Share News

Solar: కుప్పంలో ‘సూర్య’ వెలుగులు!

ABN , Publish Date - Jul 21 , 2025 | 01:00 AM

నడిమూరు గ్రామంలోని వంద ఇళ్లకు సోలార్‌ ప్యానెల్స్‌ను అమర్చడం ద్వారా నడిమూరు పైలెట్‌ ప్రాజెక్ట్‌ను అధికారులు విజయవంతం చేశారు.

Solar: కుప్పంలో ‘సూర్య’ వెలుగులు!
సోలార్‌ ప్యానెల్స్‌తో నిండిన నడిమూరు

వెనుకబడిన కులాలకు రూ.20 వేల సబ్సిడీ

కుప్పం, జూలై 20 (ఆంరఽధజ్యోతి): అనతికాలంలోనే కుప్పం సోలార్‌ వెలుగులతో నిండిపోనుంది. నడిమూరులో నమూనాగా చేపట్టిన సూర్యఘర్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌ విజయవంతమైన నేపథ్యంలో నియోజకవర్గవ్యాప్తంగా సోలార్‌ సర్వీసులు ఇవ్వడానికి ఎస్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో రెస్కో కసరత్తు చేస్తోంది. సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించాలన్న సత్సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతోంది. ఇందులో ప్రధానంగా సంప్రదాయ విద్యుత్తుకు బదులుగా సూర్య శక్తి (సోలార్‌ ఎనర్జీని) ముందుకు తీసుకొచ్చింది. ఈ క్రమంలో సొంత నియోజకవర్గమైన కుప్పంనుంచి సోలార్‌ విద్యుత్తును వినియోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన సూర్యఘర్‌ అందుకు అనువుగా రంగంమీదకు వచ్చింది. దీంతో కుప్పం మండలం నడిమూరు వద్ద సోలార్‌ విద్యుత్తు ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది జనవరి 6వ తేదీన చంద్రబాబు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గ్రామాన్ని పూర్తిగా సోలార్‌ విద్యుత్తు కనెక్షన్లమయం చేయడానికి ఎస్పీడీసీఎల్‌ సహకారంతో కుప్పం రెస్కో ముందుకొచ్చింది. గ్రామంలోని వంద ఇళ్లకు సోలార్‌ ప్యానెల్స్‌ను అమర్చడం ద్వారా నడిమూరు పైలెట్‌ ప్రాజెక్ట్‌ను అధికారులు విజయవంతం చేశారు. ఇదే ఊపులో నియోజకవర్గంలో గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు వ్యవసాయ కనెక్షన్లను సోలార్‌ విద్యుత్తుమయం చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఉచితంగా సోలార్‌ విద్యుత్తును అందించనున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 7,489 ఎస్సీ, ఎస్టీ సర్వీసులున్నట్లు గుర్తించి వాటన్నింటికీ సోలార్‌ విద్యుత్తు సర్వీసులు ఇవ్వడానికి టెండర్లను పిలిచారు.అలాగే నాలుగు మండలాల్లో వ్యవసాయానికి సంబంధించి 126 రూరల్‌ ఫీడర్ల పరిధిలో 34 వేల సర్వీసులున్నట్లు తేల్చి, వీటికి కూడా టెండర్లను ఆహ్వానించారు. ఈ రెండురకాల సర్వీసులు పోనూ బీసీలు, ఓబీసీలు, ఓసీలకు సంబంధించి 43 వేల సర్వీసులు మిగిలాయి. వీటికి కూడా నిర్దేశిత ధరలను నిర్ణయించి సోలార్‌ విద్యుత్తు సర్వీసులు ఇవ్వడానికి అధికార యంత్రాంగం శ్రమిస్తోంది.


సబ్సిడీలు, రుణాలతో ప్రోత్సాహం

సోలార్‌ విద్యుత్తు కనెక్షన్‌ ఇటు వినియోగదారుడికి అటు సర్వీసు ఇచ్చిన రెస్కోకు ఖర్చులు తగ్గించి, లాభాలు చూపిస్తుందని అధికారులు చెబుతున్నారు. సోలార్‌ సర్వీసు తీసుకున్న వారికి టూ వే మీటర్లు ఏర్పాటు చేస్తారు. ఇంటిమీద అమర్చే సోలార్‌ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయిన సోలార్‌ విద్యుత్తు ఇంటి అవసరాలకు సరిపోగా, మిగిలిన విద్యుత్తు ఇదే మీటర్‌ ద్వారా వెనక్కు, అంటే రెస్కోకు వెళ్తుంది. ఇలా తాము తీసుకున్న విద్యుత్తుకు సరిపడా ధరను, నెలవారీ బిల్లుల్లో తగ్గించి ఇస్తారు. అంటే ఆమేరకు వినియోగదారుడికి లాభం చేకూరుతుందన్న మాట. ఉదాహరణకు ఒక కిలోవాట్‌ సామర్థ్యం గల రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసుకుంటే 120 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇన్ని యూనిట్ల సంప్రదాయ విద్యుత్తు వాడితే వినియోగదారుడికి ప్రస్తుతం వస్తున్న బిల్లు రూ.1000. అయితే సోలార్‌ విద్యుత్తు సర్వీసు తీసుకుంటే ఈ బిల్లు మొత్తం రూ.338కి తగ్గి, వినియోగదారుడికి మొదటి ఏడాది రూ.8 వేలు ఆదా అవుతుంది. నడిమూరు పైలెట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా 15 వేల యూనిట్ల విద్యుత్తు తిరిగి రెస్కోకే చేరుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అంటే సోలార్‌ విద్యుత్తు సర్వీసులు తీసుకున్న ఆ గ్రామ వినియోగదారులకు అంతమేరకు బిల్లుల్లో ధరలు తగ్గుతాయన్నమాట. అయితే సోలార్‌ విద్యుత్తు సరఫరాకోసం ఇంటిపైన ఏర్పాటు చేసే (రూఫ్‌ టాప్‌) సోలార్‌ ప్యానెల్స్‌ ధరలు కొంత అధికంగా ఉండడంతో ఒకేసారి అంత మొత్తం చెల్లించలేమన్న భావనలో నియోజకవర్గ ప్రజలు ఈ సర్వీసులు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. ఒక కిలోవాట్‌ సోలార్‌ విద్యుత్తుకు రూ.70 వేలు, 2 కిలోవాట్లకు రూ.1.40 లక్షలు, 3 కిలోవాట్లకు రూ.2.10 లక్షలు యూనిట్‌ ధరగా నిర్ణయించారు. ఇందులో మొదటి రకానికి రూ.30 వేలు, రెండవ రకానికి రూ.60 వేలు, మూడవ రకానికి రూ.78 వేలు ప్రభుత్వ రాయితీ ఇస్తుంది. అంతేకాదు.. సబ్సిడీపోను, వినియోగదారుడు చెల్లించాల్సిన ధర మొత్తాన్ని వెలుగు ప్రాజెక్ట్‌ ద్వారా రుణాల రూపంలో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఉదాహరణకు ఒక కిలోవాట్‌ సామర్థ్యం గల సోలార్‌ రూఫ్‌ టాప్‌కు ప్రభుత్వ సబ్సిడీ పోను రూ.40 వేలు వినియోగదారు చెల్లించాల్సి ఉంటుంది. ఈ 40 వేలలో రూ.20 వేలు బ్యాంకు రుణం ద్వారా, మిగిలిన రూ.20 వేలు వెలుగు మహిళా రుణాల ద్వారా పంపిణీ చేస్తారు. ఈ మొత్తాన్ని నెలవారీ కంతుల రూపంలో వినియోగదారులు చెల్లిస్తే సరిపోతుంది. ఇదికాక బీసీ వినియోగదారులకు అదనంగా రూ.20 వేలు సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది.

వెలుగు ప్రాజెక్ట్‌ ద్వారా అంగీకార పత్రాలు

సోలార్‌ విద్యుత్తు సర్వీసులకోసం నియోజకవర్గంలోని గృహాలకు సంబంధించి ప్రజలనుంచి అంగీకార పత్రాలు తీసుకునే ప్రక్రియ ప్రస్తుతం నాలుగు మండలాల్లో నడుస్తోంది.వెలుగు ప్రాజెక్ట్‌ పరిధిలో మొత్తం 5661 మహిళా స్వయం సహాయక సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, 56,585 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో మండలానికి 600 ఇళ్లకు సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటుకోసం అంగీకార పత్రాలు తీసుకోవడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా విధించింది. ప్రతి మండలమూ ఈ లక్ష్యంలో దాదాపు 50 శాతం పూర్తి చేసింది. గ్రామాలు తిరుగుతున్న వీవో లీడర్లు, సీసీలు ప్రజలకు సోలార్‌ విద్యుత్తుపై అవగాహన కల్పించి సర్వీసులు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

సోలార్‌ విద్యుత్తుతో వినియోగదారుడికి ఎంతో మేలు: సోమశేఖర్‌, రెస్కో ఎండీ

సోలార్‌ విద్యుత్తు పర్యావరణ హితమే కాక, వినియోగదారుడికి కూడా విద్యుత్తు బిల్లులు ఆదా చేస్తుంది. సామాన్య వినియోగదారునికి ఏడాదికి రూ.8 వేలదాకా బిల్లుల ఖర్చు మిగులుస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, రుణాల సౌకర్యాలు వినియోగించుకుని వినియోగదారులంతా సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసుకోవాలి.కుప్పం నియోజకవర్గం మొత్తాన్ని సోలార్‌ విద్యుత్తుమయం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని వీలైనంత త్వరలో నెరవేర్చడానికి కృషి చేస్తున్నాం.

Updated Date - Jul 21 , 2025 | 01:00 AM