Guntur : విద్యుదాఘాతంతో నలుగురు దుర్మరణం
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:26 AM
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో విద్యుదాఘాతంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

గోశాలలో బావి శుభ్రం చేస్తుండగా ప్రమాదం
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో ఘటన
పెదకాకాని, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో విద్యుదాఘాతంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సోమవారం నంబూరు కాళీ బాబా ఆశ్రమం సమీపంలోని గోశాలలో జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని చినరావూరుకు చెందిన గండాల మహంకాళి (29), అదే ప్రాంతానికి చెందిన వేటగిరి బాలయ్య (45), దుగ్గిరాల మండలం పెనుమూడి గ్రామానికి చెందిన యాకుల రాజేష్ (20) గత సంవత్సర కాలంగా గోశాలలో కూలీలుగా పనిచేస్తున్నారు. గోశాలలో సేవ చేేసందుకు సత్తెనపల్లి సమీపంలోని కట్టమూరు గ్రామానికి చెందిన మండాది కాళీ బాబు(52) గోశాల వద్దకు వచ్చాడు. గోశాలలోని వరల బావిలో దిగి శుభ్రం చేేస క్రమంలో లోపల ఉన్న నీటిని బయటికి పంపేందుకు విద్యుత్ కంప్రెషర్‌తో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కంప్రెషర్‌కు ఉన్న వైర్లు తెగి విద్యుత్ సరఫరా అయింది. బావిలో దిగేటప్పుడు ఇనుప నిచ్చెన వేసుకొని దిగడంతో తొలుత మహంకాళి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఇది గమనించి కాపాడే ప్రయత్నంలో రాజేష్, బాలయ్య, కాళీ బాబు కూడా విద్యుదాఘాతానికి గురై నిమిషాల వ్యవధిలోనే నలుగురూ దుర్మరణం చెందారు. ఘటనా స్థలాన్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు.
మంత్రి గొట్టిపాటి దిగ్ర్భాంతి
గుంటూరు జిల్లా పెదకాకాని విద్యుదాఘాతం దుర్ఘటనపై ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రదిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఽధూళిపాళ నరేంద్రతో ఈ ఘటనపై గొట్టిపాటి ఆరాతీశారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.