Pawan Kalyan: ఏనుగుల బీభత్సంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి..
ABN , Publish Date - Feb 25 , 2025 | 10:39 AM
అన్నమయ్య జిల్లా: శేషాచలం అడవుల్లో భక్తులపై ఏనుగులు దాడి చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు స్పందించారు. గుండాలకోన అటవీ ప్రాంతంలో ఏనుగులు దాడి చేసి ముగ్గురు భక్తులను చంపేయడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు చంద్రబాబు, పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున డిప్యూటీ సీఎం పవన్ ఆర్థికసాయం ప్రకటించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా యంత్రాంగానికి ఫోన్ చేసి పవన్ వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు.
మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించి భరోసా కల్పించాలని ప్రభుత్వ విప్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్‌ను ఉపముఖ్యమంత్రి పవన్ ఆదేశించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్యేను వెంటనే వై.కోటకు వెళ్లాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే శ్రీధర్ బాధితుల వద్దకు బయలుదేరారు. మరోవైపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని అటవీ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. మరోవైపు దాడి ఘటన గురించి తెలుసుకున్న అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. శేషాచలం అడవుల్లో నడిచివెళ్తున్న భక్తులపై ఏనుగులు దాడి చేయడంపై జిల్లా ఉన్నతాధికారులను అడిగి మంత్రి జనార్దన్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కాగా, మంగళవారం ఉదయం వై.కోటకు చెందిన భక్తులు శేషాచలం అడవుల్లో నడుస్తూ తలకోనకు వెళ్తున్నారు. అయితే మార్గమధ్యంలో ఏనుగులు సదరు భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వారిని తిరుపతి రుయాకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. పరిస్థితి ఎలా ఉందంటే..
Gold and Silver Rates Today: షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..