Share News

RTC: ఉచిత ప్రయాణానికి సన్నద్ధం

ABN , Publish Date - Aug 03 , 2025 | 01:49 AM

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు.

RTC: ఉచిత ప్రయాణానికి సన్నద్ధం
చిత్తూరు రెండవ డిపో గ్యారేజ్‌లో బస్సు మరమ్మతులను పరిశీలిస్తున్న ఈడీ చంద్రశేఖర్‌

మరో వంద బస్సులకు ప్రతిపాదన

బస్టేషన్లలో మౌలిక వసతుల ఏర్పాటు

ఆగస్టు 15 నుంచి అమలు లాంఛనమే

చిత్తూరు రూరల్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన మరో ప్రధాన హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 5 డిపోల్లో మౌలిక వసతుల కల్పన, మహిళల ప్రయాణానికి ఆనుగుణంగా బస్సుల్లో మార్పులు, అవసరమైన అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిపై ఇటీవల విజయవాడలో ఆర్టీసీ జిల్లా అధికారులతో ఎండీ సమావేశం కూడా నిర్వహించారు.

బస్సులకు మరమ్మతులు

ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ముందస్తు సన్నద్ధత లేక మహిళలు నరకం చూశారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇక్కడ అన్ని విధాలా సిద్ధమవుతున్నారు. చిరిగిన సీట్లు, పగిలిన కిటికీలకు మరమ్మతులు చేస్తున్నారు. రంగులు వేసి బస్సుల కండీషన్‌ చెక్‌ చేసి సమస్యలుంటే పరిష్కరిస్తున్నారు. పూర్తిగా గుల్లయిన బస్సుల బాడీలు మార్చేస్తున్నారు.జిల్లాలో ఇప్పటి వరకు 18 బస్సుల బాడీలు మార్చారు. ఇంకా కొన్నిటిపై కసరత్తు చేస్తున్నారు. ఇవి కాకుండా 24 బస్సుల్లో 3+2 గా ఉన్న సీట్ల స్థానంలో 2+2 చేసి ఎక్కువమందికి సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళల తాకిడి ఎక్కువగా ఉండే ఉదయం 8-11గంటల మధ్య, సాయంత్రం 4-7 గంటల మధ్య సర్వీసులు పెంచాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య రెండు రెట్లు పెరిగినా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

24 బడి బస్సులు రోజంతా నడిపే ఏర్పాట్లు

జిల్లాలో విద్యార్థుల కోసమే ప్రత్యేకంగా 24 బస్సులు ఉదయం, సాయంత్రం మాత్రమే నడిపేవారు. ఉచిత ప్రయాణం మొదలైతే ఈ బస్సులను రోజంతా ప్రయాణికులను చేరవేసేందుకు నడపనున్నారు. ఉచితాన్ని అమలు చేస్తే 50 శాతం అదనంగా మహిళలు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఇందుకు అనుగుణంగా అన్ని బస్సుల పరిస్థితిని పరిశీలించి అవసరమైన మరమ్మతులు పూర్తి చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.


మౌలిక సదుపాయాలు సిద్ధం

ఆర్టీసీ డిపోల్లోని బస్సు స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు వంటి సౌకర్యాల కల్పన దాదాపు పూర్తయింది.నీళ్ల ట్యాంకులకు, కొళాయిలకు అవసరమైన రిపేర్లు చేస్తున్నారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు కుర్చీలు, ఉక్కపోత లేకుండా కొత్త ఫ్యాన్లు అమర్చారు. టీవీలకు మరమ్మతులతో పాటు తాగునీటికి ఇబ్బంది లేకుండా కొళాయిలు ఏర్పాటు చేస్తున్నారు.

మరో వంద బస్సులు కావాలి

జిల్లాలో రోజూ 708 గ్రామాలకు సుమారు 164 రూట్లల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. రోజుకు 1.31 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 40 శాతం మంది అంటే 52 వేల మంది మహిళలులున్నారు. జిల్లాలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇప్పటి వరకు 103 కొత్త బస్సులు జిల్లాకు వచ్చాయి. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకోని అదనంగా మరో 100 కొత్త బస్సులకు ప్రతిపాదనలు పంపించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

రోజుకు రూ.42 లక్షల ఆదాయం

జిల్లాలో ఆర్టీసీకి టికెట్ల ద్వారా రోజుకు రూ.42 లక్షలు ఆదాయం వస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలైతే 40 శాతం ఆదాయానికి గండిపడనుంది. అయితే ఈ లోటు పూడ్చేందుకు ఆర్టీసీ అధికారులు వివిధ ఆదాయ మార్గాలను ఆలోచిస్తున్నట్లు డీపీటీవో రాము తెలిపారు. . ఆర్టీసీ కార్గో సేవలను మెరుగుపరచడం, బస్టాండ్‌లో ఖాళీ స్థలాలు లీజుకు ఇవ్వడం,లగ్జరీ, అలా్ట్ర లగ్జరీ బస్సుల శాతాన్ని పెంచడం వీటిలో కొన్ని.

344 బస్సుల్లో ప్రయాణం ఉచితం

జిల్లాలోని 464 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని 344 బస్సుల్లో అమలు చేయనున్నారు. ఇందులో 209 పల్లెవెలుగు బస్సులు,102 ఎక్స్‌ప్రె్‌సలు ,33 సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతించనున్నారు.

కుటుంబ భారం తగ్గుతుంది: మునిలక్ష్మి,అట్లవారిపల్లె, పెనుమూరు మండలం

పూల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రోజూ మావూరి నుంచి పూలకోసం చిత్తూరుకు వస్తుంటా. ఇక్కడ పూలు దొరకలేదంటే వేలూరుకో, పలమనేరుకో వెళ్లి తెచ్చుకొని కట్టి అమ్ముకుంటా.నెలకు రూ.2 వేలకు పైనే బస్సు ఛార్జీలకు ఖర్చవుతుంది. చంద్రబాబు చెప్పినట్లు ఆడోళ్లను ఆర్టీసీలో ఫ్రీగా పంపిస్తే ఆ 2 వేలు పొదుపు చేసుకుంటా.

జిల్లాలో ఆర్టీసీ

డిపోలు - 5

మొత్తం బస్సులు - 464

పల్లెవెలుగు - 209

ఏసీ బస్సులు- 4

సూపర్‌ లగ్జరీ - 30

సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ - 33

ఎక్స్‌ప్రెస్‌ - 102

Updated Date - Aug 03 , 2025 | 01:49 AM