Totapuri: తోతాపురికి మద్దతు ధర అమలు అసాధ్యమే
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:30 AM
ఈ ఏడాది జిల్లాలో మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు. ప్రభుత్వం కల్పించుకుని రూ.4 సబ్సిడీ ప్రకటించినా రైతుల సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యేలా లేదు.

అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నా దక్కని ఫలితం
చిత్తూరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జిల్లాలో మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు. ప్రభుత్వం కల్పించుకుని రూ.4 సబ్సిడీ ప్రకటించినా రైతుల సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యేలా లేదు. ఫ్యాక్టరీల నుంచి రైతులకు కిలోకు రూ.8 ఇప్పించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. చేసేదేమీలేక రూ.5 లేదా రూ.6కే అంగీకరించాల్సి వస్తోంది.ఈసారి పంట అధిక దిగుబడి వచ్చిన విషయం, డిమాండ్ తగ్గిన విషయం తెలిసిందే. అందుకే ప్రభుత్వం కల్పించుకుని రూ.4 సబ్సిడీ ప్రకటించింది. మిగిలిన రూ.8ని ఫ్యాక్టరీలు ఇవ్వాలని కోరినా.. 2023, 2024 నాటి 40 వేల టన్నుల పల్ప్ డిమాండ్ లేక మిగిలిపోవడంతో ఫ్యాక్టరీలు ముందుకు రావడం లేదు.
రోజుకు 6 వేల టన్నుల కాయలు
జిల్లాలో గల్లా, జైన్, ఫుడ్ ఇన్స్ వంటి ఐదారు ఫ్యాక్టరీలు మాత్రమే కిలో మామిడికి రూ.6 ఇస్తున్నాయి. మిగిలినవన్నీ రూ.5 మాత్రమే చెల్లిస్తున్నాయి. తిరుపతి జిల్లాలోని ఒకట్రెండు ఫ్యాక్టరీలు అయితే రూ.4 కూడా ఇస్తున్నాయి. ఒక్కో ఫ్యాక్టరీ స్థాయిని బట్టి రోజుకు 50 నుంచి 120 టోకెన్లను రైతులను అందిస్తోంది. ఇలా రోజుకు 1300మంది రైతులకు చెందిన ట్రాక్టర్లు ఫ్యాక్టరీల్లోకి వెళ్తున్నాయి. రోజుకు 5500-6000 టన్నుల కాయలు అమ్ముడవుతున్నాయి.
యంత్రాంగమంతా నిమగ్నం
కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నా తోతాపురికి మద్దతు ధర విషయంలో ఫలితం కనిపించడం లేదు. శుక్రవారం కూడా కార్వేటినగరం, జీడీనెల్లూరు, పూతలపట్టు, పులిచెర్ల మండలాల్లోని ఫ్యాక్టరీలను కలెక్టర్ తనిఖీ చేశారు. జేసీ విద్యాధరి గుడిపాల మండలంలో పర్యటించారు. వీరికి తోడు ఉద్యానవన శాఖ డీడీ మధుసూదన రెడ్డి, ఆయా ప్రాంతాల్లోని ఆర్డీవోలు, తహసీల్దార్లు నిత్యం ఫ్యాక్టరీలను తనిఖీ చేస్తున్నారు. రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.అయినా ధరల సంక్షోభాన్ని దాటలేకపోతున్నారు. ఇటీవల కలెక్టర్ తవణంపల్లెలో ఓ ఫ్యాక్టరీ దారికి రావడం లేదని క్లోజ్ చేసేందుకు ఆదేశాలిచ్చారు. అలాగే తవణంపల్లె, పూతలపట్టుల్లోని మూడు ఫ్యాక్టరీలు కూడా మాట వినడం లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నోటీసులిప్పించారు. దీంతో ఆ నాలుగు ఫ్యాక్టరీలు రైతులకు తగిన ధర ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇలా అన్ని శాఖల అధికారులు నిత్యం మామిడి సంక్షోభాన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నారు.
సీజన్ మొత్తం రూ.4 సబ్సిడీ అమలు
చాలా మంది రైతు లు ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించడంతో కాయల్ని త్వరగా కోసేసి సొమ్ము చేసుకుందాం అనుకుంటున్నారు. పక్వానికి రాని కాయల్ని కోసి ఫ్యాక్టరీల్ని తరలిస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీల్లో పక్వానికి రాని కాయల్ని పక్కనపెట్టేస్తున్నారు. మొత్తంగా రైతులు అవగాహనా రాహిత్యంతో ఇలా కూడా నష్టపోతున్నారు. ప్రభు త్వం ప్రకటించిన సబ్సిడీ రూ.4 ఈ సీజన్ అయ్యేవరకు అమలవుతుందని అధికారులు చెబుతున్నా రైతులు పట్టించుకోవడం లేదు.
‘మామిడి’పై అధ్యయనానికి బెంగళూరుకు జిల్లా బృందం
చిత్తూరు సెంట్రల్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): మామిడి సాగు, దిగుబడి, గిట్టుబాటు ధర, రైతుల సమస్యలు, ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి సామర్థ్యం తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి ఉద్యాన శాఖాధికారులతో కూడిన జిల్లా బృందం శుక్రవారం బెంగళూరుకు వెళ్లింది. తమిళనాడు, బెంగళూరులో మామిడి సాగు అధికంగా ఉంది. బెంగళూరు నుంచి మామిడి తక్కువ ధరకు లభించడంతో మన జిల్లాలోని గుజ్జు పరిశ్రమలు ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నాయి. దీనివల్ల జిల్లాలో మామిడి ధరలు పతనమవుతున్నాయి. వీటితోపాటు డిమాండ్ ఆధారంగా ఏయే రాష్ట్రాలకు జిల్లా నుంచి మామిడి ఎగుమతులు చేసే వీలుందో పరిశీలించనున్నారు.
మామిడి రైతులను ఆదుకుంటాం : కలెక్టర్
వెదురుకుప్పం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తోతాపురి మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎవరూ ఆందోళన చెందొద్దని కలెక్టర్ సుమిత్‌కుమార్ భరోసా ఇచ్చారు. శుక్రవారం కార్వేటినగరం మండలం అన్నూరు వద్ద ఉన్న ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు, కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రైతులు నష్టపోకుండా మద్దతు ధరను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు. రైతులు కూడా పక్వానికి వచ్చాకే కాయలను కోయాలని సూచించారు. చివరి కిలో వరకు రూ.4సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్లోని 94910 77325, 08572-242777 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
జైన్ ఫ్యాక్టరీకి తగ్గని తోతాపురి తాకిడి
గంగాధరనెల్లూరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి):గంగాధరనెల్లూరు మండలంలోని జైన్ ఫ్యాక్టరీకి తోతాపురి తాకిడి రోజురోజుకూ పెరిగిపోతోంది. గంగాధరనెల్లూరుతో పాటు నియోజకవర్గంలోని పెనుమూరు, శ్రీరంగరాజపురం, కార్వేటినగరం, పాలసముద్రం, వెదురుకుప్పం మండలాలకు చెందిన పలు గ్రామాలనుంచీ రైతులు 100 గొల్లపల్లె వద్దగల జైన్‌ఫ్యాక్టరీకి 10రోజులుగా, తూగుండ్రం వెళ్ళేదారిలో వున్న జైన్‌ఫ్యాక్టరీకి వారంరోజులుగా తోతాపురి మామిడికాయలను తరలిస్తున్నారు. ట్రాక్టర్లలో కాయలను లోడ్‌చేసుకుని వచ్చి జైన్‌ఫ్యాక్టరీకి ఎదురుగా రోడ్డుకు ఇరువైపులా బారులు తీరుతున్నారు. అలాగే 9వ మైలువరకు మరోచోట రోడ్డుపక్కన మొత్తంగా కలిపి రెండు ఫ్యాక్టరీల వద్ద సుమారు 350 ట్రాక్టర్లు బారులు తీరాయి.దీంతో మామిడి కాయల అన్‌లోడింగ్‌కు సుమారు 24 గంటల నుంచీ 36 గంటల సమయం పడుతోంది.మరో 15 రోజులు ఈ ట్రాక్టర్ల తాకిడి తగ్గకపోవచ్చునని అంచనా.