Actress Paakeeza: పాపం పాకీజా
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:40 AM
పాకీజా అలియాస్ వాసుగి. 1990 దశకంలో ఆమె పాత్ర లేకుండా తెలుగు సినిమాలు విడుదల కాలేదు. ఆ పాత్ర వెండి తెర మీద కనిపిస్తేనే నవ్వులు పూసేవి.

పొట్ట కూటి కోసం సీనియర్ సినీ నటి భిక్షాటన
తమిళ సినీ పరిశ్రమ తనకు సాయం చెయ్యలేదని వెల్లడి
ఏపీ ప్రభుత్వ కరుణ కోసం గుంటూరులోఎదురుచూపు
గుంటూరు సిటీ, జూన్ 27(ఆంధ్రజ్యోతి): పాకీజా అలియాస్ వాసుగి. 1990 దశకంలో ఆమె పాత్ర లేకుండా తెలుగు సినిమాలు విడుదల కాలేదు. ఆ పాత్ర వెండి తెర మీద కనిపిస్తేనే నవ్వులు పూసేవి. గతంలో ఎందరినో నవ్వించిన ఆమె, పూట గడవడం కోసం భిక్షాటన చేేస దుస్థితిలో ఉన్నారు. తమిళ సినీ పరిశ్రమలో ఎంతోమంది శ్రీమంతులుఉన్నప్పటికీ ఏ ఒక్కరూ సాయం చేయక పోవటంతో ఆంధ్రప్రదేశ్‌లోనైనా ఆదరణ దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిేసందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం చెన్నై నుంచి గుంటూరు వచ్చిన ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘నా అసలు పేరు కె.వాసుగి. సొంత ఊరు తమిళనాడులోని శివగంగై జిల్లా కారైకుడి.
1987లో ఎన్ ఊయిర్ కన్నమ్మ సినిమా ద్వారా సినీ రంగంలో ప్రవేశించా. తమిళ సినిమాల్లో నన్ను చూసిన మోహన్‌బాబు మొట్టమొదటిసారి తెలుగు సినిమాలో అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పేరుతో చేసిన పాత్ర మంచి పేరు తెచ్చింది. రౌడీ గారి పెళ్ళాం, మామగారు, రౌడీ ఇన్‌స్పెక్టర్, చిట్టెమ్మ మొగుడు, బ్రహ్మ, పెదరాయుడు, రౌడీ ఎమ్మెల్యే, అమ్మ రాజీనామా, సీతారత్నం గారి అబ్బాయి, అన్నమయ్య సహా చాలా సినిమాల్లో నటించాను’’ అని పాకీజా చెప్పారు.
జయలలిత నుంచి పిలుపు
వరుస సినిమాలతో బిజీగా సమయంలో తమిళనాడు సీఎం జయలలిత నుంచి కబురు వచ్చిందని పాకీజా తెలిపారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా పనిచేయాలని చెప్పడంతో అక్కడ రాజకీయాల్లో బిజీ అయ్యానని, ఫలితంగా సినిమాల్లో నటించడం కుదరలేదన్నారు. అదే తన జీవితాన్ని పాడు చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా ఉన్న నేను అక్కడ ఉన్న రాజ్‌కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా పెళ్లి ఇష్టం లేని నా అత్తమామలు వేధించేవారు. నా భర్త తాగుడుకు బానిసై ఉన్న బంగారం, డబ్బు అంతా పాడు చేశాడు. కొద్ది రోజులకు ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో అత్తామామలు నన్ను ఇంటి నుంచి తరిమేశారు. అప్పటికే నాన్న చనిపోవటంతో అమ్మ దగ్గరికి చేరాను. నా దగ్గర ఉన్న కొద్ది సొమ్మును అమ్మ క్యాన్సర్ వైద్యం కోసం ఖర్చు చేశాను. జయలలిత ఉన్నంత కాలం తింటానికి.. ఉంటానికి కొదువలేదు. ఆమె మరణించిన తరవాత నా పరిస్థితి పూర్తిగా దిగజారింది.
ఇప్పుడు పూట గడవడం చాలా కష్టంగా వుంది. ఒక్కోసారి భిక్షాటన చెయ్యాల్సిన స్థితిలో ఉన్నా. నా దుస్థితి చెబుతూ వీడియోలు తీసి తమిళ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరికీ పంపాను. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, మోహన్‌బాబు కుటుంబం స్పందించి చనిపోయే స్థితిలో ఉన్న నన్ను బతికించారు. ఆరోజు వాళ్లు కూడా స్పందించకపోతే ఎప్పుడో ప్రాణం పోయేది’’ అని పాకీజా తెలిపారు. కాగా.. ప్రస్తుతం దుర్భర స్థితిలో ఉన్న నటి తనకు సహాయం చేయాలనుకునే వారు 81488 8625 నంబర్‌లో సంప్రదించవచ్చని పాకీజా కోరారు.
ఏపీ సీఎం ఆదుకోవాలి
నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చి అన్నం పెట్టింది తెలుగు వారే. ఇప్పుడు అదే తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు స్పందించి నన్ను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసి నా గోడు వినిపించుకుందామని ప్రయత్నిస్తున్నా. నాకు పెన్షన్ సౌకర్యం కలిపిస్తా ఉన్నంత కాలం వారి పేరు చెప్పుకొని బతుకుతాను. అవసరం అయితే నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు వారి కోసం ఊరు ఊరు తిరిగి ప్రచారం చెయ్యమన్నా చేస్తాను. ఇదే విషయం చంద్రబాబును కలిసి చెప్పాలన్నది నా కోరిక.