Share News

ZP: ప్రశాంతంగా జడ్పీ సమావేశం

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:46 AM

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. శాసనసభ్యుల్లో జీడీనెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు థామ్‌స,ఎమ్మెల్యే మురళీమోహన్‌ మాత్రమే పాల్గొన్నారు.

ZP: ప్రశాంతంగా జడ్పీ సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, హాజరైన ప్రజాప్రతినిధులు

చిత్తూరు రూరల్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. శాసనసభ్యుల్లో జీడీనెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు థామ్‌స,ఎమ్మెల్యే మురళీమోహన్‌ మాత్రమే పాల్గొన్నారు. మిగిలిన వారెవరూ హాజరు కాలేదు. వీరిలో థామస్‌ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడగా మురళీమోహన్‌ నియోజకవర్గ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోయారు. తిరుపతి డీఆర్వో నరసింహులు పాల్గొనగా అన్నమయ్య జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు ఎవరూ హాజరు కాలేదు. ముందుగా జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన అభివృద్ధి పనులను, ఖర్చుల వివరాలను వెల్లడించారు. సాధారణ నిధుల నుంచి సుమారు రూ.13 కోట్లు, 15వ ఆర్థిక సంఘ నిధుల నుంచి రూ.25 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు, తాగునీటి సౌకర్యానికి వెచ్చించినట్లు వివరించారు.సుమారు 89మందికి కారుణ్య నియమకాల ద్వారా ఉద్యోగం కల్పించామన్నారు. జడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులకు 10 నెలల గౌరవేతనాలు అందించడం జరిగిందని, మరో 13 నెలలకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్‌ చేయడం జరిగిందన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఎంపీడీవో కార్యాలయాలు, రోడ్డు పక్కనే ఉన్న జడ్పీ పాఠశాలల స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్సులు నిర్మించి వాటి ద్వారా జడ్పీకి అదనపు ఆదాయం లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ప్రజల ప్రాణాలతో ఆర్‌ఎంపీల చలగాటం

తమిళనాడులో ఆర్‌ఎంపీ వ్యవస్థను నిషేధించారని, దీంతో వారిలో చాలామంది తమిళనాడు సరిహద్దులోని కుప్పం నియోజకవర్గం చేరి ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని కుప్పం జడ్పీటీసీ శరవణ కలెక్టర్‌ దృష్టికి తీసుకొచారు.సుమారు 360మంది ఆర్‌ఎంపీలు నియోజకవర్గవ్యాప్తంగా క్లీనిక్కులను నిర్వహిస్తూ చేతగాని వైద్యంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులను పెంచుతున్నారన్నారు. కుప్పం మండలంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను బదిలీ చేయాలని కోరారు.చాలామంది ఉపాధ్యాయులు బెంగళూరులో స్థిరపడ్డారని, మరికొంతమంది రియల్‌ఎస్టేట్‌, వడ్డీ, చీటీ వ్యా పారాలతో బిజీగా వుంటూ పాఠశాలలకు సక్రమంగా హాజరుకావడం లేదని విమర్శించారు.గత సమావేశంలోనే ఈ విషయమై ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులకు సంబంధించి బోర్డును ఏర్పాటు చేయించాలని కోరారు. శాంతిపురం జడ్పీటీసీ శ్రీనివాసులు మాట్లాడుతూ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో శాంతిపురం మండలంలో 50 శాతం కంటే ఎక్కువ ఫెయిలయ్యారని, దీనికి కారకులు ఎవరని డీఈవోను ప్రశ్నించారు.డీఈవో వరలక్ష్మి స్పందిస్తూ... ఉపాధ్యాయుల కొరత కారణంగా ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వంద శాతం పాసయ్యేలా చూస్తామన్నారు.


చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలి

చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందే విధంగా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ కోరారు. గత వారం టీడీపీ నాయకురాలు శ్రీదుర్గ ప్రమాదానికి గురై వస్తే సరైన వైద్యం అందలేదన్నారు. సీటీ స్కాన్‌ తీసివుంటే ఆమె బతికేదన్నారు.ప్రసవాలు కూడా సక్రమంగా జరగడం లేదని, చిన్న పాటి రిస్క్‌ ఉన్నా వారిని ప్రైవేటు ఆస్పత్రులకు, లేదా రుయాకు రెఫర్‌ చేస్తున్నారన్నారు. జిల్లా ఆస్పత్రిలోనే ఇలా వుంటే పీహెచ్‌సీల్లో వైద్యం ఏ స్థాయిలో అందుతోందో ఆర్థమవుతుందన్నారు.2022లో పాలసముద్రం మండలం గంగమాంబాపురానికి మంజూరైన పీహెచ్‌సీని తిరుమలరాజపురానికి మార్చాలని కలెక్టర్‌ను కోరారు. తిరుమలరాజపురంలో ఆస్పత్రి ఉంటే అధిక శాతం ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని వివరించారు.

స్సెషలిస్టుల టీంను తీసుకొచ్చే ప్రయత్నం: కలెక్టర్‌

సమావేశం తరువాత కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ విలేకర్లతో మాట్లాడారు.చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఇందు కోసం ఒక టీం పనిచేస్తోందని చెప్పారు.త్వరలో స్సెషలిస్ట్‌ టీంను తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు.చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి మందులు, మాత్రల కోసం ప్రభుత్వ నిధుల నుంచి సుమారు రూ.19 లక్షలు వెచ్చించామని తెలిపారు. కుప్పం నియోజకవర్గాన్ని 100 శాతం సోలరైజేషన్‌ చేసేందుకు వెండర్లను గుర్తించామని చెప్పారు. మే 1 నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు.

గుడి పేరుతో ప్రజాధనం దుర్వినియోగం

నారాయణవనం మండలం వెంకటకృష్ణపాళ్యం పంచాయతీ సింగిరికోనలో ఓ చిన్న గుడికి రోడ్డు పేరుతో సుమారు 6.50 కోట్ల ప్రజాధనాన్ని తిరుపతి డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్‌ దుర్వినియోగం చేశారని నారాయణవనం జడ్పీటీసీ సుమన్‌ ఆరోపించారు.స్థానిక ఎమ్మెల్యే, జడ్పీటీసీ, సర్పంచ్‌కు కూడా తెలియకుండా అటవీశాఖకు చెందిన సుమారు 40 అడుగుల భూమిలో 4 కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణానికి రూ.6.50 కోట్లు వెచ్చించారని,ఇందుకోసం చెట్లు నరికి వేశారని,వాటిలో ఎర్రచందనం చెట్లు కూడా ఉన్నాయన్నారు. వాటిని ఏం చేశారు? ఎవరికి విక్రయించారు? అనే వివరాలను పీడీ చెప్పాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

Updated Date - Apr 30 , 2025 | 12:47 AM