Share News

Fake Ghee Scam: ఆ దేవాలయాలకూ కల్తీ నెయ్యే

ABN , Publish Date - Jun 25 , 2025 | 03:32 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలిందని హైకోర్టుకు సీబీఐ నివేదించింది

Fake Ghee Scam: ఆ దేవాలయాలకూ కల్తీ నెయ్యే

ఆవు నెయ్యి పేరుతో పామాయిల్‌ సరఫరా

రంగు, సువాసన కోసం రసాయనాలు కలిపారు

ఒక్క టీటీడీ నుంచే నిందితులకు 240 కోట్ల లబ్ధి

తయారీ, సరఫరాలో భోలేబాబా డెయిరీ కీలక పాత్ర

ఏఆర్‌, వైష్ణవి డెయిరీతో కలిసి సరఫరాకు కుట్ర

జైన్‌ సోదరుల అనుచరులు సాక్షులను బెదిరిస్తున్నారు

వారి బెయిల్‌ పిటిషన్లు కొట్టివేయండి

హైకోర్టుకు నివేదించిన సీబీఐ తరఫు న్యాయవాది

దర్యాప్తునకు సహకరిస్తాం.. బెయిలివ్వండి

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదుల అభ్యర్థన

  • వైష్ణవి డెయిరీ సీఈవో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

  • ‘భోలేబాబా’ డైరెక్టర్ల బెయిల్‌ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలిందని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్‌ జైన్‌(ఏ3), విపిన్‌ జైన్‌(ఏ4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్‌ చావడా(ఏ5) హైకోర్టులో బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు మంగళవారం విచారణకు రాగా సీబీఐ తరఫు న్యాయవాది పీఎ్‌సపీ సురే్‌షకుమార్‌ వాదనలు వినిపించారు.


టీటీడీ, ఇతర దేవాలయాలకు సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని, ఆవు నెయ్యి పేరుతో పామాయిల్‌ సరఫరా చేశారని తెలిపారు. అవు నెయ్యిలా రంగు, సువాసన వచ్చేందుకు అందులో వివిధ రసాయనాలు కలిపారని వివరించారు. వివిధ డెయిరీల నుంచి 60 లక్షల కేజీల నకిలీ నెయ్యి సరఫరా చేయడం ద్వారా టీటీడీ నుంచి భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు రూ.240 కోట్ల లబ్ధి పొందారని అన్నారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుక కీలక పాత్ర పోషించిన వీరిద్దరూ వైష్ణవి డైయిరీలోనూ డైరెక్టర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. 2018లో భోలేబాబా డెయిరీని టీటీడీ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడంతో ఏఆర్‌ డెయిరీ, వైష్ణవి డెయిరీతో నెయ్యి సరఫరా కోసం టెండర్లు వేయించారన్నారు. టీటీడీకి అవసరమైనంత నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వీటికి లేపోయినా భోలేబాబా డెయిరీ రూపొందించిన నకిలీ పత్రాలతో కాంట్రాక్ట్‌ను పొందాయని తెలిపారు.


టెండర్‌లో పాల్గొనేందుకు చెల్లించే ఈఎండీ సొమ్ము సైతం భోలేబాబా డెయిరీ ఖాతా నుంచి ఏఆర్‌ డెయిరీ ఖాతాకు జమైనట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నెయ్యి టెండర్లు దక్కించుకొనేందుకు టీటీడీ అధికారులకు సైతం లంచాలు ఇచ్చారని పేర్కొన్నారు. టీటీడీతో ఏఆర్‌ డెయిరీ, వైష్ణవి డెయిరీ ఒప్పందం చేసుకున్నప్పటికీ, భోలేబాబా డెయిరీ నుంచి ట్యాంకర్ల ద్వారా వచ్చిన కల్తీ నెయ్యినే ఈ రెండు సంస్థల ద్వారా టీటీడీకి సరఫరా చేశారని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించినందుకు గాను ఏఆర్‌, వైష్ణవి డెయిరీలకు లీటర్‌కు రూ.3 చొప్పున కమిషన్‌ చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ప్రమాణాలకు అనుగుణంగా లేదనే కారణంతో ఏఆర్‌ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ వెనక్కి పంపగా, ట్యాంకర్లకు ఉన్న సీళ్లను తొలగించి వాటినే వైష్ణవి డెయిరీ ద్వారా టీటీడీకి పంపించారని, పిటిషనర్లు అందరూ కలసి కుట్ర పన్ని కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు. కేసులో సాక్షిగా ఉన్న సంజయ్‌ జైన్‌ వాంగ్మూలం ఇచ్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌ 7న ఢిల్లీ నుంచి తిరుపతికి రాగా, ఎయిర్‌పోర్ట్‌ వద్ద నిందితుల అనుచరులు అతడిని బెదిరించి, దాడి చేశారని తెలిపారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెనక్కి పంపించారని చెప్పారు. నిందితుడు అశిష్‌ రోహిల్లా మేజిస్ట్రేట్‌ ముందు నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధపడగా ఆయనకు తెలియకుండానే ఆయన పేరు మీద వేరే వ్యక్తులు హైకోర్టులో పిటిషన్‌ వేశారని తెలిపారు.


దీనిపై రోహిల్లా ఈ-మెయిల్‌ ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. నిందితులు, వారి అనుచరులు సాక్షులను బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, ఈ విషయంలో కేసు కూడా నమోదైందని కోర్టుకు విన్నవించారు. అందుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచారు. నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ పిటిషన్లు కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు గత 4నెలలుగా జైల్లో ఉన్నారని తెలిపారు. కేసు దర్యాప్తు పూర్తిచేసిన సిట్‌ ఇప్పటికే చార్జిషీట్‌ దాఖలు చేసిందని, కేసుకి సంబంధించి అన్ని ఆధారాలను సేకరించిందని గుర్తుచేశారు. నెయ్యి సరఫరా గురించి టీటీడీతో ఏఆర్‌ డెయిరీ ఒప్పందం చేసుకుందని, వైష్ణవి, భోలేబాబా డెయిరీ డైరెక్టర్లకు కల్తీ నెయ్యి సరఫరాతో సంబంధం లేదని తెలిపారు. కోర్టు విధించి షరతులకు కట్టుబడి ఉంటామని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. మంగళవారం జరిగిన విచారణలో వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడా బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌కి సంబంధించి మరికొన్ని వివరాలు సమర్పించాలని సిట్‌కు సూచిస్తూ వారి బెయిల్‌ పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు.

Updated Date - Jun 25 , 2025 | 08:02 AM