Vijayawada : నేడు ‘మార్క్సిస్టు ఆలోచనాపరుల’ సదస్సు
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:41 AM
భారత కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షికోత్సవం సందర్భంగా ‘భారత కమ్యూనిస్టు ఉద్యమ పురోగమనం ఆవశ్యకత, అవకాశాలు - అవరోధాలు’ అన్న అంశంపై ఆదివారం..

పాల్గొంటున్న 15 కమ్యూనిస్టు వామపక్ష నిర్మాణాలు
విజయవాడ, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): భారత కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షికోత్సవం సందర్భంగా ‘భారత కమ్యూనిస్టు ఉద్యమ పురోగమనం ఆవశ్యకత, అవకాశాలు - అవరోధాలు’ అన్న అంశంపై ఆదివారం సదస్సు జరుగుతుందని ‘మార్క్సిస్టు ఆలోచనాపరులు’ తెలిపారు. ఈ సదస్సు నిర్వహణ కమిటీ సభ్యులు చిగురుపాటి భాస్కరరావు, ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా, అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన చేస్తూ... ‘విజయవాడ బుక్ ఫెస్టివల్ లైబ్రరీ హాల్‌లో ఈ చారిత్రక సదస్సు జరగనుంది. ఈ సదస్సులో సీపీఐ, సీపీఎం, వివిధ సీపీఐ(ఎంఎల్) పార్టీలు, విప్లవ రచయితల సంఘం ప్రతినిధులు పాల్గొంటున్నారు. మొత్తంగా 15 కమ్యూనిస్టు వామపక్ష నిర్మాణాల రాష్ట్ర నాయకులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ప్రస్తుతమున్న ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, వర్గ, కుల సమాజం స్థానంలో నిజమైన గణతంత్ర, ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సార్వభౌమ రాజ్యం ఏర్పాటు కావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఆకాంక్ష సఫలం అయ్యేందుకు కమ్యూనిస్టు ఉద్యమ పురోగమన అవకాశాలు, అవరోధాలపై వామపక్ష పార్టీల అభిప్రాయాలను ఒకే వేదికపై నుంచి తెలుసుకుని ప్రజలకు తెలియజేయాలన్నదే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం’ అని వివరించారు.