CM Chandrababu: ఉద్యోగులు కాదు ఉద్యోగాలిచ్చేవారు కావాలి
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:25 AM
ప్రపంచానికి క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని మారుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగులు కాదు, ఉద్యోగాలు కల్పించగల ఎంటర్‌ప్రెన్యూర్లు కావాలని యువతను ఉత్సాహపరిచారు. అమరావతిలో దేశంలోని 7 ఉత్తమ వర్సిటీలు ఏర్పాటవుతాయని చెప్పారు

దేశంలోని 7 బెస్ట్ వర్సిటీలు రాజధానిలోనే
అమరావతి అన్‌స్టాపబుల్
క్వాంటమ్ వ్యాలీగా ఏపీని మలుస్తా
విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు
విట్‌లో 4 బ్లాకులు ప్రారంభించిన సీఎం
ఇప్పుడంతా నాలెడ్జ్ ఎకానమీదే భవిష్యత్తు.. ఈ రంగంలో రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలపాలి. అందువల్ల నాకు ఇప్పుడు కావాల్సింది లక్షల రూపాయల జీతాలు తీసుకునే ఉద్యోగులు కాదు.. ఇప్పుడు సంస్థలు స్థాపించే ఎంటర్‌ప్రెన్యూర్లదే రాజ్యం. ఉద్యోగాలు కల్పించేవారే ఇప్పుడు నాకు కావాలి. ఐటీ మాదిరిగా రాబోయే కాలమంతా క్వాంటమ్ కంప్యూటర్లదే. క్వాంటమ్ వ్యాలీకి అమరావతి కేరాఫ్ అడ్రస్ కానుంది. ఐటీ కోసం సిలికాన్ వ్యాలీవైపు చూసినట్లే క్వాంటమ్ టెక్నాలజీ కోసం ప్రపంచమంతా ఏపీవైపు చూడాలి. అందుకు తగిన విధంగా తీర్చిదిద్దుతా.. ఇన్నోవేషన్ హబ్‌గా మార్చుతా.
- సీఎం చంద్రబాబు
గుంటూరు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ఏడు బెస్ట్ యూనివర్సిటీలు అమరావతిలో రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక ఇప్పుడు అమరావతి అన్‌స్టాపబుల్ అంటూ వ్యాఖ్యానించారు. విట్ అమరావతి, ఎస్‌ఆర్‌ఎమ్, అమృత్ వంటి సంస్థలు ఇప్పటికే ఉండగా త్వరలో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టాటా ఇన్నొవేషన్ సెంటర్ రాబోతున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి సోమవారం వీఐటీ అమరావతి యూనివర్సిటీ సోమవారం నిర్వహించిన ‘వీ-లాంచ్‌ప్యాడ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్నారు. 4 కొత్త హాస్టల్ బ్లాకులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ‘ప్రపంచ అత్యుత్తమ సంస్థలను, విజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెడతా.. అందిపుచ్చుకోండి. ’అంటూ ఉత్సాహపరిచారు. మంత్రి కందుల దుర్గేశ్, విట్ చాన్స్‌లర్ జీ. విశ్వనాథన్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. సీఎం ఏమన్నారంటే..
ఆ బాధ్యత తీసుకుంటా..
‘‘విట్ అధినేత విశ్వనాథన్ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలితతో కలిసి పనిచేశారు. 2014లో నన్ను కలిసి అమరావతిలో విట్ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఆయన 200 ఎకరాలు అడగ్గా, 100 ఎకరాలు ఇచ్చాను. వారికి మరింత భూమి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. రాబోయే ఏడేళ్లలో 50 వేల మంది విట్‌లో చదివేలా అభివృద్థి చేసే బాధ్యత యాజమాన్యం తీసుకోవాలి. ప్రపంచంలోని టాప్ 100 వర్సిటీల్లో విట్ ఉండటం మనకు గర్వకారణం. విట్ విద్యాసంస్థల్లో మన అమరావతి విట్ నెంబర్‌వన్‌గా ఉండాలి.’’
మేధోసంపత్తి తెలుగువారి సొంతం
‘నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ముందుంటే, అందులో తెలుగువారు ట్రెండ్ సెట్టర్లుగా ఉన్నారు. మన తెలుగువారి జనాభా 5 శాతమే అయినప్పటికీ ఐఐటీల్లో 20 శాతం సీట్లు మనవాళ్లే సాధిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ నుంచి ేస్పస్ ఎక్స్ వరకు, గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, నాసా నుంచి వాల్ స్ర్టీట్ వరకు అన్ని చోట్లా మన తెలుగువారే సత్తా చాటుతున్నారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఇంద్రానూయీ, అజయ్ బంగా, శాంతను నారాయణ్ వంటి వారు గ్లోబల్ సంస్థల్ని బలోపేతం చేస్తుండటం మనకు గర్వకారణం. అలాంటి మేధోసంపత్తి తెలుగువారి సొంతం. సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్లు అని నినదించిన ఎన్టీఆర్ స్పూర్తితో పీ4కు శ్రీకారం చుట్టాం. టెర్రరిస్టుల కుట్రలు, కుయుక్తులు మనల్ని ఏం చేయలేవు. మన ఐక్యతను దెబ్బతీయలేవు. రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం. విశాఖకు కొత్త ఎయిర్ పోర్టు, మెట్రోతో పాటు గూగుల్ రాబోతోంది. రాయలసీమలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతాం. అనంతపురంలో లేపాక్షి మొదలు ఓర్వకల్లు వరకూ నాలెడ్జ్ హబ్‌గా తయారుచేస్తాం. రాయలసీమను డిఫెన్స్, ఎలక్ర్టానిక్, ఆటో మొబైల్స్, డ్రోన్, శాటిలైట్ లాంచింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అభివృద్థి చేస్తాం. భవిష్యత్తు డ్రోన్లదే. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తాం.