DT: డీటీ లేరని.. కౌన్సెలింగ్ ఆగుతుందా?
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:52 AM
ఈఏపీ సెట్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజుల గడువుంది. డీటీ లేరని శ్రీకాళహస్తిలో ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేయడంలేదు.

శ్రీకాళహస్తి, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఈఏపీ సెట్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజుల గడువుంది. డీటీ లేరని శ్రీకాళహస్తిలో ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేయడంలేదు. ఆయన సెలవులో ఉన్నారని, తమ కౌన్సెలింగ్ తేది ఆగుతుందా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సమయానికి సర్టిఫికెట్లు పొందే విషయంలో టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం ఈఏపీ సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరేందుకు కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా జత చేయాలి. మరో మూడురోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. శ్రీకాళహస్తి తహసీల్దారు కార్యాలయంలో ఆదాయ ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ చేతికి అందక కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు వాపోతున్నారు. ఈ నెల 4న దరఖాస్తు చేసుకున్న కొందరు శుక్రవారం నాటికి కూడా ఇన్‌కం సర్టిఫికెట్ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దారు జనార్దన్‌రాజును వివరణ కోరగా, డీటీ జగన్ సెలవులో ఉండటంతో ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీలో కొంతజాప్యం జరిగిందన్నారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జి అధికారిని నియమించకపోవడాన్ని ప్రస్తావించగా, డిజిటల్ కీ లాగిన్‌ను ఇన్‌ఛార్జి అధికారి తెరిచే అవకాశం లేకపోవడంతో బాధ్యతలు అప్పగించలేదన్నారు. అందరికీ సోమవారం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.