FiberNet Employee Termination: ఫైబర్‌నెట్ ఖాళీ
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:54 AM
ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో 248 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. వీరిలో అధికంగా వైసీపీ కార్యకర్తలు ఉండగా, దీని వల్ల వైజాగ్ నాక్ మూతపడే పరిస్థితి ఏర్పడింది

248 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఒకేసారి వేటు
ప్రత్యామ్నాయ సిబ్బందిని భర్తీచేయకుండా కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం రద్దు
దీంతో వైజాగ్ నాక్ దాదాపు మూతబడినట్లే
సీఎం దృష్టి సారించాలంటున్న ప్రభుత్వ వర్గాలు
అమరావతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో ఒకేసారి 248 మంది అవుట్‌సోర్సింగ్‌ను తొలగించారు. వీరిలో అత్యధికులు జగన్ జమానాలో నియమితులైన వైసీపీ కార్యకర్తలే. వీరిని తీసేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పెద్దఎత్తున డిమాండ్ వ్యక్తమైంది. నిన్నమొన్నటిదాకా ఉన్నతాధికారులు దీనిపై స్పందించనే లేదు. వారిని తొలగించాలని భావించినా నిర్ణయం తీసుకోకుండా నాన్చారు. ఇప్పుడు ఆకస్మికంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు సంస్థతో ఒప్పందాన్ని శుక్రవారం రద్దు చేసేశారు. దీంతో 248 మంది ఉద్యోగులను తొలగించినట్లయింది. వీరిలో సాంకేతికంగా కీలకమైన ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిలో చాలా మంది వైజాగ్ నెట్‌వర్క్ ఆపరేషన్ సెంటర్ (నాక్)లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిని తీసేయడంతో నాక్ దాదాపు మూతపడే పరిస్థితి ఏర్పడింది. అక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కరించేవారు కరువవుతారు. ఇప్పుడక్కడ మిగిలింది సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే. సాంకేతిక సిబ్బందిని కొత్తగా నియమించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తొలగించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా వేటువేయాల్సింది వైసీపీ జమానాలో నియమితులైనవారిపై కాగా.. 2014-19 నడుమ టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన సాంకేతిక సిబ్బందినీ తీసివేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో పాటు కార్పొరేషన్‌పై పూర్తి స్థాయిలో సమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఆయన మానసపుత్రికగా బావించే ఫైబర్‌నెట్‌ను బలోపేతం చేస్తే.. యువతకు ఉద్యోగాల కల్పనతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌నెట్ సేవలను విస్తృతంగా అందించేందుకూ వీలుంటుందని చెబుతున్నాయి. 2014- 19 మధ్య కాలంలో వెలుగు వెలిగిన ఏపీ ఫైబర్‌నెట్ ఇప్పుడు దివాలా అంచుల్లోకి వెళ్లిపోయింది. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో రూ.2,171 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. కనెక్షన్లు 12 లక్షల నుంచి ఐదు లక్షలకు పడిపోయాయి. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఫైబర్‌నెట్ అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ ఐదేళ్లలో రూ.5,400 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగగా.. ఇందులో రమారమి రూ.500 కోట్ల దాకా అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేల్చారు. ఉద్యోగులుగా నియమితులైన వైసీపీ కార్యకర్తలు ఆసలు కార్యాలయాలకే రాకున్నా నిన్నమొన్నటివరకు వేతనాలు ఇవ్వడం గమనార్హం.