Jewelry theft: నగల కోసం దురాగతం
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:41 AM
నగల దొంగతనానికి అడ్డుపడిందని ఓ మహిళను హతమార్చిన వైనమిది,
కల్లూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): నగల దొంగతనానికి అడ్డుపడిందని ఓ మహిళను హతమార్చిన వైనమిది,పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లి పంచాయతీ బీసీ కాలనీలో అరుణాచలం ఆచారి నివసిస్తున్నాడు.ఆయనకు వరసకు మరదలైన కళావతమ్మ (65) ఇదే ఇంట్లోనే ఉంటోంది. ఇంటి మిద్దెపై విమల (59) అనే మహిళ కుమార్తె కోమలతో కలిసి బాడుగకు ఉంటోంది. సోమవారం అరుణాచలం బయటకు వెళ్లగా కళావతమ్మ ఒంటరిగా ఉంది. ఇదే సమయంలో ఓ దుండగుడు ఇంటిలో ప్రవేశించాడు. మెడలో బంగారు నగలు తీసివ్వాలని అడిగాడు. ససేమిరా అనడంతో కళావతమ్మతో పెనుగులాటకు దిగాడు. ఇంతలో మిద్దెపై ఉన్న విమల వచ్చి చూసి గట్టిగా ఎదురు తిరిగింది. దీంతో దుండగుడు విమల తలపై బలమైన ఆయుదంతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన విమల తల పగిలి మృతి చెందింది. చాకుతో పొడవడంతో కళావతమ్మ స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటి తర్వాత తల్లి కనిపించకపోవడంతో విమల కుమార్తె కోమల కిందకి వచ్చింది. రక్తపు మడుగులో తల్లి, స్పృహ లేకుండా పడి ఉన్న కళావతమ్మలను చూసి భయంతో కేకలు వేసింది. స్థానికులు చేరుకొని కల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ సాయినాథ్, సీఐ జయరామయ్య, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.కింద పడిఉన్న కళావతమ్మ బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. ఆమెను చికిత్స కోసం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కళావతమ్మ కోలుకుంటే హత్య జరిగిన తీరు తెలుస్తుందని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. హత్యలో పాల్గొన్నది ఒకరా లేక ఇద్దరా అనేది విచారణలో తేలుతుందన్నారు. దిగుమూర్తివారి పల్లి సమీపంలో మిరియాల గుట్టలో ఉంటున్న ఒక వ్యక్తిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.