APO: ‘ఏపీవో’ కుర్చీలు ఖాళీ!
ABN , Publish Date - Apr 21 , 2025 | 01:19 AM
కుప్పంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. క్షేత్ర స్థాయి సిబ్బందే కాదు, మండల స్థాయి అధికారుల పోస్టులు కూడా ఖాళీగానే ఉండి, ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. మరోవైపు సాధారణంగా జరిగే ఉపాధి పనులతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన సిమెంటు రోడ్లు, గోకులం షెడ్ల నిర్మాణం కూడా ఉపాధి హామీకి అనుసంధానించడంతో పని ఒత్తిడి ఎక్కువై సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కుప్పం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం ఏపీడీ పోస్టులో వెంకటరత్నం కొనసాగుతున్నారు. అయితే ఆయన కుప్పంలోని జాతీయ వనరుల అభివృద్ధి కేంద్రంలో గల ఉపాధి కార్యాలయంలో ఉండడం చాలా అరుదు. అదేమంటే క్యాంపుల్లో ఉన్నానని చెబుతారు. పోనీ, మండలాల స్థాయిలో ఏపీవో పోస్టులు అయినా రెగ్యులర్ ఉద్యోగులతో భర్తీ అయ్యాయా అంటే అదీ లేదు. కుప్పం ఏపీవో పోస్టులో ప్రస్తుతం శాంతిపురం నుంచి వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ కమ్ క్లర్క్ హరి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. 2024లో జూన్‌లో ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో అంతకుముందున్న అధికారులు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి కుప్పం ఏపీవోగా ఇంజనీరింగ్ కన్సల్టెంట్ జ్యోతి కొనసాగారు. సుమారు పది రోజుల క్రితం జరిగిన బదిలీల్లో ఆమె వెళ్లిపోగా, మళ్లీ శాంతిపురం మండలం నుంచి కంప్యూటర్ ఆపరేటర్ హరి ఇన్‌చార్జిగా వచ్చారు. శాంతిపురంలో కూడా ఆరేడు నెలలుగా ఈయనే ఇన్‌చార్జి ఏపీవోగా ఉన్నారు. మొన్న జరిగిన సాధారణ బదిలీల్లో మాత్రమే వి.కోట నుంచి రెగ్యులర్ ఏపీవో గౌరీశంకర్ వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. రామకుప్పం మండలంలో వైసీపీ హయాంలో ఉన్న ఏపీవో రవికుమార్.. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన ఆరేడు నెలలదాకా కొనసాగారు. ఆపైన కొన్ని అవకతవకలు బయటపడడంతో ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. మధ్యలో కింది స్థాయి అధికారి ఇన్‌చార్జి ఏపీవోగా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో బంగారుపాళ్యం మండలం నుంచి ఇంజనీరింగ్ కన్సల్టెంట్ రామకుప్పానికి వచ్చారు. ఆయనే ఇన్‌చార్జి ఏపీవోగా కొనసాగుతున్నారు. గుడుపల్లె మండలంలో ఉపాధి హామీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇక్కడ ఏపీవో, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పోస్టులు రెండూ ఖాళీగానే ఉన్నాయి. కనీసం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉండిఉంటే ఆ వ్యక్తికి ఏపీవో ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించేవారు. అర్హత కలిగిన ఉద్యోగులు లేకపోతే ఎంపీడీవో మాత్రమే ఇన్‌చార్జి ఏపీవోగా వ్యవహరించాలి. అయితే గుడుపల్లెలో ఎంపీడీవో పోస్టు కూడా ఖాళీగా ఉంది. రామకుప్పం ఈవోపీఆర్డీ రాధాకృష్ణ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయనే ప్రస్తుతం ఉపాధి వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు. త్వరలోనే ఇక్కడి టెక్నికల్ అసిస్టెంట్ సంతోశ్‌కు ఇన్‌చార్జి ఏపీవోగా బాద్యతలు అప్పగించే అవకాశం ఉంది. మొత్తంమీద ఒక్క శాంతిపురంలో తప్ప, మిగిలిన మూడు మండలాల్లో ఏపీవో కుర్చీలు ఖాళీగా ఉండి, ఇన్‌చార్జిలతో నడుస్తున్నాయి.
పని ఒత్తిడితో సతమతం
ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ప్రభుత్వ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులకూ అనుసంధానం చేసింది ప్రభుత్వం. దీనిప్రకారం పంచాయతీరాజ్ శాఖలో సిమెంటు రోడ్లు, అంగన్వాడీ భవనాలు, ప్రహరీ నిర్మాణాలు సాగుతున్నాయి. ఇరిగేషన్ శాఖలో చెక్ డ్యామ్‌లు, ఆర్‌డబ్ల్యూఎ్‌సలో సీసీ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి. ఇవిగాక రెగ్యులర్‌గా నడిచే ట్రెంచ్‌లు, ఫారం పాండ్ వంటి పనులు సరేసరి. ఒక్కో మండలంలో అన్నీ కలిపి సుమారుగా 220 నుంచి 300 దాకా పనులు జరుగుతున్నాయి. దాదాపు రూ.6 కోట్లనుంచి రూ.8కోట్ల దాకా వీటి విలువ ఉంటుంది. ఉదాహరణకు కుప్పం మండలంలో సుమారు రూ.7కోట్ల విలువ కలిగిన 275 పనులు నడుస్తున్నాయి. శాంతిపురం మండలంలో సైతం సుమారు ఆరేడు కోట్ల రూపాయలు విలువ కలిగిన దాదాపు 250 పనులు జరుగుతున్నాయి. ఇతర డిపార్టుమెంట్లతో అనుసంధానమైన పనులకు మెటీరియల్ కాంపొనెంట్ సంబంధం లేకపోయినా, కూలీ వేతనాలకు సంబంధించిన లెక్కలు ఉపాధి సిబ్బందే చూడాల్సి ఉంటుంది. దీంతో పని ఒత్తిడి పెరిగిపోతున్నదని ఉపాధి హామీ పథకం సిబ్బంది వాపోతున్నారు. కనీసం ఖాళీగా ఉన్న ఏపీవో పోస్టులతోపాటు ఇతర పోస్టులను కూడా రెగ్యులర్ సిబ్బందితో భర్తీ చేయాలని చేయాలని కోరుతున్నారు.