Bird Flu Impact: బయోసెక్యూరిటీ ద్వారానే బర్డ్‌ఫ్లూ దూరం
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:42 AM
‘బర్డ్ ప్లూ వైరస్ ఎలా ప్రయాణిస్తుందో తెలియదు. వైరస్ సోకిన కిలోమీటరు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి, ఆ ప్రాంతంలోని కోళ్లను ఖననం చేశాం.

కేంద్ర పశుసంవర్థక శాఖ జేడీ ఆర్‌జీ బంబాల్
తణుకు రూరల్, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘బర్డ్ ప్లూ వైరస్ ఎలా ప్రయాణిస్తుందో తెలియదు. వైరస్ సోకిన కిలోమీటరు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి, ఆ ప్రాంతంలోని కోళ్లను ఖననం చేశాం. ఈ పరిధి గతంలో 3కిలోమీటర్ల వరకూ ఉండేది. రైతుల ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని కిలోమీటరుకు తగ్గించాం’ అని కేంద్ర పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌జీ బంబాల్ తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్ల ఫారాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం గురువారం పర్యటించింది. తణుకులో రైతులతో సరిగిన సమావేశంలో బంబాల్ మాట్లాడుతూ.. ‘బయోసెక్యూరిటీని పాటించడం ద్వారానే బర్డ్‌ప్లూ నుంచి బయటపడగలరు. రైతులు తమ పారాల్లోని కోళ్లకు వ్యాక్సినేషన్ వేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని వేస్తుంది. ఆ కమిటీ సూచనల మేరకు కేంద్రం వ్యాక్సిన్ ప్రక్రియ చేపడుతుంది. ఫారం గేటు దాటకుండానే వైర్‌సను నిర్మూలించేందుకు ప్రతీ రైతు చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో పౌల్ర్టీ ఫారాలను కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం శానిటైజ్ చేసి త్వరగా రిపోర్టులు పంపిస్తే త్వరగా కోళ్లను పెంచేందుకు అనుమతులు లభిస్తాయి’ అని చెప్పారు. పౌల్ర్టీ రైతుల సూచనలను కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. నెక్ చైర్మన్ కోమట్లపల్లి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కోళ్లలో బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం కన్నా ప్రభుత్వం విధించిన నిబంధనలను మీడియా ప్రచారం చేయడం వల్లే ప్రజల్లో అపోహలు పెరిగి పౌల్ర్టీ రైతులు నష్టపోతున్నారని చెప్పారు. బర్డ్‌ప్లూ కారణంగా పౌల్ర్టీ ఉత్పత్తులపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను తొలగించాలని కోరారు. అనంతరం వేల్పూరులోని కోళ్ల ఫారాలను అధికారులు పరిశీలించారు.