Sajjala Ramakrishna Reddy: సజ్జలకు చెప్పి మెడికల్ సీటు ఇప్పిస్తా
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:16 AM
వైసీపీ హయాంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పి మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ ఆయన సన్నిహితుడు రూ. 1.20 కోట్లు నొక్కేశాడు. బెంగళూరు రామయ్య మెడికల్ కళాశాలలో సీటు వచ్చినట్లుగా నకిలీ ఆఫర్ లెటర్ చేతికి ఇచ్చి ఘోరంగా మోసం చేశాడు

రూ.1.20 కోట్లు నొక్కేసిన ఆయన సన్నిహితుడు
నకిలీ ఆఫర్ లెటర్‌తో బాధితుడికి టోకరా
అడపా ప్రేమ్‌చంద్‌పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు
విజయవాడ పిన్నమనేనిలో సీటుకు 2 కోట్లు డీల్
ఆ తర్వాత ఆ రేటును 4 కోట్లకు పెంచిన వైనం
బెంగళూరులో సీటు వచ్చినట్లు నకిలీ ఆఫర్ లెటర్
గుట్టు బయటపడటంతో బాధితుడికి బెదిరింపు
వైసీపీ గెలవగానే అంతు చూస్తానంటూ హెచ్చరికల
గుంటూరు,జూన్ 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పి మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ ఆయన సన్నిహితుడు రూ. 1.20 కోట్లు నొక్కేశాడు. బెంగళూరు రామయ్య మెడికల్ కళాశాలలో సీటు వచ్చినట్లుగా నకిలీ ఆఫర్ లెటర్ చేతికి ఇచ్చి ఘోరంగా మోసం చేశాడు. బాధితుడు సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సజ్జలకు అత్యంత సన్నిహితుడు అడపా ప్రేమ్‌చంద్ ఈ నిర్వాకానికి వొడిగట్టునట్టు ఆ ఫిర్యాదులో బాధితుడు మన్నే సుబ్బారావు ఆరోపించారు. ‘‘డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రేమ్‌చంద్‌ను అడిగా. ఆ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చానని, ఆయన ఇవ్వగానే ఇస్తానని చెబుతున్నాడు. అప్పటివరకు ఆగలేకుంటే చేతనైంది చేసుకోండి...తిరిగి మా ప్రభుత్వం రాగానే నీ అంతు చూస్తాన’’ంటూ బెదిరిస్తున్నాడని ఆ ఫిర్యాదులో వాపోయారు. బాధితుడి కథనం ప్రకారం, తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన మన్నే సుబ్బారావు కుమారుడు రూప్ సాయికి కౌన్సెలింగ్ ద్వారా చండీగఢ్ లో మెడికల్ పీజీ సీటు వచ్చింది.
అయితే అక్కడ పీజీ చేసిన తర్వాత మరో రెండేళ్లు అక్కడే పని చేేసవిధంగా బాండ్‌పై సంతకాలు చేయాలని ఆ కాలేజీ యాజమాన్యం షరతు పెట్టింది. దీంతో ఆ సీటు వదులుకున్నారు. మళ్లీ ఎంట్రెన్స్ రాయగా విజయవాడ పిన్నమనేని కళాశాలలో సీటు వచ్చింది. అయితే, చండీగఢ్‌లో సీటు వచ్చినా చేరని కారణంగా తమ కాలేజీలో చేర్చుకోలేమని కౌన్సిలింగ్ సందర్భంగా మేనేజ్‌మెంట్ తెలిపింది. ఈ క్రమంలో సుబ్బారావు తనకు తెలిసిన వారి ద్వారా సజ్జలకు అత్యంత సన్నిహితుడైన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట పరిధిలోని వాడపాలెం గ్రామానికి చెందిన అడపా ప్రేమ్‌చంద్‌ను కలిశారు. రెండు కోట్లు ఇేస్త సజ్జల ద్వారా చెప్పించి విజయవాడ పిన్నమనేని కళాశాలలో సీటు ఇప్పిస్తానని సుబ్బారావును ఆయన నమ్మించారు. వైసీపీ కేంద్ర కార్యాలయానికి సుబ్బారావును తీసుకువెళ్లి సజ్జల చాంబర్ వద్ద 45 లక్షల రూపాయలు ప్రేమ్‌చంద్ తీసుకుని లోపలకు వెళ్లారు. ఆ మొత్తం సజ్జలకు ఇచ్చినట్లు బయటకు వచ్చి సుబ్బారావుకు తెలిపారు. ఆ తరువాత రావులపాలేనికి చెందిన సెవెన్ స్టార్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత విజయలక్ష్మి భర్త గుత్తుల అవినాశ్, భీమవరానికి చెందిన కట్టివాటి బాలరెడ్డి ఖాతాల ద్వారా మరో రూ. 75 లక్షలు ప్రేమ్‌చంద్ తీసుకున్నారు. మీ సీటు విషయాన్ని సజ్జల, సీఎంవో ధనుంజయ రెడ్డి చూస్తున్నారని సుబ్బారావుకు ప్రేమ్‌చంద్ చెప్పారు. సజ్జల, ధనంజయరెడ్డితో ఫోన్ చేయించి విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రర్ రాధిక రెడ్డి ద్వారా పిన్నమనేని కాలేజీ మేనేజ్‌మెంట్‌కు చెప్పించానని... అయితే సీటుకు నాలుగు కోట్లు అడుగుతున్నారని సుబ్బారావుకు ఆయన తెలిపారు. తాను అంత డబ్బులు ఇచ్చుకోలేని.. తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని సుబ్బారావు అడిగారు.
అయితే బెంగళూరులో మంత్రి పెద్దిరెడ్డికి, సజ్జలకు రామయ్య మెడికల్ కళాశాల, రాజరాజేశ్వరి మెడికల్ కళాశాలల్లో వాటా ఉందని ప్రేమ్ చంద్ తెలిపారు. బెంగళూరు తీసుకువెళ్లి రామయ్య మెడికల్ కళాశాలలో పీజీ సీటు ఇప్పిస్తానని సుబ్బారావుకు చెప్పారు. అంతే కాకుండా అక్కడి రెవిన్యూ శాఖ మంత్రి పేరుతో ఫోర్జరీ లెటర్ తీసుకున్నారు. రామయ్య మెడికల్ కళాశాలలో ఎంఎస్ జనరల్ సర్జన్‌గా సుబ్బారావు కుమారుడికి సీటు కేటాయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి సుబ్బారావుకు ప్రేమ్‌చంద్ ఇచ్చారు. ఆ లెటర్ తీసుకొని రామయ్య మెడికల్ కళాశాలకు వెళ్లి విచారించగా... అదంతా ఫేక్ అని తేలింది.’’ అని తన ఫిర్యాదులో సుబ్బారావు తెలిపారు. తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని అడగ్గా రెండు దఫాలుగా ఐదు లక్షలు చొప్పున మొత్తం 10 లక్షలు ప్రేమ్‌చంద్ ఇచ్చారని, మిగిలిన మొత్తానికి ఐదు చెక్కులు ఇచ్చారని, అందులో మూడు చెక్కులు బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయ్యాయన్నారు. ప్రేమ్ చంద్‌ను సంప్రదిేస్త తనకు ఉన్న స్థలాలు విక్రయించి డబ్బులు ఇస్తానంటూ ఆ స్థలాలను తన పేరుతో అగ్రిమెంట్ కూడా రాశారని సుబ్బారావు తెలిపారు. అయితే, అక్కడ స్థలాలు లేవని ఆ తర్వాత తెలుసుకున్నానని చెప్పారు. డబ్బు కోసం గట్టిగా పట్టుబట్టగా, ఆ డబ్బులు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చానని, ఆయన ఇవ్వగానే తిరిగి ఇస్తానని చెబుతున్నారనీ, ఇంకా మాట్లాడితే నీ దిక్కు ఉన్న దగ్గర చెప్పుకో’ అంటూ బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో తెలిపారు. ప్రేమ్‌చంద్‌తోపాటు గుత్తుల అవినాశ్, భీమవరానికి చెందిన కట్టివాటి బాల రెడ్డి తదితరులపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుడ్లు, బియ్యం మింగేశాడు..
వైసీపీ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా పౌర సరఫరాల శాఖలో గుడ్లు, బియ్యం, ఇతర సరుకుల సప్లయి కాంట్రాక్టును ప్రేమ్ చంద్ సంపాదించారు. సరుకుల సరఫరాలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. విశాఖ ఇసుక తోట దగ్గర ఐదు కోట్ల ఖాళీ స్థలాన్ని కబ్జా చేసిన వ్యవహారంలోనూ ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. రాజమండ్రిలో డీజే కన్‌స్ట్రక్షన్స్ లో రెండు కోట్లు విలువచేేస ఫ్లాట్‌ను ప్రేమ్‌చంద్ ఆక్రమించుకున్నట్టు చెబుతున్నారు. పోలీసులు విచారణ జరిపితే ప్రేమ్ చంద్ అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఆయన బాధితులు డిమాండ్ చేస్తున్నారు.