Tirupati: తిరునగరికి తగ్గనున్న ట్రాఫిక్ సమస్య
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:34 AM
జిల్లాలో రూ. 113 కోట్లతో రెండు నేషనల్ హైవేస్ ప్రాజెక్టు పనులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం మంగళగిరి నుంచీ సీఎం చంద్రబాబుతో కలసి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

తిరుపతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రూ. 113 కోట్లతో రెండు నేషనల్ హైవేస్ ప్రాజెక్టు పనులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం మంగళగిరి నుంచీ సీఎం చంద్రబాబుతో కలసి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మదనపల్లె-నాయుడుపేట రోడ్డు బైపాస్ సెక్షన్‌కు సంబంధించి ఎన్‌హెచ్ 71లో తిరుపతి నగర శివార్లలో 22 కిలోమీటర్ల మేరకు రోడ్డు అభివృద్ధి కోసం రూ. 22 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పనుల కింద రోడ్డు మార్కింగ్, ట్రాఫిక్ సైన్ బోర్డులు, సోలార్ బ్లింకర్లు వంటివి ఏర్పాటు చేయాల్సి వుంది.తిరుపతి వెలుపల పూతలపట్టు-నాయుడుపేట రోడ్డును మదనపల్లె - తిరుపతి రోడ్డును కలిపే ఈ రోడ్డు పనులు పూర్తయితే తిరుపతి నగరంపై మదనపల్లె వైపు నుంచీ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. మదనపల్లె వైపు నుంచీ వచ్చే వారు రేణిగుంట రైల్వే జంక్షన్‌కు, విమానాశ్రయానికి త్వరగా చేరుకోగలుగుతారు. ప్రయాణ వ్యవధితో పాటు కాలుష్యం కూడా తగ్గుతుంది. కాగా శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద, తడ-నెల్లూరు ఎన్‌హెచ్ 16వ సెక్షన్‌లో చిల్లకూరు సెంటర్ వద్ద రెండు కిలోమీటర్ల మేరకు రోడ్డు అభివృద్ధి కోసం రూ. 91 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పనులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ రెండు చోట్లా ఫోర్ లేన్ స్థాయిలో రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. ఆ పనుల్లో భాగంగా ఆరు చోట్ల బాక్సు కల్వర్టులు, రెండు చోట్ల పైప్ కల్వర్టులు, ఒక బస్ షెల్టర్ నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయితే రోడ్డు ప్రమాదాలు తగ్గనున్నాయి. కృష్ణపట్నం పోర్టుకు, షార్‌కు కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రయాణ వ్యవధి, కాలుష్యం తగ్గుతాయి. ముఖ్యంగా స్కూలు పిల్లలకు, పాదచారులకు రోడ్డు ప్రమాదాల నుంచీ భద్రత కలగడమే కాకుండా చిల్లకూరు, శ్రీసిటీ జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.