Share News

Samvidhan Hatya Diwas: ఆ రెండు అరాచకాలు దేశ ప్రజలకు కేస్ స్టడీస్: చంద్రబాబు

ABN , Publish Date - Jun 25 , 2025 | 08:35 PM

పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతిలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివాస్‌లో అనేక విషయాలపై బాబు ప్రసంగించారు.

Samvidhan Hatya Diwas: ఆ రెండు అరాచకాలు దేశ ప్రజలకు కేస్ స్టడీస్: చంద్రబాబు
Samvidhan Hatya Diwas

అమరావతి: 1975, జూన్ 25 భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన రోజని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివాస్‌లో సీఎం చంద్రబాబు పాల్గొని అనేక విషయాలపై ప్రసంగించారు. భారతదేశంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి నేటితో 50 ఏళ్లని చెప్పిన చంద్రబాబు.. ఎమర్జెన్సీని ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. మంచి రోజులే కాదు, చీకటి రోజులూ గుర్తు పెట్టుకోవాలని, మంచి, చెడుకు మధ్య వ్యత్యాసం ప్రజలకు తెలియాలని ముఖ్యమంత్రి అన్నారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి దేశంలోని సామాన్య ప్రజల్ని హింసించారని చంద్రబాబు అన్నారు.

ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు చెప్పిందన్న విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. ఎమర్జెన్సీ తరహాలోనే ఏపీలో గత ప్రభుత్వ పాలన సాగిందన్నారు. దీంతో పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని కాపాడుకున్నామని సీఎం చెప్పుకొచ్చారు. ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే ఐదారు తరాలు చూస్తారని, రాజకీయ నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అదే విషయాన్ని ఎందుకు పాటించరు? అని చంద్రబాబు ప్రశ్నించారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ అని చంద్రబాబు చెప్పారు.


చెడు పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారనటానికి ఎమర్జెన్సీనే ఓ ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. దాడులు, విధ్వంసం, విద్వేషంతో సాగుతున్న పాలనను అంతమొందించేందుకే తాను, పవన్ కల్యాణ్ చేతులు కలిపామని చెప్పారు. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం దిశగా వేసిన తొలిడుగుకు ప్రధాని మోదీ సహకరించారని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు డా.బి.ఆర్.అంబేడ్కర్ అందించిన పదునైన ఆయుధం ఓటు హక్కని తెలిపిన చంద్రబాబు.. మంచి రోజులతోపాటు చీకటి రోజుల్నీ గుర్తుపెట్టుకుంటేనే మంచి-చెడును బేరీజు వేయగలమన్నారు. మంచి చెడుల వ్యత్యాసంపై ప్రజల్ని చైతన్య పరిచేందుకు సంవిధాన్ హత్యా దివాస్ కార్యక్రమానికి మోదీ శ్రీకారం చుట్టారని వెల్లడించారు.

దేశ చరిత్రలో అతిపెద్ద చీకటి దినం జూన్ 25 ఎమర్జెన్సీ విధించిన రోజని చెప్పిన ముఖ్యమంత్రి.. నాడు ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాశారని మండిపడ్డారు. రాజ్యాంగ మూలాలను మర్చిపోకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని హితవు పలికారు. నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూలదోస్తే, తిరిగి గద్దెనెక్కటం ప్రజాస్వామ్య విజయమని చంద్రబాబు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం

ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 08:52 PM