Kuppam: అంబులెన్స్‌లు, ఈ-ఆటోలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:27 AM
కుప్పానికి ‘వాహన’యోగం పట్టింది. రెండు అంబులెన్స్‌లు, నాలుగు ఈ-ఆటోలు ఇప్పటికిప్పుడు రావడమే కాదు, ఇంకో 90 దాకా ఈ-ఆటోలకు ఒప్పందం కుదిరింది. ఒప్పందమంటే ఇదేదో నగదు చెల్లించే పరస్పర ఒప్పందం కాదు, ఉచితంగా అన్ని ఆటోలూ కుప్పం చేరబోతున్నాయి.

కుప్పం, , ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కుప్పానికి ‘వాహన’యోగం పట్టింది. రెండు అంబులెన్స్‌లు, నాలుగు ఈ-ఆటోలు ఇప్పటికిప్పుడు రావడమే కాదు, ఇంకో 90 దాకా ఈ-ఆటోలకు ఒప్పందం కుదిరింది. ఒప్పందమంటే ఇదేదో నగదు చెల్లించే పరస్పర ఒప్పందం కాదు, ఉచితంగా అన్ని ఆటోలూ కుప్పం చేరబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి 6, 7, 8 తేదీల్లో కుప్పంలో పర్యటించారు. ఆ సమయంలో కడా ద్వారా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీల ప్రతినినిధులతో కుప్పం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందాలలో ఈ రాయిస్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ఒకటి. యువ ఐఏఎస్ వికాస్ మర్మత్ సమర్థతతో ఎలక్ట్రిక్ ఆటోలు, బైక్‌లు తయారు చేసే ఈ కంపెనీ కుప్పానికి రావడానికి అంగీకరించింది. ఇక్కడే తయారీ యూనిట్ పెట్టాలని నిర్ణయించుకుంది. రామకుప్పం మండలం విజలాపురం సమీపంలో ఇందుకోసం 14 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది కూడా. మనకో తయారీ కంపెనీ వస్తోంది కదా.. దానివల్ల ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి కదా అని వదిలేయలేదు కడా పీడీ. కార్పొరేట్ కంపెనీలకు ఉండాల్సిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎ్‌సఆర్) అంటే సామాజిక బాధ్యత గుర్తుకు వచ్చింది. సీఎ్‌సఆర్ కింద తమకు కొన్ని ఈ-ఆటోలు ఉచితంగా కావాలని ప్రతిపాదన పెట్టారు. ఒకటీ రెండు కాదు. ఏకంగా 93 ఆటోలు కోరారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 93 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి ఒకటి చొప్పున ఈ ఆటోలు పంపితే చెత్తను సేకరించి డంప్ చేయడానికి ఉపకరిస్తాయని ప్రతిపాదించారు. కొన్నాళ్లు ఈ ప్రతిపాదన చర్చల దశలోనే ఉంది. చివరికి ఈ రాయిస్ కంపెనీ అంగీకరించింది. ఈ రాయిస్ కంపెనీనుంచి తొలి విడతగా 4 ఈ-ఆటోలు గత వారం కుప్పంలోని కడా కార్యాలయం చేరాయి. మిగిలిన ఆటోలు కూడా త్వరలోనే రానున్నాయి.
పేటీఎం నుంచి రెండు అంబులెన్స్‌లు
కడా ద్వారా పీడీ వికాస్ మర్మత్ ఎప్పుడూ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడ అభివృద్ధికి ఏరకమైన సాయం కావాలో అన్వేషిస్తూనే ఉంటా రు. ఇందులో భాగంగానే పేటీఎం ప్రతినిధులతో ఇటీవల పీడీ సమావేశమయ్యారు. ఈ క్రమంలో అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ కలిగిన అత్యాధునిక రెండు అంబులెన్స్‌లు ఉచితంగా ఇవ్వడానికి ఆ సంస్థ అంగీకరించింది. ఒక్కోటీ రూ.33 లక్షల విలువైన రెండు అంబులెన్స్‌లు కడా కార్యాలయం చేరుకున్నాయి. ఈ అంబులెన్స్‌లను త్వరలోనే కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల సేవలకు అందుబాటులో ఉంచనున్నారు.