Share News

CM Chandrababu: 200 కిలోల చేపలు పట్టేలా చేస్తా

ABN , Publish Date - Apr 27 , 2025 | 03:49 AM

CM చంద్రబాబు మత్స్యకారులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం, హార్బర్, ఐస్ ఫ్యాక్టరీ వంటి అవకాశాలను ఏర్పాటుచేసి వారి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు

CM Chandrababu: 200 కిలోల చేపలు పట్టేలా చేస్తా

  • మత్స్యకారులతో సీఎం చంద్రబాబు మాటామంతీ

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో మత్స్యకారులను కలుసుకున్నారు. వాళ్ల భుజాలపై చేతులు వేసి, వారితో కలసి హుషారుగా అడుగులు వేశారు. కష్టాలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బుడగట్లపాలెంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌లో దిగగానే ముందుగా ‘అమరావతి’ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం సముద్రతీరం వద్ద మత్స్యకారులను పలకరించారు. జడ్‌ ప్లస్‌ భద్రతను, అధికారులు, ప్రజాప్రతినిధులను దూరంగా ఉంచేసి తాను మాత్రమే మత్స్యకారుల వద్దకు వెళ్లి మాట్లాడారు.

సీఎం: మీ పేర్లేంటి?

మత్స్యకారులు: నాపేరు పోలీసు. ఈమె నా భార్య. మాకు ముగ్గురు పిల్లలు. చదువుకుంటున్నారు.

సీఎం: నువ్వేం చదువుకున్నావు? సమాచార వ్యవస్థ పెరిగిన తర్వాత చేపల వేటలో ప్రమాదాలు తగ్గాయా?

పోలీసు : నేనేం చదువుకోలేదు. నా భార్య ఏడో తరగతి చదువుకుంది. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హార్బర్‌ పూర్తయితే మాకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది.

సీఎం: రోజుకు ఎన్ని చేపలు పడతారు?

మత్స్యకారులు: చెప్పలేం సార్‌. అదృష్టం ఉంటే ఎక్కువ చేపలు పడతాయి. తరచూ వలలు చిరిగిపోతుంటాయి. మార్కెట్‌ పెద్దగా ఉండదు. అందుకే ఇతర జిల్లాలవారి నుంచి రేటు ఎంతుంటుందో తెలుసుకుని వారికి చేపలను విక్రయిస్తుంటాం. బోట్లు ఇచ్చినవారికి, మదుపులు పెట్టిన వ్యాపారికి సగం వాటా పోతుంది. మిగిలిందే మాది.

సీఎం: ఇక్కడే హార్బర్‌, ఐస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఫలితముంటుందా?

మత్స్యకారులు: హార్బర్‌ పెడితే ఎక్కడెక్కడివారైనా సరే ఇక్కడకే వచ్చేస్తారు. ఐస్‌ లేకపోవడం వల్ల ఎక్కడికో వెళ్లాల్సివస్తోంది. అన్నీ ఉంటే నూరు శాతం లాభం ఉంటుంది సార్‌. వలస పోనక్కర్లేదు. ఇక్కడే చేపలు వేటకు వెళ్లొచ్చు.


సీఎం: ఇంకా సమస్యలేంటి?

మత్స్యకారులు: సుమారు 600 ఇళ్లు ఉన్నాయి. వేటకు వెళ్లినవారిలో కొంతమంది మరణిస్తున్నారు. గ్రామంలో తాగునీటికి సమస్య ఉంది. అలల ధాటికి బోట్లు మరమ్మతులకు గురవుతుంటాయి. అన్నీ సమస్యలే.. పిల్లలను చదివించలేకపోతున్నాం. ఇళ్లు పాడయ్యాయి. ఇళ్లు మంజూరు చేస్తే బాగుంటుంది సార్‌. రాయితీపై వలలు కావాలి సర్‌.

సీఎం: అందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తా. వలలు 80 శాతం రాయితీపై ఇప్పిస్తా. హార్బర్‌ పని పూర్తిచేయిస్తా. జూన్‌ నుంచి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్లందరికీ ‘అమ్మకు వందనం’ అందిస్తాం.

మత్స్యకారులు : పడవలు, వలల మరమ్మతులకే రూ. 2లక్షల వరకు ఖర్చవుతుంది. ఒకదఫా వేటకు వెళ్తే వల చిరిగిపోతుంది. దాన్ని కుట్టుకుంటాం. రెండో వలను అదనంగా తీసుకువెళ్లాలంటే కుదరదు సార్‌. మా సమస్యలు పరిష్కరించండి సార్‌.

సీఎం: మీ అందరి ఆదాయం పెంచేవిధంగా చర్యలు తీసుకుంటాను. టెక్నాలజీ ఉపయోగించి, వంద కిలోల చేపలు పట్టేవారికి 200 కిలోలు ఎలా పట్టుకోవాలో దారి చూపిస్తా. మరోమారు వస్తాను.


Also Read:

వీళ్లు వేడి నీళ్లు తాగకూడదు..

విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..

ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 27 , 2025 | 03:49 AM