Voters: జిల్లా ఓటర్ల సంఖ్య 15,71,402
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:03 AM
తాజా ఓటర్ల జాబితా మేరకు ఈనెల ఒకటో తేదీనాటికి జిల్లావ్యాప్తంగా 15,71,402 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.

చిత్తూరు కలెక్టరేట్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): తాజా ఓటర్ల జాబితా మేరకు ఈనెల ఒకటో తేదీనాటికి జిల్లావ్యాప్తంగా 15,71,402 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిఽధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఏడు నియోజకవర్గాల్లో 874 మృతుల పేర్లను తొలగించగా.. ఒకటి కంటే మించి రెండుమూడు చోట్ల పేర్లను నమోదు చేసుకున్న 833 మంది ఓటర్ల పేర్లను గుర్తించామన్నారు. కొత్తగా 3,049 మంది ఓటర్లకు ఓటింగ్ అవకాశం కల్పించామని చెప్పారు. 10,615 మందికి ఓటరు గుర్తింపు కార్డులు తపాలాశాఖ ద్వారా రిజిస్టర్ పోస్టులో పంపడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. బీఎల్వోలకు తరచూ శిక్షణ కార్యక్రమాలను జరుపుతున్నామన్నారు. ప్రజలకు అందుబాటులో పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రతినిధి సురేంద్రకుమార్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి కార్డులను త్వరగా అందించాలని బీజేపీ నేత అట్లూరి శ్రీనివాసులు కోరారు. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటర్ల పేర్లు మార్పులు జరగడం లేదని, వీటిపై దృష్టి సారించాలని సీపీఎం ప్రతినిధి గంగరాజు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో మోహన్ కుమార్, వివిధ పార్టీల ప్రతినిఽధులు ఉదయ్‌కుమార్(వైసీపీ), బాలసుబ్రహ్మణ్యం(ఆప్), పరదేశి(కాంగ్రెస్), ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు.