Share News

Handri Neeva: హంద్రీ నీవాకు కూటమి హారతి

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:33 AM

రాయలసీమ కల.. ఎన్టీఆర్‌ సంకల్పం హంద్రీ నీవా కృష్ణా జలాలు కరువుసీమకు మళ్లించాలని ఆయన రూపక్పలన చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం.

Handri Neeva: హంద్రీ నీవాకు కూటమి హారతి

  • సీమలో పథకానికి ఎన్టీఆర్‌ రూపకల్పన

  • కరువు పల్లెలకు కృష్ణా జలాల మళ్లింపే లక్ష్యం

  • 1.7 కోట్లు క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలు

  • 45 లక్షల చదరపు మీటర్ల లైనింగ్‌

  • 120 రోజుల్లో రికార్డు స్థాయిలో పనులు

  • పిల్ల కాలువలు పూర్తయితేనే లక్ష్య సాకారం

  • నేడు కృష్ణా జలాలు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

(కర్నూలు - ఆంధ్రజ్యోతి): రాయలసీమ కల.. ఎన్టీఆర్‌ సంకల్పం హంద్రీ-నీవా! కృష్ణా జలాలు కరువుసీమకు మళ్లించాలని ఆయన రూపక్పలన చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు అందించడం ఈ పథకం లక్ష్యం. పలు అవరోధాలను అధిగమించి 2012లో ట్రయల్‌ రన్‌ విజయవంతం చేశారు. అప్పటి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నా.. పూర్తి సామర్థ్యం సంతరించుకోని పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిష్ఠాత్మకంగా విస్తరణ పనులు చేపట్టి 120 రోజుల్లో రికార్డు స్థాయిలో మట్టి, లైనింగ్‌ పనులు పూర్తి చేశారు. గురువారం సీఎం చంద్రబాబు మాల్యాల వద్ద జల హారతి ఇచ్చి.. రాయలసీమ జీవనాడి హంద్రీ-నీవా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇదే ఊపుతో పిల్ల కాలువల నిర్మాణం కూడా పూర్తయితే ఎన్టీఆర్‌ కల సంపూర్ణం అయినట్టే!

సీమకు జలకళ కోసం..

రాయలసీమ అంటే గుర్తుకొచ్చేది కరువు కాటకాలు.. దుర్భిక్షం....బతుకు పోరులో పల్లెజనం పడుతున్న వలస కష్టాలు....ఈ ప్రాంతంలో శ్రీశైలం జలాశయం నిర్మించినా ఒక్క ఎకరాకు సాగునీరు అందని దైన్య పరిస్థితి. ఏటేటా వేల టీఎంసీలు కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్నా.. గుక్కెడు నీరు అందక పరితపిస్తున్న పల్లెసీమలెన్నో. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్‌ తెలుగుగంగ, గాలేరు-నగరి ప్రాజెక్టు, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేశారు. 1985-90 మధ్యలో హంద్రీ-నీవా ప్రాజెక్టు డిజైన్‌ ఖరారు చేశారు. అయితే వివిధ కారణాలు వల్ల పనుల్లో వేగం పుంజుకోలేదు. 2004-05లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టింది. 2012లో ట్రయల్‌ రన్‌ విజయవంతం చేశారు. 2013 నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోస్తున్నారు.


కూటమి వచ్చాక పెరిగిన వేగం..

శ్రీశైలం ఎగువన 40 టీఎంసీల కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి రాయలసీమలోని అన్ని జిల్లాల పరిధిలో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు అందించడం లక్ష్యం. దీనికోసం 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో మాల్యాల లిఫ్ట్‌ సహా ఎనిమిది ఎత్తిపోతల పథకాల వద్ద 12 పంపులు ఏర్పాటుచేశారు. అయితే.. పూర్తిస్థాయి సామర్థ్యం మేర నీటిని ఎత్తిపోసుకోవడానికి వీలుగా మెయిన్‌ కెనాల్‌ లేకపోవడంతో 1,800 నుంచి 2 వేల క్యూసెక్కులకు మించి ఎత్తిపోయలేని పరిస్థితి. రాష్ట్ర విభజన తరువాత 2017-18లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.1,030 కోట్లతో 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి ప్రధాన కాలువ విస్తరణ పనులు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అటకెక్కించింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు.

మట్టి, లైనింగ్‌ పనుల్లో రికార్డు

నంద్యాల జిల్లా మల్యాల లిఫ్ట్‌ నుంచి కుప్పం వరకు కాంట్రాక్ట్‌ సంస్థల ఒప్పందం విలువ రూ.1,970 కోట్లతో హంద్రీ నీవా విస్తరణ పనులను చేపట్టారు. ఫేజ్‌-1 పరిధిలో 0/0 నుంచి 216.300 కిలోమీటర్ల వరకు మట్టి, లైనింగ్‌, 216.300 కిలోమీటర్ల నుంచి 400.500 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ, కుప్పం, పుంగనూరు బ్రాంచి కెనాల్స్‌ లైనింగ్‌, మట్టి పనులు 11 ప్యాకేజీలుగా విభజించి మార్చి 15న మొదలు పెట్టారు. సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో, వారం వారం ఇంజనీర్లు, కాంట్రాక్ట్‌ సంస్థలతో వర్చువల్‌ ద్వారా సమీక్షలు నిర్వహిస్తూ పురోగతిపై లక్ష్యాలు నిర్దేశించారు. 1.89 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు, 80.61 లక్షల చదరపు మీటర్ల సీసీ లైనింగ్‌, షాట్‌ క్రెటింగ్‌ చేయాలనేది లక్ష్యం. కేవలం 120 రోజుల్లో 1.73 కోట్లు క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు, 45 లక్షల చదరపు మీటర్ల లైనింగ్‌, షాట్‌ క్రెటింగ్‌ పనులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఇది సాధ్యమయిందని హంద్రీ-నీవా ప్రాజెక్టు ఎస్‌ఈ నాగరాజు, కర్నూలు సర్కిల్‌-1 ఎస్‌ఈ పాండురంగయ్య పేర్కొన్నారు. 2006-07లో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యూలేటర్‌ 44 వేల క్యూసెక్కులకు విస్తరణలో భాగంగా కేవలం మూడు నెలలో 1.30 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేస్తే.. ఆ తర్వాత అంతకు మించి బ్లాస్టింగ్‌, మట్టి పనులు, లైనింగ్‌ పనులు చేయడం ఓ రికార్డే అంటున్నారు.


SFJ.jpg

సీమ జీవనాడి...

శ్రీశైలం ఎగువన 40 టీఎంసీల ఎత్తిపోత

ఉమ్మడి కర్నూలు, అనంత, చిత్తూరు,

కడప జిల్లాలకు కృష్ణా జలాలు

6.05 లక్షల ఎకరాలకు సాగునీరు

35 లక్షల జనాభాకు తాగునీరు

పిల్ల కాలువల పనుల్లో కదలికేది?

కడలిపాలు అవుతున్న కృష్ణా జలాలు మెట్ట పొలాలకు మళ్లించి కరువు నేలను సస్యశామలం చేయాలనే సంకల్పంతో ఎన్టీఆర్‌ హంద్రీ నీవాకు రూపకల్పన చేశారు. ప్రధాన కాలువ దాదాపుగా పూర్తి చేసినా పంట పొలాలకు సాగునీరు అందించే డిస్ట్రిబ్యూటరీలు, పంట కాలువల నిర్మాణం చేపట్టలేదు. కర్నూలు జిల్లాలో 80 వేలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3.45 లక్షలు, అన్నమయ్య జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో కేవలం 25-30 వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వడం లేదు. ఎకరాకు రూ.20-25 వేల చొప్పున రూ.1,250 - 1,500 కోట్లు ఖర్చు చేసే 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చని ఇంజనీర్లు అంటున్నారు.

Updated Date - Jul 17 , 2025 | 03:33 AM