AIIMS BMT Launch: ఎయిమ్స్‌లో బోన్‌మారో మార్పిడి
ABN , Publish Date - May 09 , 2025 | 04:20 AM
మంగళగిరి ఎయిమ్స్‌లో తలసీమియా బాధితుల కోసం బోన్‌మారో మార్పిడి చికిత్సలు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో జెనెటిక్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకానుంది

మంగళగిరిలో త్వరలోనే అందుబాటులోకి
రక్తమార్పిడి కోసం ల్యూకో డిప్రెషన్ ఫిల్టర్ల పంపిణీ
విశాఖ కేజీహెచ్‌లో జెనెటిక్ టెస్టింగ్ సెంటర్
రాష్ట్రంలో 2,129 మంది తలసీమియా చిన్నారులు
‘ఆంధ్రజ్యోతి’తో ఎన్‌హెచ్‌ఎం కన్సల్టెంట్ సోనియా మోహన్
గుంటూరు మెడికల్, మే 8 (ఆంధ్రజ్యోతి): తలసీమియా బాధితుల కోసం మంగళగిరి ఎయిమ్స్ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ)లో బోన్‌మారో మార్పిడి (బీఎంటీ) శస్త్రచికిత్సలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ ఏపీ స్టేట్ కన్సల్టెంట్ (బ్లడ్ సెల్ పెథాలజీ) డాక్టర్ సోనియా మోహన్ తెలిపారు. ‘వరల్డ్ తలసీమియా డే’ను పురస్కరించుకొని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ వైద్య బోధన ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనియా మోహన్ కొద్దిసేపు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 2,129 మంది తలసీమియా వ్యాధిగ్రస్తులు ఉండగా, అర్హులైన 1,598 మంది నెలకు రూ.10 వేలు పెన్షన్ పొందుతున్నారని చెప్పారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సతో వ్యాధి నుంచి శాశ్వత విముక్తి కలిగించవచ్చన్నారు. దీనికోసం ఒక్కో రోగికి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ల ద్వారా 25 మంది బాధిత చిన్నారులకు స్ర్కీనింగ్ జరిపి, ఏడుగురిని బీఎంటీ శస్త్రచికిత్సకు ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో వీరికి ఆపరేషన్లు జరుగుతాయని డాక్టర్ సోనియా మోహన్ తెలిపారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, లఖ్‌నవూ, లూథియానా, చండీగఢ్ వంటి నగరాల్లో 11 ఎంప్యానల్ ఆస్పత్రుల్లో మాత్రమే బీఎంటీ సర్జరీలు చేస్తున్నట్లు వివరించారు. మన రాష్ట్రంలో ప్రైవేటు వైద్య రంగంలో ఈ ఆపరేషన్లు చేస్తున్నారని, మంగళగిరి ఎయిమ్స్‌లో వీటిని తొలిసారిగా అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో తొలి జెనెటిక్ టెస్టింగ్ సెంటర్ విశాఖలో
తలసీమియా బాధిత చిన్నారుల తల్లిదండ్రులకు మరుసటి సంతానానికి కూడా ఆ జబ్బు వస్తుందనే ఆందోళన సహజంగానే ఉంటుందని సోనియా మోహన్ తెలిపారు. గర్భస్థ శిశువుకు తలసీమియా ఉందో లేదో తెలుసుకొనేందుకు గర్భిణీకి ఉమ్మనీరు, బయాప్సీ పరీక్షలు చేస్తారని ఆమె వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ పరీక్షలు అందుబాటులో లేవని, నేషనల్ సికిల్‌సెల్ ఎనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో త్వరలోనే జెనెటిక్ టెస్టింగ్ సెంటర్ (సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్)ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. తలసీమియా రోగులకు తరచూ రక్తమార్పిడి అవసరమని, అయితే దీనివల్ల పలురకాల వైరల్ ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుందని అన్నారు. దీన్ని నిరోధించేందుకు నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏపీలో ప్రభుత్వాస్పత్రులకు ల్యూకో డిప్రెషన్ ఫిల్లర్లను సరఫరా చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ ఫిల్టర్లు తెల్ల రక్త కణాలను అడ్డుకొంటాయని సోనియా మోహన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో.. రూరల్ టూరిజం ప్రమోట్..
ఆపరేషన్ సిందూర్‌పై చైనా, అమెరికా స్పందన
For More AP News and Telugu News