Minister Narayana: అన్ని జిల్లాల సమాన అభివృద్ధికి కృషి: మంత్రి నారాయణ
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:09 PM
పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలు కొనసాగాయని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌కు పరిశ్రమలు ఎంతో కీలకమని చెప్పారు.
కాకినాడ, నవంబర్ 11: జిల్లాలో మంత్రి నారాయణ (Minister Narayana) పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడ పోర్టులో ఎమ్‌ఏటీ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ,పెద్దాపురంలో సంతోషిమాత కారుగేటర్స్ పరిశ్రమ, తునిలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని.. ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని అన్నారు.
పెట్టుబడిదారులు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉందో లేదో ముందుగా చూసుకుంటారని తెలిపారు. గత ఐదేళ్లలో ఏపీలో అరాచక పాలన ఉందని విదేశీ పెట్టుబడిదారులు చెప్పారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ముందుకెళ్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లి వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా పారిశ్రామిక వేత్తలతో ఒప్పందాలు జరుగనున్నాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు పరిశ్రమలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బదులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో సీఎం ముందుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు అనుకూలంగా ఉండేలా పాలసీలు తీసుకొచ్చి సబ్సిడీలు కూడా ఇస్తున్నామన్నారు. కాకినాడ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని.. కాకినాడ పోర్టు అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
స్థానికులపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్‌లోనే
త్వరలోనే ఏపీకి మరిన్ని పరిశ్రమలు: మంత్రి పయ్యావుల
Read Latest AP News And Telugu News