Bhogapuram Airport Land: భోగాపురానికే ఆ 500 ఎకరాలు
ABN , Publish Date - May 24 , 2025 | 04:40 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్ హయాంలో వెనక్కి తీసుకున్న 500 ఎకరాలను మళ్లీ అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల విమానాశ్రయ నిర్మాణానికి తగిన స్థలం పూర్తిగా సిద్ధమవుతుంది.

అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కోసం తిరిగి అప్పగించిన సర్కారు
జగన్ హయాంలో వెనక్కి లాక్కున్న వైనం
తాజాగా ఆ భూమి జీవీఐఏఎల్‌కు అప్పగింత
ఉత్తర్వులు జారీ చేసిన సెక్రటరీ యువరాజ్
అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మణిహారం కానున్న భోగాపురం ఇంటర్నేషల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్(జీవీఐఏఎల్) నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థకు కేటాయించిన భూమిలో గత జగన్ ప్రభుత్వం 500 ఎకరాలను వెనక్కి తీసుకుంది. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీనిని ఇటీవల సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ఆ 500 ఎకరాలను తిరిగి భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికే కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మౌలిక సదుపాయల కల్పనా శాఖ కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. గత టీడీపీ హయాంలోనే భోగాపురం ఇంటర్నేషల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు 2,703.32 ఎకరాలను కేటాయించారు. అయితే.. 2019లో గద్దెనెక్కిన జగన్... మార్గదర్శకాలకు విరుద్ధంగా దీనిలో 500 ఎకరాలను 2022లో వెనక్కి తీసుకున్నారు. ఇలా భూమిని వెనక్కులాక్కోవడాన్ని అప్పట్లో ఆయన చాలా ఘనమైన వ్యూహంగా ప్రకటించుకున్నారు. అయితే, ఇలా భూములు లాక్కోవడం వల్ల తొలిదశలో 60 లక్షల మంది, రెండో దశలో 1.2 కోట్ల మంది ప్రయాణికులకు మౌలిక సదుపాయాలను కల్పించలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్నే జీఎంఆర్ సంస్థ పలు దఫాలుగా నాటి సీఎం జగన్‌కు వివరించింది. కానీ, ఎయిర్‌పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి జీఎంఆర్‌ను తప్పించాలన్న ఉద్దేశంతో ఉన్న జగన్.. ఆ 500 ఎకరాలను గుంజుకున్నారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఇక, 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక విమానాశ్రయ నిర్మాణం కోసం కేటాయించిన 2,703.32 ఎకరాల్లో కోత కోసిన 500 ఎకరాలను మళ్లీ కేటాయించాలని జీఎంఆర్ ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించింది.
అదేవిధంగా విమనాశ్రయం నిర్మాణ వ్యయం రెట్టింపై రూ.4,600కోట్లకు చేరిందని పేర్కొంది. జీవీఐఏఎల్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించేందుకు చంద్రబాబు మంత్రుల కమిటీని నియమించారు. దీనిపై అధ్యయనం చేసిన కమిటీ నివేదిక సమర్పించింది. దీనిని తాజా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. దీంతో.. జీవీఐఎఎల్‌కు గతంలో కోత కోసిన 500 ఎకరాలను తిరిగి అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. ఇదిలావుంటే, ఆనాడు జగన్ విధ్వంసానికి పూనుకోకపోతే.. ఈ పాటికే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పనులు పూర్తయి, విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చేవని అధికారులు చెబుతున్నారు.
ఆది నుంచి అదే విషం!
భోగాపురం ఇంటర్నేషల్ గ్రీన్‌ఫీల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పలు మార్గదర్శకాలు రూపొందించింది. అదేవిధంగా టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ రిపోర్టు కూడా నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం విమానాశ్రయ నిర్మాణానికి 2,703.32 ఎకరాలు అవసరమని తేల్చారు. కానీ, భోగాపురం ఎయిర్‌పోర్టుపై వైసీపీ ప్రభుత్వం ఆది నుంచి విధ్వేష విధానమే అవలంభించింది. విమానాశ్రయం కోసం భూములు కోల్పోయిన వారికి సకాలంలో పరిహారం చెల్లించకుండా నానా అగచాట్లకు గురిచేసింది. ఎయిర్‌పోర్టుకు కేటాయించి భూములు చాలా ఎక్కువగా ఉన్నాయని, జీఎంఆర్‌తో చంద్రబాబు కుమ్మక్కై రియల్ ఎస్టేట్ చేసేందుకు కుట్ర పన్నారని జగన్ ఆరోపించారు. నిర్మాణ బాధ్యల నుంచి జీఎంఆర్‌ను తప్పించేందుకు ప్రయత్నించారు. దీనిలో భాగంగానే 500 ఎకరాలను వెనక్కి తీసుకున్నారు.