Vice MPP: మాజీ వైస్ ఎంపీపీ దారుణ హత్య
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:33 AM
తవణంపల్లె మాజీ వైస్ ఎంపీపీ, టీడీపీ నాయకుడు తెల్లగుండ్లపల్లె రంగయ్యనాయుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.

తవణంపల్లె, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తవణంపల్లె మాజీ వైస్ ఎంపీపీ, టీడీపీ నాయకుడు తెల్లగుండ్లపల్లె రంగయ్యనాయుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 15 సంవత్సరాల క్రితం తవణంపల్లె మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసిన రంగయ్యనాయుడు ప్రస్తుతం స్వగ్రామం తెల్లగుండ్లపల్లెలో భార్యతో కలిసి ఉంటున్నాడు. భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాదులోని కుమారుడు వద్దకు వెళ్లింది. దీంతో కుమార్తె, అల్లుడు.. రంగయ్యనాయుడికి తోడుగా ఉంటున్నారు. శనివారం రాత్రి భోజనం చేశాక ముగ్గురూ ఇంట్లోనే నిద్రించారు. ఆదివారం వేకువజామున సుమారు 5.45 గంటలకు ఇంటి ముందున్న ట్రాక్టరు షెడ్డుకు కాళ్లు, చేతులు కట్టేసి ఉరేసి ఉండటాన్ని పక్కింటివారు గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సాయినాథ్, రూరల్ వెస్ట్ సీఐ శ్రీధర్‌నాయుడు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిత్తూరు నుంచి జాగిలాలు, క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా, గ్రామంలో కొంతమంది యువకులతో జరిగిన చిన్నపాటి గొడవలే ఈ హత్యకు కారణమన్న ఆరోపణలతో కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.