Excise Rules: ఉదయాన్నే బార్లు బార్లా!
ABN , Publish Date - Feb 28 , 2025 | 03:28 AM
మద్యం అమ్మకాలకు నిర్దిష్టమైన పనివేళలు ఉన్నా.. బార్ల యాజమాన్యాలు లెక్కచేయడం లేదు. సమయ నిబంధనలను విచ్చలవిడిగా ఉల్లంఘిస్తున్నాయి.

కొన్నిచోట్ల 24 గంటలూ అమ్మకాలు
విచ్చలవిడిగా పనివేళల ఉల్లంఘన
పట్టించుకోని టాస్క్‌ఫోర్స్ విభాగం
మద్యం షాపులకు, ప్రభుత్వానికి నష్టం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు నిర్దిష్టమైన పనివేళలు ఉన్నా.. బార్ల యాజమాన్యాలు లెక్కచేయడం లేదు. సమయ నిబంధనలను విచ్చలవిడిగా ఉల్లంఘిస్తున్నాయి. నిబంధనల ప్రకారం బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకే తెరిచి ఉంచాలి. కానీ.. అనేక చోట్ల ఉదయాన్నే బార్లు తెరుస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా 24 గంటలూ అమ్ముతున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఎక్సైజ్ వర్గాలు పనివేళలపై తనిఖీలు చేశాయి. అయితే దీనిపై నిరంతర నిఘా ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అటువైపు చూడటం మానేసింది. పైగా ఎక్కడైనా కొందరు అధికారులు కేసులు నమోదుకు ప్రయత్నిస్తే సిండికేట్లు వారిపైనే ఫిర్యాదులు చేస్తామని ఎదురు తిరుగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో బార్ల పనివేళల అంశాన్ని అధికార వర్గాలు చాలావరకు వదిలేశాయి. అనుకున్నంత ఆదాయం రావట్లేదని మద్యం షాపుల లైసెన్సీలు ఆవేదన చెందుతుంటే.. బార్ యాజమాన్యాల తీరుతో వారికి మరింత నష్టం వాటిల్లుతోంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి
పనివేళల ఉల్లంఘనలతో పాటు కొన్ని బార్లు ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చే చర్యలకూ పాల్పడుతున్నాయి. నిబంధనల ప్రకారం బార్ లైసెన్సీలు, షాపు లైసెన్సీలు నేరుగా ప్రభుత్వం నుంచే మద్యం కొనుగోలు చేయాలి. అయితే షాపులతో పోలిస్తే బార్ల లైసెన్సీలు 10 నుంచి 13శాతం అదనపు ధరకు మద్యం కొనాలి. అంటే ఏదైనా ఒక సీసాను షాపు లైసెన్సీ రూ.85తో కొంటే.. అదే సీసాను బార్ లైసెన్సీ రూ.98 చెల్లించి కొనాలి. బార్లలో ఎమ్మార్పీ నిబంధనలు ఉండవు కాబట్టి అదనపు ధరలకు ప్రభుత్వం బార్లకు మద్యం సరఫరా చేస్తుంది. అయితే కొందరు ఈ అదనపు ధరలను తప్పించుకొనేందుకు మద్యం షాపుల నుంచి కొంత మద్యాన్ని తీసుకొచ్చి బార్లలో అనధికారికంగా అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో ప్రభుత్వానికి బార్ల నుంచి అదనపు ఆదాయం తగ్గుతోంది.