Share News

Loan Recovery: వేలానికి మాజీ ఎంపీ బుట్టా ఆస్తులు

ABN , Publish Date - Apr 27 , 2025 | 03:00 AM

ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి తీసుకున్న రూ.310 కోట్ల రుణానికి బుట్టా రేణుక దంపతులు ఐదేళ్లుగా కంతులు చెల్లించకపోవడంతో వారి ఆస్తులు వేలానికి సిద్ధమయ్యాయి. గతంలో వేలం పెట్టిన ఆస్తులకు స్పందన లేకపోయినప్పటికీ మరోసారి వేలానికి రంగం సిద్ధమైంది.

Loan Recovery: వేలానికి మాజీ ఎంపీ బుట్టా ఆస్తులు

ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్ఎల్‌ నుంచి రూ.310 కోట్ల రుణం

ఐదేళ్లుగా నెలవారీ కంతులు కట్టని బుట్టా రేణుక దంపతులు

కర్నూలు, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతుల ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్ఎల్‌) నుంచి బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ రూ.310 కోట్లు రుణం తీసుకున్నారు. వీరికి హైదరాబాద్‌లో వ్యాపార, విద్యాసంస్థలు ఉన్నాయి. బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బుట్టా కన్వెన్షన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, మెరిడియన్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ కార్యకలాపాల కోసం 15 ఏళ్ల కాలవ్యవధిలో వడ్డీ, అసలు చెల్లించేలా 2018లో ఈ రుణం తీసుకున్నారు. మొదట్లో నెల కంతుల కింద రూ.40 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత వాయిదాలు చెల్లించకపోవడంతో, ఇచ్చిన అప్పు అసలు, వడ్డీ కలిపి రూ.340 కోట్లకు చేరింది. ఒప్పందం ప్రకారం ప్రతినెలా రూ.3.40 కోట్లు చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ భారం అధికంగా ఉందని, కొన్ని ఆస్తులు విక్రయించి రుణాన్ని రీషెడ్యూల్‌ చేయాలని బుట్టా దంపతులు కోరినట్లు సమాచారం. వారి ప్రతిపాదనను ఎల్‌ఐసీ హెచ్‌ఎ్‌ఫఎల్‌ అధికారులు తిరస్కరించారు. గత ఐదేళ్ల నుంచి రుణం చెల్లింపులో విఫలం కావడంతో బెంగళూరు బ్రాంచి అధికారులు పలుమార్లు నోటీసులు పంపారు. స్పందన లేకపోవడంతో చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.


అప్పు వసులులో భాగంగా కేసు నమోదు చేశారని తెలిసింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో బుట్టా దంపతులకు చెందిన రూ.145 కోట్లు విలువ చేసే 5వేల గజాల ఆస్తిని వేలం వేయగా.. కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. మాదాపుర్‌లో 7,205 గజాల విస్తీర్ణం ఉన్న బుట్టా కన్వెన్షన్‌ను వేలం వేస్తే.. ఇక్కడ కూడా స్పందన లేదు. వాస్తవానికి భారీ డిమాండ్‌ ఉన్న ఆస్తులివి. అయినా కూడా బుట్టా రేణుక రాజకీయాల్లో ఉండటంతోనే వేలంలో పాడుకుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఎవరూ ముందుకు రాలేదని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్పు రాబట్టుకోవడానికి హెచ్‌ఎ్‌ఫఎల్‌ సంస్థ మరోసారి ఆస్తుల వేలానికి సిద్ధమవుతోందని సమాచారం. బుట్టా రేణుక స్పందిస్తూ ఆర్థిక వ్యవహారాలు తన భర్త చూసుకుంటారని, రుణం విషయంలో వేలానికి వచ్చినట్లు మాత్రమే తెలిసిందని, అంతకుమించి తెలియదని చెప్పారు.

Updated Date - Apr 27 , 2025 | 03:02 AM