Share News

GV Anjaneyulu : ఎమ్మెల్యేల హాజరు తగ్గడంపై సీఎం సీరియస్‌

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:38 AM

‘ఎమ్మెల్యేల హాజరు విషయంలో సీఎం చంద్రబాబు చాలా సీరియ్‌సగా ఉన్నారు.

GV Anjaneyulu : ఎమ్మెల్యేల హాజరు తగ్గడంపై సీఎం సీరియస్‌

  • వారు వచ్చేటట్లు చూడాల్సిన బాధ్యత విప్‌లదే

  • వైసీపీ గైర్హాజరీతో ప్రతిపక్ష పాత్రా మనదే.. చీఫ్‌ విప్‌ జీవీ

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ‘ఎమ్మెల్యేల హాజరు విషయంలో సీఎం చంద్రబాబు చాలా సీరియ్‌సగా ఉన్నారు. ఈ విషయంలో విప్‌లు పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టాలి. ఎమ్మెల్యేల హాజరు బాధ్యత విప్‌లు తీసుకోవాలి’ అని చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు విప్‌లకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో విప్‌లతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వైసీపీ నాయకులు హోదా కోసం పట్టుబట్టి సభకే రావడం లేదని, అధికారపక్షమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాల్సిన అవసరం ఉందని ఆంజనేయులు అన్నారు. సభలో విప్‌లకు ప్రశ్నలు అడిగే అధికారంపై చర్చ జరిగింది. అడగాల్సిన ప్రశ్నలను ఎమ్మెల్యేలు ఈనెల 14లోపు పంపాలని ఆంజనేయులు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు 24 నుంచి ప్రారంభంకానున్నాయి. తర్వాత వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. సెలవులు అనంతరం ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ప్రారంభానికి రెండు రోజుల ముందు ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం. సభా సాంప్రదాయాలు, మర్యాదలు, సభ్యుల ప్రవర్తన తదితర అంశాలపై తరగతుల్లో వివరిస్తారు. వైసీపీ సభ్యులూ ఈ అవగాహన తరగతులకు హాజరు కావాలి’ అని జీవీ కోరారు.


పార్లమెంటుకు ఏ హోదా ఉందని వెళుతున్నారు?: యార్లగడ్డ

విప్‌ యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ... ‘పార్లమెంటుకు వైసీపీ సభ్యులు ఏ హోదా ఉందని వెళ్తున్నారు? ఢిల్లీలో ఒక రూల్‌, ఏపీలో మరో రూల్‌ ఎలా పాటిస్తారు? అసెంబ్లీ అన్నా, చంద్రబాబు అన్నా జగన్‌కు భయం. అందుకే హోదా ఇస్తేనే వస్తానంటూ మెలిక పెడుతున్నారు. గతంలో సభలో అన్‌ పార్లమెంటరీ భాష వాడినట్లు ఇప్పుడు ఉండదు. జగన్‌ ధైర్యంగా రావచ్చు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వెళుతానని మేనిఫెస్టోలో పెట్టే ధైర్యం జగన్‌కు ఉందా?’ అని ప్రశ్నించారు. సమావేశానికి టీడీపీ నుంచి బొండా ఉమ, తంగిరాల సౌమ్య, జగదీశ్వరి, మాధవి, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌, బొమ్మిడి నాయకర్‌, శ్రీధర్‌ హాజరయ్యారు.

Updated Date - Feb 12 , 2025 | 04:39 AM