MLC Polling : సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 27 , 2025 | 05:02 AM
ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి తగిన చర్యలు తీసుకుంది. కృష్ణా - గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది.

ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 60 మంది అభ్యర్థులు పోటీ
ఓటు వేయనున్న 6.62 లక్షల పట్టభద్ర ఓటర్లు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 22,493
10 మంది బరిలోకి దిగినా... పోటీలో తొమ్మిదిమందే
తాడేపల్లిలో ఓటు వేయనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
అమరావతి, విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి తగిన చర్యలు తీసుకుంది. కృష్ణా - గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో 6 లక్షల 62 వేల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం 60 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 939 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. పోలింగ్ బ్యాలెట్ పేపర్‌పై జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో సుంకరి శ్రీనివాసరావు అనే అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. పోలింగ్ రోజున 22,493 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు. 123 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8,500 మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల సంఘం వినియోగించనుంది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేసింది. ఎండ తీవ్రను దృష్టిలో పెట్టుకుని మంచినీరు, టాయిలెట్స్, ర్యాంప్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది.
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు... కృష్ణా- గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానానికి పోలింగ్‌కు 580 మంది పీవోలను, అసిస్టెంట్ పీవోలుగా 580 మందిని, రిజర్వ్ పోలింగ్ సిబ్బందితోపాటు ఇతర సిబ్బంది 1,159 మందిని, మైక్రో అబ్జర్వర్లుగా 515 మందిని... మొత్తం 2,833 మంది ఉద్యోగులు పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. కాగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఈ నియోజకవర్గం ఓటర్లు కావడంతో వారు ఉదయం 9.05 గంటలకు తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలోని గాదె రామయ్య - సీతారావమ్మ ఎంపీయూపీ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి పట్టభద్రుల పోలింగ్ ప్రక్రియలో... 545 మంది పీవోలుగా, మరో 545 మంది అసిస్టెంట్ పీవోలుగా, రిజర్వు పోలింగ్ సిబ్బందితోపాటు మరో 1080 మంది, మైక్రో అబ్జర్వర్లుగా 544 మంది... మొత్తం 2,714 మంది ఉద్యోగులు పోలింగ్ విధులు నిర్వర్తించనున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో మొత్తం 739 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. 148 మంది పీవోలు, మరో 148 మంది ఏపీవోలుగా, రిజర్వ్ పోలింగ్ సిబ్బందితోపాటు ఇతర సిబ్బంది 295 మంది, మైక్రో అబ్జర్వర్లుగా 148 మంది... మొత్తం 739 మంది ఉద్యోగులు, సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తించనున్నారు. కాగా, ఎన్నికలకు సంబంఽధించి ఫిర్యాదులను అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 18002331077, ఓటర్లు తమ ఓటు, పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్ 1950 ఏర్పాటు చేశారు.