Alapati Raja: లోకేష్‌ను ముట్టుకుంటే మసైపోతారు
ABN , Publish Date - Mar 04 , 2025 | 03:23 PM
Alapati Raja: కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. గుంటూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ నుంచి డిక్లరేషన్ ఆయన అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

గుంటూరు, ఫిబ్రవరి 04: విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను ముట్టుకుంటే మసైపోతారని వైసీపీ నేతలను గుంటూరు - కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన కూటమీ అభ్యర్థి ఆలపాటి రాజా హెచ్చరించారు. చిన్న వయసులోనే నారా లోకేష్ పరిణితి చూపించి తమ విజయాలకు తోడ్పడ్డారన్నారు. తన విజయం ఒక చరిత్ర అని ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్సీగా విజయాన్ని అందుకొన్న ఆయన మంగళవారం గుంటూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చేతుల మీదగా డిక్లరేషన్ అందుకున్నారు.
అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఇది గొప్ప విజయంగా తాను భావిస్తున్నానన్నారు. 33 నియోజకవర్గాల పట్టభద్రులు.. తమ ఓటు వినియోగించుకుని తనను ఎన్నుకోవటం గొప్ప అదృష్టంగా తాను భావిస్తున్నానన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను 83 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించానని తెలిపారు. తన ప్రత్యర్థికి 63 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఎవరి మోచేతి నీళ్ళు తాగటానికి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారని ప్రశ్నించారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. మరోవైపు వీసీలను భయపెట్టి రాజీనామా చేయించారంటూ మండలిలో చర్చ నడుస్తోందన్నారు.
అయితే తమ ప్రభుత్వం యూనివర్సిటీలను ప్రత్యేక గురుకులాలుగా భావించిందని తెలిపారు. మద్యం తాగే వారి వద్ద టీచర్లను తమ ప్రభుత్వం నియమించలేదన్నారు. యూనివర్సిటీలు రాజకీయాలకు నిలయాలుగా మారిన నేపథ్యంలో వాటి పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తుంటే తమ పై విమర్శలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధప్రదేశ్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ మార్చి 3వ తేదీన ప్రారంభమైనాయి. కృష్ణా - గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. కేఎస్ లక్ష్మణ రావుపై ఆయన విజయం సాధించారు. ఈ ఎన్నికల కౌంటింగ్‌లో ప్రతి రౌండ్‌లో ఆలపాటి రాజా అధిక్యతను కనబరిచారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందారు.
మరోవైపు ఆలపాటి రాజా గతంలో తెనాలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే చంద్రబాబు కేబినెట్‌లో సైతం ఆయన మంత్రిగా కొనసాగారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి బరిలో నిలిచాయి. సీట్ల సర్ధుబాటులో భాగంగా తెనాలి అసెంబ్లీ స్థానం జనసేనకు వెళ్లింది. ఈ స్థానం నుంచి నాదెండ్ల మనోహర్ గెలుపొందారు. దీంతో ఆలపాటి రాజాను కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు.
For AndhraPradesh News And Telugu News