Srikalahasti: విజ్ఞానగిరికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:39 AM
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

శ్రీకాళహస్తి, జూలై 20(ఆంధ్రజ్యోతి): హరోం హర అంటూ భక్తులు విజ్ఞానగిరికి పోటెత్తారు. పసుపు దుస్తులతో కావళ్లు మోస్తూ మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఆడికృత్తిక సందర్భంగా కుమారస్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. నారద పుష్కరణి వద్ద రాత్రి 8.30గంటల వరకు సుమారు8,500 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఇక 2,700మంది స్వామికి కావళ్లు సమర్పించారన్నారు. ఆడికృత్తిక సందర్భంగా ఉదయం వళ్లీ, దేవసేన సమేత కుమారస్వామి ఇంద్రవిమానంపై పురవిహారం చేశారు.