంతో వరి సాగు ముమ్మరంగా జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News