Share News

TTD: శ్రీవారి డాలర్లు ‘నో స్టాక్‌’

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:13 AM

తిరుమలలో శ్రీవారి బంగారు డాలర్ల కొరత ఏర్పడింది. వారం రోజులుగా డాలర్లు లేకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

TTD: శ్రీవారి డాలర్లు ‘నో స్టాక్‌’
శ్రీవారి బంగారు డాలర్లు(ఫైల్‌)

తిరుమల, ఆంధ్రజ్యోతి: తిరుమలలో శ్రీవారి బంగారు డాలర్ల కొరత ఏర్పడింది. వారం రోజులుగా డాలర్లు లేకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా టీటీడీ బంగారు, వెండి, రాగి డాలర్లను విక్రయిస్తోంది. శ్రీవారి సన్నిధిలో స్వామి, అమ్మవార్లు ఉండే బంగారు, వెండి, రాగి డాలర్లను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ప్రతి నెలా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల విక్రయాలు జరుగుతుంటాయి. వారం రోజుల కిందట 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాముల బంగారు డాలర్ల కొరత ఏర్పడింది. సాధారణంగా స్టాక్‌ పూర్తయ్యేలోపే డాలర్లను కౌంటర్లకు తీసుకొచ్చి భక్తులకు అందుబాటులో ఉంచాలి. వారం కిందటే బంగారు డాలర్లు ఖాళీ అయినా, తెప్పించలేదు. ఎంతో భక్తిశ్రద్ధలతో భక్తులు ‘డాలర్ల విక్రయ కేంద్రం’ వద్దకు వెళితే ‘నోస్టాక్‌’ బోర్డు కనిపిస్తోంది. స్టాక్‌ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నారు. మరోవైపు రాగి డాలర్ల విక్రయాలు దాదాపు ఏడాదిగా నిలిచిపోయాయి.

Updated Date - Dec 01 , 2025 | 12:13 AM