Share News

Warehouse : దేశంలోనే తొలి కృత్రిమ మేధ రోబోటిక్‌ గిడ్డంగి!

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:44 AM

దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా కృత్రిమ మేధతో ఈ రోబోటిక్‌ గ్రెయిన్‌ స్టోరేజ్‌ గిడ్డంగిని మచిలీపట్నం పోర్టు సమీపంలో నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Warehouse : దేశంలోనే తొలి కృత్రిమ మేధ రోబోటిక్‌ గిడ్డంగి!

  • బందరు పోర్టు సమీపంలో రూ.25 కోట్లతో నిర్మాణం

  • హమాలీలతో పనిలేదు.. తూకంలో తేడాలకూ చెక్‌

  • మానవ రహితంగా రోబోటిక్‌ సేవల వినియోగం

  • రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రతిపాదన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మానవ రహిత, ఆధునిక సాంకేతిక, అధునాతన సౌకర్యాలతో 10వేల టన్నుల సామర్థ్యం గల ఆటోమేటిక్‌ ఇంటిగ్రేటెడ్‌ గిడ్డంగి రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా కృత్రిమ మేధతో ఈ రోబోటిక్‌ గ్రెయిన్‌ స్టోరేజ్‌ గిడ్డంగిని మచిలీపట్నం పోర్టు సమీపంలో నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్నపూర్ణ-ఏపీ పేరుతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దీనిని ప్రతిపాదించింది. దీన్ని అల్ర్టా మోడరన్‌ టెక్నాలజీతో డిజైన్‌ చేశారు. బందరు పోర్టును దృష్టిలో ఉంచుకుని, పోర్టును ఆనుకుని ఉన్న మునిసిపల్‌ స్థలంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా దీనిని నిర్మించనున్నారు. దేశంలోనే కృత్రిమ మేధతో మానవ రహిత సేవలు, అధునాతన సౌకర్యాలు, ఆధునిక సాంకేతికతతో నిర్మించే తొలి గిడ్డంగి ఇదే కానున్నది. సాధారణంగా 10వేల టన్నుల గిడ్డంగి నిర్మాణానికి రూ.15కోట్లు ఖర్చయితే.. ఈ గిడ్డంగి నిర్మాణానికి రూ.25 కోట్లు వ్యయం కానున్నది. హమాలీలతో పని లేకుండా.. ఆహార ధాన్యాల నిల్వ నష్టాలు, తూకంలో తేడాలు, దొంగతనాలు వంటివి జరగకుండా పౌరసరఫరాలు, ఎఫ్‌సీఐ, నాఫెడ్‌ సంస్థల కోసం దీనిని నిర్మించనున్నారు. ప్రస్తు త గిడ్డంగులకు చెల్లిస్తున్న అద్దె కన్నా 25ు తక్కువ వ్యయంతో ఉత్పత్తులను ఇందులో నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సాంప్రదాయ గిడ్డంగుల్లో చదరపు మీటరు స్థలంలో 1.5 టన్నుల సరుకు నిల్వ చేస్తే.. ఈ గిడ్డంగిలో చదరపు మీటరులో 5 టన్నులు నిల్వ చేయవచ్చు. నిధులు మంజూరైతే త్వరలో నిర్మాణాన్ని చేపట్టనున్నారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 03:44 AM