Bhogapuram Airport Update: విమాన వైభోగం
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:45 AM
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. 5,050 మంది కార్మికులు, ఇంజనీర్లు నిరంతరాయంగా పనిచేస్తున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే పూర్తయ్యే దిశగా పురోగతి సాధించింది

యుద్ధప్రాతిపదికన సాగుతున్న భోగాపురం విమానాశ్రయ పనులు
నిరంతరాయంగా శ్రమిస్తున్న 5,050 మంది సిబ్బంది, ఇంజనీర్లు
3.8 కిలోమీటర్ల పొడవున రన్‌వే
నింగి నుంచి వీక్షిస్తే ‘మీనాకృతి’
పక్క నుంచి చూస్తే విమాన రూపం
ప్రపంచస్థాయి సౌకర్యాలతో నిర్మాణం
సర్కారు మార్పుతో పనుల్లో పురోగతి
ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న చంద్రబాబు
పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్
ఇప్పటి వరకు 71 శాతం పనులు పూర్తి
ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘జీఎంఆర్’
నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి!
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 5,050 మంది కార్మికులు, సిబ్బంది షిఫ్టుల వారీగా నిరంతరాయంగా పనిచేస్తున్నారు. వందలాది భారీ వాహనాలు, యంత్రాలతో పనులు వడివడిగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని పెట్టుకున్న లక్ష్యానికి ముందే అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. నిర్ణీత లక్ష్యానికంటే ముందుగానే పనులు పూర్తిచేసే దిశగా పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ విమానాశ్రయ నిర్మాణంలో మొత్తం 5,050 మంది కార్మికులు, సిబ్బంది, ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. వచ్చే ఏడాది జూన్‌నాటికి విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యం.
ఆరేళ్ల కిందట శంకుస్థాపన
2019, ఫిబ్రవరి 14న అప్పటి సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రాథమిక పనులు చేపడుతుండగా.. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి వైసీపీ పగ్గాలు చేపట్టింది. దీంతో ఎయిర్‌పోర్టు పనులు నత్తనడకన సాగాయి. 2023, మే 3న ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జగన్ మరోసారి శంకుస్థాపన చేసినా పనుల్లో ఆశించిన పురోగతి లేదు. కేవలం 15 నుంచి 18శాతం మాత్రమే పనులు చేయగలిగింది. 2024, జూన్‌లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చాక ఏపీలో తొలి ప్రాధాన్య ప్రాజెక్టుగా భోగాపురం విమానాశ్రాయం పనులను పరుగులు పెట్టించాలని నిర్ణయించారు. విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తూ.. ప్రతి 15రోజులకు ఒకసారి సందర్శించి పురోగతిని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుకు సంబంధించి 2,200 ఎకరాల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని 500 ఎకరాలను పర్యాటక, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించాలని భావిస్తోంది. విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టిన జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావు స్వస్థలం విజయనగరం కావడంతో మరింత అంకితభావంతో పనులు చేపడుతున్నారు. ఇప్పటివరకు 71ు పనులు పూర్తి చేశారు.
అందరికీ అందుబాటులో..
భోగాపురం విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకు అనుసంధానించేలా పనులు చేపడుతున్నారు. అనకాపల్లి, విజయనగరం జిల్లాల మీదుగా వెళ్లే అరకు ప్రధాన రహదారి, విజయనగరం మీదుగా పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్లే అన్ని ప్రధాన రహదారులను కలుపుతున్నారు. ఒడిశా రాష్ట్రం హడ్డుబంగి నుంచి పాలకొండ మీదుగా విజయనగరం కొత్తపేట రింగురోడ్డు వరకూ రోడ్డు విస్తరణ, వీటితో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే జాతీయ రహదారులను సైతం అనుసంధానం చేస్తున్నారు. విశాఖ పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకు కనెక్టివిటీ రహదారి నిర్మించనున్నారు.
బీజం పడిందిలా.
విభజన హామీల్లో ఒకటైన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం పలు జిల్లాలు పరిశీలనకు వచ్చాయి. విశాఖలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం అవసరాలకు తగ్గట్టు చాలడం లేదు. దీంతో విజయనగరంలోని భోగాపురంలో నిర్మిస్తే ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని భావించారు. 2014-19 మధ్య కాలంలో పౌరవిమానయాన మంత్రిగా విజయనగరం ఎంపీ అశోక్‌గజపతి రాజు ఉండడంతో.. సొంత జిల్లాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో భోగాపురం మండలంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు నిర్ణయించారు. ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా రెల్లిపేట, బొల్లింకలపాలెం, ముడసర్లపేట, మారాడపాలెం నాలుగు గ్రామాలను పూర్తిగా తొలగించారు. ఆయా గ్రామాల్లో నివసిస్తున్న ఒక్కొక్క కుటుంబానికి 5 సెంట్ల స్థలం, రూ.9.20 లక్షలు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద అందించారు. ఈ విమానశ్రయం పూర్తయితే పత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కీలకమైన బీచ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే.. ముంబై, గోవా, చెన్నై తరహాలో పర్యాటక అభివృద్ధి జరగనుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో రియల్ ఎస్టేట్ రంగం భారీగా పుంజుకునే అవకాశం ఉంది.
పనుల పరుగు ఇలా..
విమానాశ్రయంలో అనుసంధాన రన్‌వేను నిర్మిస్తున్నారు.
జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్టుకు సువిశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
అప్రోచ్ రోడ్ల నిర్మాణం వడివడిగా సాగుతోంది.
ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బంది నివాస గృహాలను పూర్తి చేస్తున్నారు.
రామచంద్రపేట సమీపంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
తాగునీటి కోసం చంపావతి నది నుంచి ప్రత్యేక లైన్‌ను నిర్మిస్తున్నారు.
ప్రపంచస్థాయి ప్రత్యేకతలు!
దేశంలో ఎక్కడా లేని విధంగా 3.8 కిలోమీటర్ల మేర రన్‌వే.
విమానాల టేకాఫ్, ల్యాండింగ్ అత్యంత సౌకర్యవంతం.
విమాన ప్రయాణికులకు సముద్ర అందాలు, బీచ్‌కారిడార్ సొబగుల కనువిందు. పైనుంచి చూస్తే మీనాకృతి (చేప ఆకారం)లో అచ్చరువొందించనుంది. పక్కల నుంచి చూస్తే ఎగిరే విమానాకారంలో కనువిందు చేయనుంది.
ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఇంటీరియర్ డిజైన్. ఎయిర్ పోర్టు సమీపంలో ప్రఖ్యాత తాజ్ గ్రూప్ హోటల్ ఏర్పాటు కానుంది.
విశాఖ నుంచి భోగాపురం వరకు మెట్రో రైలు రానుంది. ఏడాదికి 35లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు.
1,360 దేశీయ విమానాలు, 560 అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలు.
టెర్మినల్‌లో 300 ఇన్‌కమింగ్, 700 అవుట్ గోయింగ్ లక్ష్యం.
ఇది కూడా చదవండి..
Lightning Strike: క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి
Minister Narayana: గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం
YSRCP: అధికారం కోల్పోయినా.. అరాచకాలు ఆగలేదు
10th class Students: సార్, ఛాయ్ తాగండి, నన్ను పాస్ చేయండి
CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..
CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి
For Andhrapradesh News And Telugu News