Power Bill Shock: నెలనెలా జగన్ షాకులు
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:02 AM
ఏపీ ప్రజలకు విద్యుత్ చార్జీలపై నెలనెలా భారీ భారాలు మోపుతున్నాయి. జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా, డిస్కమ్‌లు ఇంధన సర్దుబాటు మరియు ట్రూ అప్ చార్జీల రూపంలో భారీ బిల్లు పెంచాయి

మోత మోగుతున్న విద్యుత్ బిల్లులు
ఇంధన ‘సర్దుబాటు’ పేరిట బాదుడు
వైసీపీ హయాంలో అనుసరించిన
అడ్డగోలు విధానాలతో చార్జీల పెంపు
ప్రతి ఇంటిపైనా సగటున రూ.800
భారం మోపుతున్న డిస్కమ్‌లు
మోత తగ్గించేలా సర్కారు చర్యలు
జెన్కోలో విద్యుదుత్పత్తి పెంపు
బహిరంగ కొనుగోళ్లకు దాదాపు స్వస్తి
ఫలితంగా ధరలు తగ్గించే ప్రయత్నం
బిల్లు గుభేల్‌మనిపిస్తోందా? చార్జీలు చిర్రెత్తిస్తున్నాయా? నెలనెలా కరెంటు ధరల మోతలతో ‘విద్యుత్’ షాకులిస్తోందా?! మరి ఈ ‘మోత’లకు మూలకారణం బెవ్వరు? ఈ అగచాట్లకు నాంది పలికిన నాయకుడెవరు? అని ప్రశ్నించుకుంటే..
ఒకే ఒక్క సమాధానం జగన్!
మరి ఆయన హయాంలో ఏం జరిగింది? ఇప్పుడు ఈ తిప్పలు ఎందుకు వచ్చాయి? ధరా భారం నుంచి సామాన్యులను గట్టెక్కించేందుకు చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రయత్నం ఏమిటి?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీ మధ్య ప్రతి ఇంట్లో వినిపిస్తున్న మాట.. ‘‘ఈ నెల కరెంటు బిల్లు ఎంతొచ్చింది?. ఎంత బాదేశారు?’’ అనే!. దీనికి కారణం.. వాడుకున్న కరెంటులో నిలకడ ఉన్నా.. కట్టాల్సిన చార్జీల్లో నిలకడ లేకపోవడం. నెల నెలా రూ.300 మేరకు బిల్లు వచ్చే సాధారణ వినియోగదారుని కుటుంబం.. రూ.1200-రూ.1300 వరకు చెల్లించాల్సి వస్తోంది. దీనికి కారణం... సర్‌చార్జీల బాదుడే! నాటి జగన్ ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు విధానాల పాపం... ఇప్పటికీ వెంటాడుతోంది. భారీ ధరకు కరెంటు కొనుగోళ్లు, నాడు ఉత్పత్తి పెంచకపోవడం తదితర కారణాలతో డిస్కమ్‌లపై భారం పెరిగిపోయింది. ఆ భారాన్ని సర్‌చార్జీల రూపంలో జనంపై బాదడం మొదలైంది. వైసీపీ సర్కారు పోయినా... భారం మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే.. ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ భారాలను తగ్గించేందుకు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా విద్యుత్ వ్యవస్థను సంస్కరిస్తోంది. ఈ పది మాసాల కాలంలో ఉత్పత్తిని పెంచింది.
తద్వారా పెరిగిన వినియోగానికి తగిన విధంగా సరఫరా చేస్తూ.. రూ.5 వేల కోట్ల మేరకు కొనుగోలు భారం నుంచి తప్పించుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని పొదుపులకు బాటలు పరుస్తోంది. అయితే, అప్పటి వరకు ప్రజలకు ‘జగన్ షాకులు’ తప్పకపోవడమే విచారం.
ఏం జరుగుతోంది?
జగన్ ప్రభుత్వం దిగిపోయి దాదాపు పదిమాసాలైంది. అయిప్పటికీ కరెంటు చార్జీల మోత మోగుతూనే ఉంది. ట్రూ అప్, ఇంధన సర్దుబాటు అంటూ.. డిస్కమ్‌లు బిల్లుల్లో బాదేస్తున్నాయి. దీంతో సగటు వినియోగదారులు తల్లడిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని సంక్షోభానికి గురిచేసి ఖాయిలా పడే పరిస్థితిని తీసుకొచ్చింది. దీంతో ప్రజలపై చార్జీల భారాన్ని ఇప్పటికిప్పుడు తగ్గించాలని కూటమి ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. సాధ్యం కావడం లేదు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ధరలు పెరగకుండా చూసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గతంలో నెలకు రూ.300 బిల్లు వచ్చే వినియోగదారుని కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఫిక్స్‌డ్ చార్జీలు రూ.50, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కింద రూ.28.98తోపాటు ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ.425.15 చెల్లించాల్సి వస్తోంది. ఇందులోనూ సర్డుబాటు ధరల పోటు.. ఏటికేడు మారిపోతోంది. అంతేకాదు.. డబుల్ సర్దుబాటు కూడా పడుతోంది. 2023-24లో సర్దుబాటు చార్జీల కింద 304.39, 2024-25లో మరో ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ.152.80 వసూలు చేస్తున్నారు. మొత్తానికి వినియోగించిన విద్యుత్ చార్జీకి అదనంగా ప్రతి నెలా రూ.వెయ్యి పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్నాయి. దీంతో గతంలో నెలకు రూ.300 బిల్లు వచ్చే వినియోగదారుడికి రూ.1,200 నుంచి రూ.1,530 దాకా వస్తోంది. అలానే.. ఒక కుటుంబం నెలకు 370 యూనిట్లు వాడితే.. రూ.3357.50 బిల్లు కట్టాల్సి వస్తోంది. ఎలా చూసుకున్నా సగటున రూ.800 అదనపు భారం ఒక్కొక్క కుటుంబంపై పడుతోంది.
గాడిన పడుతోంది!
చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ జెన్కో రోజుకు 230 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ను కూడా తట్టుకునేలా విద్యుదుత్పత్తి చేస్తుండడం విశేషం. బయట నుంచి కేవలం 7.967 మిలియన్ యూనిట్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. గడచిన 9 నెలలుగా ఏపీజెన్కో కేంద్రాల నుంచి గరిష్ఠ స్థాయిలో విద్యుదుత్పత్తి చేసేలా ఎండీ చక్రధరబాబు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా బహిరంగ మార్కెట్ నుంచి కరెంటు కొనుగోళ్లు తగ్గి రూ.5467 కోట్ల మేర ఆదా చేశారు.
నిపుణుల మాట ఇదే..
కరెంటును బయట నుంచి కొనుగోలు చేయకుండా ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి సంస్థలు ప్రస్తుత తరహాలోనే గరిష్ఠ స్థాయిలో విద్యుదుత్పత్తి చేయాలని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లను తగ్గింవచ్చని అంటున్నారు. దీంతో ప్రజలపై ట్రూఅప్, ఇంధన సర్దుబాటు భారాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంధన శాఖ ఈ దిశగా చర్యలు చేపట్టేలా స్పష్టమైన విధివిధానాలను అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
షాకులు ఇందుకే!
2019-24 మధ్య కాలంలో ఏపీ జెక్కో విద్యుదుత్పత్తి సంస్థలు విద్యుత్తు ఉత్పత్తి చేయలేదు. దీంతో వినియోగానికి అవసరమైన మేరకు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేశారు.
జగన్ హయాంలో డిస్కమ్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి అధిక ధరలకు ట్రాన్స్‌ఫార్మర్లను కొన్నాయి.
బహిరంగ మార్కెట్లో కరెంటును.. బొగ్గును కూడా చేతికి ఎముక లేదన్నట్టుగా ‘చెప్పిన’ ధరకు కొనుగోలు చేశాయి.
ఈ ఇష్టారాజ్యం నిర్ణయాల ఫలితంగానే.. ట్రూఅప్, ఇంధన సర్దుబాటు చార్జీల భారం వినియోగదారులపై పడింది.
సర్దుబాటు.. పెద్ద పోటు!
వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో విద్యుత్తు చార్జీలను పెంచలేదు. కానీ ట్రూఅప్, ఇంధన సర్దుబాటు పేరిట 9 సార్లు ప్రజలను బాదేశారు. ఇది ఆ రోజుకు, లేదా ఆ సంవత్సరానికి పరిమితం కాలేదు. కొన్నేళ్లపాటు ప్రజలు ఈ భారాన్ని మోసేలా జగన్ దొంగదెబ్బకొట్టారు.
2022-23లో ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ.6,300 కోట్లు మోపారు.
2023-24లో మరోసారి ఇంధన సర్దుబాటు చార్జీలు కింద రూ.9,200 కోట్ల భారం వేశారు.
మొత్తంగా ఆరెండేళ్లలోనే 15,500 కోట్ల మేర కు సర్దుబాటు పేరుతో మోత మోగించారు.
వీటికితోడు ఫిక్స్‌డ్ చార్జీలు రూ.50, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కింద రూ.28.98 వసూలు చేస్తున్నారు.
Read Also: Career Tips: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతం పెంచుకునేందుకు అదిరిపోయే టిప్స్
ISRO Vacancies: ఇస్రోలో నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..
Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ముసలోళ్లు అప్లై చెయ్యెచ్చు