Share News

TTD: టీటీడీ సేవలు ఎలా ఉన్నాయ్‌!

ABN , Publish Date - Jun 30 , 2025 | 02:02 AM

టీటీడీ భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను మరింత మెరుగుపరిచేందుకు భక్తుల అభిప్రాయాలను సేకరించే ఫీడ్‌బ్యాక్‌ సర్వేను కొనసాగిస్తోంది.

TTD: టీటీడీ సేవలు ఎలా ఉన్నాయ్‌!
భక్తుల అభిప్రాయ సేకరణ

తిరుమల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): టీటీడీ భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను మరింత మెరుగుపరిచేందుకు భక్తుల అభిప్రాయాలను సేకరించే ఫీడ్‌బ్యాక్‌ సర్వేను కొనసాగిస్తోంది. ఐవీఆర్‌ఎస్‌, వాట్సాప్‌ ద్వారా ఈ-సర్వే, శ్రీవారిసేవకుల ద్వారా మాన్యూవల్‌ సర్వేలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐవీఆర్‌స్‌ ఎలక్ర్టానిక్‌ సర్వే విధానం ద్వారా భక్తులు తిరుమలయాత్ర పూర్తి అనుభవం, అన్నప్రసాదం, కల్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వసతి, క్యూలైన్ల నిర్వహణ, లగేజీ కౌంటర్లపై మొత్తం 16 ప్రశ్నలతో తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు.

వాట్సాప్‌: తిరుమల, తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌లను భక్తులు తమ మొబైల్‌తో స్కాన్‌ చేస్తే ‘93993 99399’ వాట్సాప్‌ నెంబరు ఓపెన్‌ అవుతుంది. ఇందులో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ద్వారా భక్తులు తమ పేరుతో, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్‌, గదులు వంటివి) ఎంచుకుని తమ ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వచ్చు.

శ్రీవారి సేవకుల ద్వారా

తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రత్యక్షంగా శ్రీవారి సేవకులతో అభిప్రాయ సేకరణ జరుగుతోంది. టీటీడీ రూపొందించిన ప్రశ్నావళితో కూడిన అప్లికేషన్‌ను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని భక్తుల అభిప్రాయలను సేకరిస్తారు. త్వరలోనే టీటీడీ మొబైల్‌ యాప్‌, టీటీడీ బుకింగ్‌ పోర్టల్‌ నుంచీ అభిప్రాయ సేకరణ ప్రారంభించనున్నారు. భక్తుల అభిప్రాయాలను క్రోడీకరించి సేవలను మరింత మెరుగుపరిచే దిశగా టీటీడీ ఈ విధానాన్ని చేపట్టింది.


భక్తులూ.. ఆగి వెళ్లండి

తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి: తిరుమల కొండకు వచ్చే భక్తులూ ఒక మాట. తిరుపతిలో కాసేపు ఆగి వెళ్లండి.. అంటూ పోలీసులు సూచిస్తున్నారు. ‘దూర ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతిలో రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకోండి. దీనివల్ల కార్ల ఇంజన్‌ చల్లబడుతుంది. వాహనాలు నడుపుతున్న వ్యక్తులకూ నిద్రమత్తు ఉండదు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలను నివారించొచ్చు’ అని చెబుతున్నారు. తిరుమలకు వచ్చే కారు ఆదివారం జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద ఇంజన్‌లో నుంచి పొగలు రావడంతో మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో భక్తులకు సూచనలు చేస్తూ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి సమయంలో శ్రీవారి దర్శనమై తిరుగు ప్రయాణమైన వారూ తిరుపతిలో ఆగి విశ్రాంతి తీసుకుని వెళ్లాలని సూచించారు. తద్వారా నిద్రమత్తు వీడి.. కొంతవరకు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొంటున్నారు.

Updated Date - Jun 30 , 2025 | 02:02 AM