Bapatla News: లెక్కే లేదు... అమలు ఇంకెక్కడ...
ABN , Publish Date - Nov 20 , 2025 | 07:58 AM
పట్టణాల్లో వీధి కుక్కలు ఇంకా రోడ్లపై గుంపులుగా చేరి మొరుగుతూనే ఉన్నాయి. జనం పిక్కల బలానికి పరీక్షలు పెడుతూనే ఉన్నాయి. కుక్కకాటుతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు.
- మొక్కుబడిగా వీధి కుక్కల బెడద నియంత్రణ
- స్థానికంగా పక్కాగా లేని శునకాల లెక్క
- స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ అంతంత మాత్రమే..
- సుప్రీం గడువు దాటినా..కమిటీలతోనే సరి..
- అలసత్వం, ఆటంకాలు, నిధుల కొరత..
బాపట్ల: పట్టణాల్లో వీధి కుక్కలు ఇంకా రోడ్లపై గుంపులుగా చేరి మొరుగుతూనే ఉన్నాయి. జనం పిక్కల బలానికి పరీక్షలు పెడుతూనే ఉన్నాయి. కుక్కకాటుతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు. వీధి కుక్కల కారణంగా ఎవరి ప్రాణాలకు హాని కలగకూడదని, వాటి నియంత్రణ, జన సమూహాల్లో సంచారం లేకుండా చూడాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన రెండు వారాల గడువు పూర్తయిపోయింది. చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాల సీఎస్‌లనే బాధ్యులను చేస్తామని కూడా స్పష్టం చేసింది.
గుంటూరు, బాపట్ల, ప ల్నాడు జిల్లాల్లో పరిశీలిస్తే.. ఒకటి, రెండు పురపాలికల్లో మినహా కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. స్టెరిలైజేషన్, ఆహారం అందించేందుకు ఒక్కో వీధి కుక్కకు రూ.1,650 ఖర్చు చేయాలని, ప్రత్యేక కమిటీల సాయంతో వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే, చాలా మున్సిపాలిటీల్లో వీధి కుక్కలు, పెంపుడు కుక్కల లెక్కే సరిగా లేదంటే.. ఉత్తర్వుల అమలు తీరు ఏమేర ఉందనేది అర్థమవుతోంది.
శిథిలావస్థలో కేంద్రాలు..
స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్‌కు అవసరమైన కేంద్రాలు అందుబాటులో లేవు. ఉదాహరణకు తెనాలి పట్టణానికి సంబంధించి వ్యాక్సినేషన్, సంరక్షణ కేంద్రాన్ని రూ.12 లక్షలతో ఏడేళ్ల క్రితం కంపోస్టు యార్డులో నిర్మించారు. దీనిని సరిగా వినియోగించకపోవడంతో షెడ్‌లు శిథిల స్థితికి చేరాయి. పరికరాలు కూడా పనికి రాకుండా పోయాయి. ఇదే పరిస్థితి మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఉంది. కొన్ని మున్సిపాలిటీల్లో అసలు కేంద్రాలే ఏర్పాటు కాలేదు. ఉన్న కేంద్రాల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకం లేదు.

కమిటీలు ఇలా..
సుప్రీం ఆదేశాల మేరకు.. శునకాల నుంచి పిల్లల రక్షణకు తీసుకుంటున్న చర్యలను స్థా నిక సంస్థలు వెల్లడించాలి. ఫిర్యాదులను తీ సుకుని.. తక్షణం స్పందించే వ్యవస్థను ఏర్పా టు చేయాలి. నిబంధనల అమలు కోసం ఆరుగురు సభ్యులతో కమిటీ వేయాలి. పశు సంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి సభ్యులను నియమించాలి. ఈ కమిటీలకు పురపాలికల్లో కమిషనర్, పంచయతీల్లో కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు.
- తెనాలి పట్టణంలో 1,450 వీధి కుక్కలు మాత్రమే ఉన్నాయనడం ఆశ్చర్యం కలిగించే విషయం. వీటిలో 350 కుక్కలకు మాత్రమే ఆపరేషన్లు చేయాలని ఒక లెక్క చెబుతోంది. అసలు స్టెరిలైజేషన్ పనిచేయకపోతే ఏ విధంగా మిగిలిన వాటికి వ్యాక్సిన్, ఆపరేషన్‌ల ప్రక్రియ పూర్తిచేశారనేది సందేహం.
- సత్తెనపల్లి మునిసిపాలిటీ పరిధిలో రెండు వందలకు పైగా కుక్కలకు వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. మరో ఆరు వందల వరకు కుక్కలు రోడ్లపై తిరుగుతున్నాయి. సు ప్రీం ఆదేశాల మేరకు మునిసిపల్ కమిష నర్ ఆనంద్‌కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ విజయ సారథి ఆపరేషన్ థియేటర్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఆపరేషన్ అనంతరం కుక్కలను ఉంచేందుకు షెల్టర్ నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ నెల చివరిలో జరిగే కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందగానే నిర్మాణ పనులు ప్రారంభించ నున్నట్లు అధికారులు తెలిపారు.
- నరసరావుపేట మునిసిపాల్టీల పరిధిలో సమూరు 450 కుక్కలను మునిసిపాల్టీ అధికారులు గుర్తించారు. ఇప్పటికి 165 కుక్కలను పట్టి వాటికి స్టెరిలైజేషన్ చేశా రు. అనంతరం వాటిని తిరిగి వాటి అస లు స్నానాల్లోనే వదులుతున్నారు. నిర్దేశిత లక్ష్యాల సాధనపై ఎప్పటికప్పుడు ఉన్నతా ధికారులు సమీక్షిస్తున్నారు.
- బాపట్లలో వీధికుక్కల సంతానోత్పత్తి నియంత్రణకు రైలుపేట స్మశానవాటికలో శస్త్ర చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. రూ.6 లక్షలు వెచ్చించి షెడ్, బోన్‌లు, ఏసీ, ఆపరేషన్ పరికరాలు ఏర్పాటు చేశారు. పట్టణంలో 1000 వీధి కుక్కలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో 800 కుక్కలకు శస్త్ర చికిత్స చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయినప్పటికి సూర్యలంక రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డు, ఎల్‌ఐసీ కార్యాలయం రోడ్డు, జీబీసీ రోడ్డు, జమ్ములపాలెంరోడ్డు తదితర ప్రాంతాల్లో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉంది. శానిటరి ఇన్‌స్పెక్టర్ సయ్యద్ నజీర్‌ను వివరణ కోరగా స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత షెల్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
- అద్దంకి పట్టణంలో 420 కుక్కలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బుధవారం వరకు 96 కుక్కలను సత్తెనపల్లికి పంపినట్లు మున్సిపల్ కమీషనర్ రవీంద్ర తెలిపారు. వారం రోజుల్లో అన్నింటిని పట్టుకొని వ్యాక్సినేషన్ చేయిస్తామన్నారు. అయితే స్థానికుల నుంచి అభ్యంతరాలు వస్తుండటంతో ఒ కింత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. గ్రామాలలో మాత్రం అధికారులు అసలు పట్టించుకోవడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News