Share News

DSC 2025 Issue: డీఎస్సీలో గందరగోళం

ABN , Publish Date - Apr 29 , 2025 | 02:46 AM

డీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ పోస్టులకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివిన వారిని అనర్హులు చేసి, బీసీఏ అభ్యర్థులకు అర్హత ఇచ్చిన విషయంలో అభ్యంతరం వ్యక్తమవుతోంది.

DSC 2025 Issue: డీఎస్సీలో గందరగోళం

  • ‘ఫిజికల్‌ సైన్స్‌’ టీచర్‌ పోస్టుకు బీఎస్సీ అభ్యర్థులకు అర్హత నో

  • సైన్స్‌ సబ్జెక్టే లేని బీసీఏ వారికి అర్హత

  • ఉద్యోగార్థుల ఆందోళన

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): డీఎస్సీకి అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ అర్హత మార్కుల విషయంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ పోస్టుకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అసంబద్ధంగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఇంటర్‌లో ఎంపీసీ చదివి, బీఈడీలో సంబంధిత మెథడాలజీ చదివి ఉండాలనేది అర్హతగా నిర్ణయించారు. కానీ, బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివిన వారికి కెమిస్ర్టీ ఉండదు కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివిన వారికి అర్హత కల్పించలేదు. అయితే, బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(బీసీఏ) చదివిన వారికి మాత్రం ఆ పోస్టుకు అర్హత కల్పించారు. బీసీఏ మొత్తం కంప్యూటర్స్‌పైనే ఉంటుంది. కెమిస్ర్టీ, ఫిజిక్స్‌ రెండూ ఉండవు.


కానీ బీఎస్సీ కంప్యూటర్స్‌లో ఫిజిక్స్‌ ఉంటుంది. కెమిస్ర్టీ లేదు కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్‌ అభ్యర్థులు అనర్హులైతే, బీసీఏ అభ్యర్థులు ఎలా అర్హులయ్యారో చెప్పాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే, బీసీఏ చదివిన వారు ఇంటర్మీడియట్‌లో కచ్చితంగా ఫిజిక్స్‌, కెమిస్ర్టీ చదివి ఉండాలని నిబంధన పెట్టారు. బీఎస్సీ చదివే వారు కూడా ఇంటర్‌లో ఎంపీసీ చదివే వస్తారు. అలాంటప్పుడు ఈ ద్వంద్వ విధానం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాగా, బీసీఏ అభ్యర్థులకు గణితం, ఫిజిక్స్‌, బయాలజీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హత కల్పించారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ చదివిన వారికి కూడా న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 02:48 AM