RTC: ఒక ఆలోచన బస్సునే మార్చేసింది!
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:38 AM
ఒక చిన్న ఆలోచన.. స్ర్కాప్‌కు వెళ్లాల్సిన బస్సులను ‘పల్లె వెలుగు’ సర్వీసులుగా మార్చింది. బస్సుల కొరతను ఎదుర్కొనేందుకు ఉపయోగపడింది. గతేడాది మొదలు పెట్టిన ఆర్టీసీ బస్సుల ‘బాడీ కన్వర్షన్’ ప్రక్రియ.. తిరుపతి డిపోలోని ఎనిమిది బస్సుల రూపాలను పూర్తిగా మార్చేసింది.

తిరుపతి(ఆర్టీసీ), ఆంధ్రజ్యోతి: గతేడాది జనవరిలో 15 ఏళ్లు దాటిన కొన్ని సూపర్ లగ్జరీ బస్సులను స్ర్కాప్‌కు పంపేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో కొన్ని గ్రామాలకు నడిపేందుకు పల్లెవెలుగు బస్సుల కొరత ఏర్పడింది. కొత్త బస్సులు వచ్చే అవకాశాలు కనబడలేదు. పైగా స్ర్కాబ్‌కు పంపాలని పక్కన పెట్టిన బస్సులలో కొన్ని విడిభాగాలు బాగున్నాయి. దీంతో అప్పటి డీపీటీవోగా ఉన్న చెంగల్‌రెడ్డి, డిప్యూటీ సీఎంఈగా ఉన్న జి.నరసింహులు సమాలోచనలు జరిపి.. తిరుపతి డిపో మేనేజర్ బాలాజీ, గ్యారేజీ సిబ్బందితో చర్చించారు. దాని ఫలితమే ‘బస్సు బాడీ కన్వర్షన్’. వీరు విజయవాడ ప్రధాన కార్యాలయానికి పంపిన ప్రతిపాదనలకు అక్కడి అధికారులు అంగీకరించి తిరుపతితో పాటు ఇతర జిల్లాలకూ అనుమతులిచ్చారు. బస్సు బాడీ కన్వర్షన్ ప్రక్రియను అనుసరించాలని ఆదేశించారు. తిరుపతిలో తొలుతగా ఓ సూపర్ లగ్జరీ బస్సుపై ప్రయోగాత్మకంగా పనులు మొదలుపెట్టారు. ఉపయోగ పరికరాలు మినహా పాడైనవాటిని తొలగించి స్ర్కాప్‌కు వేశారు. రేకులు, సీట్లు, పిల్లర్స్, రంగులు, టైర్లు, లైటింగ్, బ్రేకులు, గేర్‌బాక్సు, ఎయిర్‌ఫిల్టర్, ఇతర సాంకేతిక పరమైన వాటిని కొత్తగా అమర్చారు. వీటికి సుమారు రూ.1.5 లక్షలు ఖర్చు పెట్టి.. 52 సీట్ల సామర్థ్యంతో పల్లెవెలుగు బస్సుగా మార్చారు. కొన్ని రోజుల పాటు డిపోలోనే నడిపి పరిశీలించారు. తర్వాత సిబ్బందిని ఎక్కించుకొని తిప్పారు. ఎలాంటి సమస్య ఎదురు కాకపోవడంతో అనుభవమున్న డ్రైవర్ ధనాంజనేయులను ఎంపికచేసి తిరుపతి నుంచి పళ్లిపట్టుకు నడిపారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. దాంతో కాలం చెల్లిన బస్సులను అవసరమైన సంఖ్యలో పల్లెవెలుగు బస్సులుగా మార్చుకోవాలని పూర్తిస్థాయి అనుమతులు వచ్చాయి.
ఏడాదిలో 8 బస్సుల బాడీ కన్వర్షన్
2024 జనవరిలో ప్రారంభమైన ఈ ప్రక్రియలో మొత్తం 8 బస్సులను పల్లెవెలుగు బస్సులుగా మార్చారు. రాష్ట్రంలోని 128 డిపోలలో అత్యధిక సంఖ్యలో బస్సు బాడీ కన్వర్షన్ జరిగింది క్క తిరుపతి డిపోలోనే. ఈ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించిన కోచ్‌బిల్డర్స్ అండ్ వెల్డర్స్ రాజ్‌గోపాల్, సుబ్బరాజు, అంకయ్య, గురవయ్య, గోపికి ప్రశంసా పత్రాలు అందించారు. కొత్తగా నాలుగు అలా్ట్రడీలెక్స్ బస్సులు రాగానే.. పాతవాటిని ఇదే తరహాలో కన్వర్షన్ చేయనున్నారు.