TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:53 PM
TTD Board chairman: వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా భూమనకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీకి ముందు జరిగిన తొక్కిసలాటలో భూమనతోపాటు హరినాథ్ రెడ్డి ప్రమేయం ఉండవచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

తిరుపతి, ఏప్రిల్ 13: తిరుపతి గోశాలలో వందలాది గోవులు మరణించాయంటూ ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు నిప్పులు చెరిగారు. ఆదివారం తిరుపతిలో బీఆర్ నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. హిందూ వ్యతిరేక అయిన భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా పని చేయడం దురదృష్టకరమన్నారు. ఆయన హిందువే కాదు.. ఆయనవన్నీ వేషాలేనంటూ భూమన కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డారు. ఆయన.. తన పిల్లలకు ఏ సంప్రదాయంలో వివాహం చేశాడో అందరికీ తెలుసునన్నారు.
ఐదారు నెలల తమ పాలనలో టీటీడీలో గతంలో ఏమేమి జరిగిందో చూశామని చెప్పారు. అన్నింటిలోనూ భూమన కరుణా కర్ రెడ్డి కమిషన్లు దండుకొన్నారన్నారు. ఆయన ఈ పదవి నుంచి దిగి పోతూ.. రూ.1600 కోట్ల ఇంజనీరింగ్ వర్క్స్‌కు ఆర్డర్ ఇచ్చారని ఈ సందర్భంగా బీఆర్ నాయుడు వివరించారు. ఈ వర్క్స్ పొందిన వారి నుంచి కరుణాకర్ రెడ్డి 8 నుంచి 10 శాతం మేర కమిషన్ తీసుకున్నాడని విమర్శించారు. ఇంకా చెప్పాలంటే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా పని చేయలేదు.. కమీషన్ల చైర్మన్‌గా పని చేశాడని వ్యంగ్యంగా పేర్కొన్నారు.
కమీషన్ లేకుండా ఆయన ఏ పని చేయలేదని కుండు బద్దలు కొట్టారు. ప్రతి దాంట్లో కమీషన్ తీసుకున్న వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని.. అలాంటి వ్యక్తి భూమిపైనే పుట్టకూడదని ఆ దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామిని తాను ప్రార్థిస్తున్నానని చెప్పారు. దేవుడు సొమ్ము తిన్నవాడు.. ఇంత వరకు బతికి బట్టకట్టలేదన్నారు. దేనికైనా టైం రావాలని.. భగవంతుడు కచ్చితంగా శిక్షిస్తాడని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
కరుణాకర్ రెడ్డికి భయం, భక్తి రెండూ లేవన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని బతికితే మంచిదని భూమన కరుణాకర్ రెడ్డిని బీఆర్ నాయుడు హెచ్చరించారు. కరుణాకర్ రెడ్డికి చుక్కలు చూపిస్తా.. మాములుగా ఉండదని ఈ సందర్భంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. గోవుల మృతిపై తప్పుడు ప్రచారం చేయడం వెనుక తొక్కిసలాటలో సస్పెండ్ అయిన హరినాథ్ రెడ్డి ఉన్నాడన్నారు. తనకు తెలిసి తొక్కిసలాట ఘటనలో హరినాథ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కుట్ర కూడా ఉండవచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
గోవులపై దుష్ప్రచారం చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిపై కేసులు పెడతామన్నారు. ఇతర మతస్థులపై ఇలా పడమని.. ఆ తర్వాత వాళ్ల సంగతి ఏమవుతుందో చూడమంటూ భూమన కరుణాకర్ రెడ్డికి సూచించారు. తాము తక్కువగా కనిపిస్తున్నామా? రాజకీయంగా పోరాడాలనుకుంటే రాజకీయాలు చేయొచ్చునని భూమనకు బీఆర్ నాయుడు తెలిపారు. తనతో పెట్టుకోంటే పర్సనల్‌గా వస్తానన్నారు. టీటీడీని అభాసుపాలు చేయడం ద్వారా రాజకీయాలు చేయడం తగదని భూమన కరుణాకర్ రెడ్డికి బీఆర్ నాయుడు సూచించారు.
టీటీడీ నిర్లక్ష్యం వల్ల తిరుపతిలోని గోశాలలో వందలాది గోవులు మరణించాయని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతేకాకుండా.. గతంలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన మంచి పథకాలను కూటమి ప్రభుత్వం తుడిచేస్తోందని ఆయన ఆరోపించారు.
మరోవైపు గోశాలలో గోవులు మరణించాయంటూ అందుకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియా సాక్షిగా పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే టీటీడీ బోర్డు స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతోన్నాయంటూ టీటీడీ శుక్రవారం అధికారిక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
For Andhrapradesh News And Telugu News