IIT: సృజనాత్మకతతో ముందుకు సాగండి
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:50 AM
పట్టుదల, సృజనాత్మకతతో ముందుకు సాగాలంటూ తిరుపతి ఐఐటీ విద్యార్థులకు క్రియా యూనివర్సిటీ చాన్సలర్ లక్ష్మీనారాయణన్ సూచించారు.

ఏర్పేడు, జూలై 20(ఆంధ్రజ్యోతి): పట్టుదల, సృజనాత్మకతతో ముందుకు సాగాలంటూ విద్యార్థులకు క్రియా యూనివర్సిటీ చాన్సలర్ లక్ష్మీనారాయణన్ సూచించారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఆదివారం జరిగిన 7వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఎల్‌ఈజీవో వ్యవస్థాపకుడు ఓలే కిర్క్ క్రిస్టియన్సన్ జీవితాన్ని ఉదహరించిన ఆయన.. కష్టాలను ఎదుర్కొంటూ ఎలా గొప్ప విజయాలను సాధించవచ్చో వివరించారు. అదే తరహాలో కృషి పట్టుదలతో కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలన్నారు. స్పేస్ టెక్నాలజీ, స్టార్టప్ పికెల్స్ గురించి వివరించారు. హైపర్ స్పెకా్ట్రల్, ఇమేజింగ్ అనే సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం, మైనింగ్, పర్యావరణం వంటి రంగాల్లో డేటా ఇవ్వడానికి ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా డ్రోన్ ఆధారిత పరిష్కారాలపై పరిశోధనలు జరుగుతుండటాన్ని గుర్తించాలన్నారు. చుట్టూ ఉన్న ప్రపంచం వేగంగా మారిపోతోందని, ప్రతి రంగంలో కనిపిస్తున్న కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. ‘మీ కథలను మీరే రాయండి. వాటిలో మీరే హీరోలుగా ఉండండి’ అంటూ సలహా ఇచ్చారు.
పట్టుదలతోనే వికసిత్ భారత్
వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే విద్యార్థులకు కృషి, పట్టుదల అవసరమని బోర్డు ఆఫ్ గవర్నర్ చైర్మన్, జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్ ఎండీ సజ్జన్ జిందాల్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ, సైన్స్ రంగంలో భారత ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాలపై దృష్టిపెట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందుతున్న క్వాంటం వ్యాలీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతాన్ని టెక్నాలజీ స్ర్టాటజిక్ హబ్‌గా తీర్చిదిద్దుతాయని తెలిపారు. తిరుపతి ఐఐటీకి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా అఽధ్యాపకులు నిర్వహించిన విద్యా కార్యకలాపాలు, పరిశోధనలను వివరించారు. ఈ ఏడాదిలో కోర్సులు పూర్తి చేసుకున్న 417మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు.
18 మందికి అవార్డులు
ప్రత్యేక ప్రతిభ కనబరచిన 18మంది విద్యార్థులకు వివిధ రకాల అవార్డులను ముఖ్య అతిథులు లక్ష్మీనారాయణన్, సజ్జన్ జిందాల్, ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ ప్రదానం చేశారు. అరవింద్ శ్రీనివాసన్‌కు ప్రెసిడెంట్ అవార్డు, మేఘవర్షిణికి గవర్నర్స్ ప్రైజ్, షేక్ మహ్మద్ అల్లాబక్ష్‌కు మొదటి డీన్స్ ప్రైజ్, పి.కుమార్‌మిశ్రాకు ఇన్‌స్టిట్యూట్ ప్రైజ్, మేఘవర్షిణికి కమటం కృష్ణయ్య అవార్డు, కొత్తపల్లి ఈశ్వర్ వెంకట సాయివర్మకు అసోసియేట్ ప్రైజ్, అరవింద్ శ్రీనివాసన్, కలం మదన్‌మోహన్, జైదీప్ రాయ, రితిక్‌మండల్, ఆదిత్యన్, గౌరవ్ త్రిపతికు ఇనిస్టిట్యూట్ ప్రైజ్, సుధాకర్ వెంకటాచలానికి అమరరాజా ప్రైజ్, శ్రుతికి ఐటీసీ లిమిటెడ్ ప్రైజ్, ఆకాశకు ప్రొఫెసర్ శ్రీనివాసన్ నటరాజన్ అవార్డు, అన్నయ్ మండల్‌కు ఆకురత్తి కుమారస్వామి సీతారావమ్మ మెమోరియల్ ప్రైజ్, చిరంజీవికి రామకృష్ణన్ ప్రైజ్ లభించాయి.
ప్రెసిడెంట్ అవార్డు రావడం ఆనందంగా ఉంది: అరవింద్ శ్రీనివాసన్
417మందిలో నాకు ప్రెసిడెంట్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రుల కలలు నిజం చేసిన రోజు వచ్చిందని ఆనందంగా ఉంది.
పట్టుదల కృషితోనే సాధ్యం:ఎం.మేఘవర్షిణి
పట్టుదల, కృషి, అధ్యాపకుల సహకారంతో గవర్నర్ ప్రైజ్ అందుకున్నా. దీంతో కృషితో దేన్నయినా సాధించవచ్చని నిరూపణ అయింది. వందమందిలో ప్రత్యేకంగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది.