Share News

Jagan Tour Death: జగన్ పర్యటనలో మరొకరు బలి

ABN , Publish Date - Jun 18 , 2025 | 03:57 PM

Jagan Tour Death: మాజీ సీఎం జగన్ పర్యటనలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సత్తెనపల్లి క్లాక్ టవర్ వద్ద ఓ వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు.

Jagan Tour Death: జగన్ పర్యటనలో మరొకరు బలి
YS Jagan Tour, One More Person Died

పల్నాడు, జూన్ 18: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) జిల్లా పర్యటనలో మరో అపశృతి చోటు చేసుకుంది. ఇప్పటికే జగన్ కాన్వాయ్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందగా.. ఇప్పుడు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద ఆ పార్టీకి చెందిన కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సత్తెనపల్లి కి చెందిన జయవర్దన్ రెడ్డిగా గుర్తించారు. జయవర్దన్ రెడ్డి సత్తెనపల్లిలో ఆటోమొబైల్ షాపును నిర్వహిస్తున్నాడు.


అయితే క్లాక్ టవర్ వద్ద జగన్ రెడ్డి రాకతో ఒత్తిడి పెరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న జయవర్దన్ ఊపిరి ఆడక కిందపోయాడు. జగన్ కాన్వాయ్ వెళ్లాక వ్యక్తి పడిపోయి ఉండటాన్ని గుర్తించి తోటి కార్యకర్తలు అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. కాగా.. ఈరోజు ఉదయం ఏటూకూరులో సింగయ్య అనే వృద్ధుడిని వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఢీకొట్టింది. దీంతో అతడు మృతిచెందాడు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు భారీ కాన్వాయ్‌తో జగన్ బయలుదేరగా.. ఏటుకూరు బైపాస్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడు సింగయ్యను జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సింగయ్య మృతి చెందాడు. అయితే వృద్ధుడిని ఢీకొన్న తర్వాత కూడా జగన్, వైసీపీ నేతలు పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.


నిబంధనలకు విరుద్ధంగా వందలాది వాహనాలతో బలప్రదర్శన చేస్తూ జగన్ రెంటపాళ్ల వస్తుండగా.. ఇప్పటికి ఇద్దరు వ్యక్తులు మరణించారు. జగన్ తాడేపల్లి నుంచి సత్తెనపల్లి చేరుకుని రెంటపాళ్లకు వెళ్లకముందే ఇద్దరు చనిపోయిన ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పర్యటనలో వంద మందికి మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పినప్పటికీ వందలాది వాహనాలతో, వేలాది మంది కార్యకర్తలతో తరలివచ్చి చావులకు కారణం అవడంపై సత్తెనపల్లితో పాటు పల్నాడు జిల్లాకు చెందిన ప్రజలు జగన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

రెచ్చిపోయిన అంబటి సోదరులు

లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డికి మరో షాక్

నెలరోజుల తర్వాత విశాఖలో సన్నీ భయ్యా ప్రత్యక్షం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 18 , 2025 | 04:38 PM