CM Chandrababu: ఇదే రాజధాని
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:43 AM
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని అభివృద్ధికి అదనపు భూసమీకరణ అవసరమని, భూదరాలు తగ్గవని భరోసా ఇచ్చారు.

అమరావతిపై పార్లమెంటులో చట్టం చేయిస్తా
అదనపు భూసమీకరణపై అపోహలొద్ద్దు.. రైతులకు సీఎం భరోసా
‘‘అదనపు భూసమీకరణ కారణంగా అమరావతిలో భూముల ధరలు పడిపోతాయనే అపోహలకు గురికావద్దు. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తేనే అమరావతి అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుంది. లేనిపక్షంలో మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది. మీకు అమరావతిని మున్సిపాలిటీగా చూడాలని ఉందా? లేక అంతర్జాతీయ నగరంగా చూడాలని ఉందా? మీ పోరాటమూ, స్థలబలమే అమరావతిని పరిరక్షించాయి. అమరావతి రాజధానిని విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు తీసుకెళుతున్నాం.’’
- సీఎం చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చూడాలంటే ఫేజ్-2 భూసమీకరణ తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని రైతులకు తెలిపారు. సోమవారం సాయంత్రం రాజధాని రైతులు, రైతుకూలీలతో ఉండవల్లి నివాసంలో చంద్రబాబు సుమారు గంటన్నరపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని అభివృద్ధిపై రైతుల అపోహలకు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో చట్టం చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. రాజధాని అవసరాలకు అదనంగా భూమిని సమీకరించాల్సి ఉంటుందని వివరించారు. ‘‘గతంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 5 వేల ఎకరాలు భూసేకరణ చేస్తే అంత ఎందుకని చాలా మంది ప్రశ్నించారు. ముందుచూపుతో అంత భూమి సేకరించబట్టే నేడు అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు పెద్ద పెద్ద హోటళ్లు, మాల్స్ వచ్చి అక్కడ భారీ ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. అక్కడ చుట్టుపక్కల భూముల ధరలూ పెరిగి రైతులకు మేలు చేకూరింది. అమరావతిలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణాలకు మరికొంత భూమి అవసరం. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా, వారికి నష్టం కలిగేలా ఏ కార్యక్రమం.. నిర్ణయం ఉండదు.’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..
బంధుమిత్ర సపరివారంగా రండి..
‘‘కృష్ణానదిపై మరో మూడు, నాలుగు వారధులు వస్తాయి. ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లు వస్తాయి. దీనివల్ల ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. రాజధాని విస్తరించడం వల్ల పెద్ద ఎత్తున సంస్థలు, పెట్టుబడులు వస్తాయి. అదనపు భూసమీకరణ కారణంగా ఈ ప్రాంతంలో భూముల ధరలు పడిపోతాయనే అపోహలకు గురికావద్దు. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తేనే అమరావతి అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుంది. లేని పక్షంలో మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది. మీకు అమరావతిని మున్సిపాలిటీగా చూడాలని ఉందా లేక అంతర్జాతీయ నగరంగా చూడాలని ఉందా? అమరావతి రాజధానిని విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు తీసుకెళుతున్నాం. ప్రధాని మోదీ మే 2న అమరావతి వస్తున్నారు. అమరావతి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రధాని సభకు బంధుమిత్ర సపరివారంగా రావాలి.’’
రైతుల పోరాటం వల్లే అమరావతి సురక్షితం..
‘‘రాజధాని రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. ఎప్పటికీ రైతుల మంచి మనసును రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారు. దేవతల రాజధాని కాబట్టే కదిలించలేకపోయారు. మే 2 తర్వాత రాజధాని నిర్మాణం వేగవంతమవుతుంది. రైతులకు కేటాయించిన ప్లాట్లను కూడా అభివృద్ధి చేస్తాం.’’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
రాజధాని ఉద్యమ ఘట్టాలతో మ్యూజియం
రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల త్యాగాలకు గుర్తుగా స్మారకచిహ్నం ఏర్పాటు చేయాలని రైతులు కోరగా, అందుకు సీఎం అంగీకరించారు. శాతవాహన కాలం నుంచి అమరావతి ఉద్యమం వరకు జరిగిన పరిణామలన్నీ క్రోడీకరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని పరిధిలోని గ్రామ కంఠాల్లో ప్రస్తుతం నివాసం ఉంటూ పట్టాల్లేని వారికి పట్టాలివ్వాలని రైతులు కోరగా ఈ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. అమరావతి ఏకైక రాజధానిగా పార్లమెంటులో చట్టం చేయాలని రాజధాని రైతులు కోరగా సీఎం తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గత 10 ఏళ్లలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందునే ఆ ప్రతిపాదన చేయలేకపోయామన్నారు. రైతుల ప్లాట్లకు రుణాలు ఇవ్వడం లేదని ఓ రైతు సీఎంకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వెంటనే బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాజధాని రైతులకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిపై నమ్మకం కలిగించేందుకే తాను కూడా ఇక్కడే స్థలం కొని ఇల్లు కట్టుకుంటున్నానని సీఎం తెలిపారు. అనంతరం రాజధాని రైతులు మాట్లాడుతూ.. తమకు ఎలాంటి సమస్యలు లేవని, కేవలం కొన్ని అపోహలు మాత్రమే ఉన్నాయని, వాటిని ముఖ్యమంత్రి తొలగించారని అన్నారు. సమావేశంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.